దుకాణం మూసేసినా.. పన్ను కట్టాల్సిందే!
* పాత బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయం
* వచ్చే నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్
* పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.5,200 కోట్లు
* మూతపడ్డ పరిశ్రమలు, సంస్థలపై సర్కార్ దృష్టి
* వసూళ్లపై సీటీవోలకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మూతపడ్డ సంస్థల నుంచి రావలసిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాత బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఉన్న సంబంధిత సంస్థలు, వ్యక్తుల నుంచి దాదాపు పదేళ్ల నుంచి రూ.5,200 కోట్లు బకాయిల రూపంలో రావలసి ఉందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఈ మేరకు మూతపడ్డ సంస్థలు, పరిశ్రమలతో పాటు దేశంలోని వివిధ కంపెనీలతో లావాదేవీలు జరిపి చేతులెత్తేసిన డీలర్ల వివరాలను సర్కిళ్ల వారీగా సంపాదించేందుకు ఇప్పటికే సీటీవోలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు సర్కిళ్లలోని సీటీవోల ద్వారా బకాయిలు వసూలు చేయాల్సి ఉంటుంది. కాగా రూ.5,200 కోట్ల బకాయిల్లో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు రూ.4వేల కోట్ల వరకు రావలసి ఉందని సమాచారం.
వ్యాట్‌కు ముందు.. తరువాత...
దేశవ్యాప్తంగా 2005 ఏప్రిల్ నుంచి విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులోకి వచ్చింది. అంతకు ముందు అమ్మకపు పన్ను వసూలు చేసేవారు. అయితే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ అమలైన సమయంలో అప్పటి వరకు ఉన్న బకాయిల గురించి అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. కొందరు డీలర్లు కూడా వ్యాట్ పరిధిలోకి రావడం ఇష్టం లేక వ్యాపారాలను మూసేసినట్లు ప్రకటించి, బకాయిలు చెల్లించలేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలు తమ లావాదేవీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకుండా పన్ను ఎగవేతకే ప్రాధాన్యమిచ్చాయి.
అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ద్వారా లావాదేవీలు జరిపిన వేలాది మంది డీలర్లు కూడా మూతపడ్డ కంపెనీ (క్లోజ్డ్ కేస్) ఖాతాలో చేరిపోయారు. మూతపడ్డ, ఖాయిలా పరిశ్రమల విషయంలో వాణిజ్యపన్నుల శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్‌కు ముందు, తరువాత ఇప్పటి వరకు మూతపడ్డ కేసుల ఖాతాలో రూ. 5,200 కోట్ల మేర పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పాత బకాయిలపై అధికారులు సమీక్షించి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల రావలసిన బకాయిలు మరో రూ. 4,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు.
రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తాం: కమిషనర్
వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, ఇతర పన్నుల రూపంలో రావలసిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. మూతపడ్డ వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలకు సంబంధించి బకాయిలు ఉన్నవారు వెంటనే సంబంధిత సీటీవోలను సంప్రదించి, పన్నులు చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు.