ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సీసీఎల్‌ఏ
రెండు, మూడు నెలల్లో శాశ్వత పరిష్కారాల సిఫారసు: ధరణి పునర్నిర్మాణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్‌ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్‌ఏ సూచించారు.
ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్
ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్‌మెంట్‌ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు.
అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.
అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment