‘ధరణి’తో సమస్యలు పెరిగాయి | Telangana High Court Comments On Dharani Portal | Sakshi
Sakshi News home page

‘ధరణి’తో సమస్యలు పెరిగాయి

Published Fri, May 5 2023 1:19 AM | Last Updated on Fri, May 5 2023 11:32 AM

Telangana High Court Comments On Dharani Portal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో రైతుల సమస్యలు పెరిగాయని, ఎక్కడికి పోయి వీటిని పరిష్కరించుకోవాలో తెలియ­ని సందిగ్ధ పరిస్థితి నెలకొందని పేర్కొంది. పొరపాట్లను సరిచేసుకునే ఆప్షన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పింది.

బ్రోకర్లకే లబ్ధి అనేలా ధరణి పోర్టల్‌ తయారైందని.. ఇన్నేళ్లయినా సమస్యలు పరిష్కరించకపోవడం ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందని సర్కార్‌ను మందలించింది. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యలపై దాఖలైన పలు పిటి­షన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను కో­ర్టుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరై 4 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఆర్డర్‌ కాపీలో ధరణిలోని పలు సమస్యలను ప్రస్తావించారు. 

 ధరణిలో హైకోర్టు పేర్కొన్న ప్రధాన సమస్యలు 
1. డేటా సవరణ కోసం పెట్టుకున్న ఆన్‌లైన్‌ అర్జీలను పరిష్కరించకపోవడం 
2. నిర్ణీత సమయంలో ఈ–పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను జారీ చేయకపోవడం 
3. సర్వే కోసం ఎఫ్‌–లైన్‌ దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోకపోవడం.. కాలవ్యవధి పాటించకపోవడం 
4. వేలంలో కొనుగోలు చేసిన వారికి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు జారీ చేసిన కొనుగోలు డాక్యుమెంట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం 
5. ఏ కారణాలు చెప్పకుండా ఆన్‌లైన్‌/ఎఫ్‌–లైన్‌ దరఖాస్తులను తిరస్కరించడం 
6. సెక్షన్‌ 7కు లిమిటేషన్‌ పీరియడ్‌ వివరంగా చెప్పలేదు. ఎప్పటినుంచి న్యాయస్థానం డిక్రీలు పరిగణనలోకి తీసుకుని మార్పు చేస్తారో చెప్పలేదు. 
7. అమ్మకం, కొనుగోలు లావాదేవీలను సకాలంలో పూర్తి చేయడానికి ధరణిలో అప్‌లోడ్‌ చేసిన జనరల్, స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీలను పట్టించుకోకపోవడం. 
8. ఆర్వోఆర్‌ చట్టం సెక్షన్‌ 7లో పేర్కొన్న ‘కోర్టు డిక్రీ’ అనే దానిలో స్పష్టత లేదు. 
9. కోర్టు కేసులు, స్టే, ఇంజెంక్షన్‌ ఆదేశాల్లో వివాదం ఉన్న భూమి మాత్రమే కాకుండా.. సదరు సర్వే నంబర్‌లోని భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పెడుతున్నారు.  
10. కొత్త ఆర్వోఆర్‌ యాక్ట్‌ రాకముందు పాత ఆర్వోఆర్‌ చట్టం–1971లోని సెక్షన్‌ 5(బీ), 5(5), 9 కింద రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై అప్పీల్‌ లేదా రివిజన్‌కు అవకాశం కల్పించే ప్రొవిజన్లు లేవు. దీంతో కొత్త చట్టం రాకముందు అధికారులిచ్చిన ఆదేశాలను సవాల్‌ చేయడానికి తెలంగాణ జనరల్‌ క్లాజెస్‌ చట్టం–1891 కింద అప్పీల్‌కు అవకాశం ఇవ్వాలని కొందరు పిటిషన్లు వేస్తున్నారు.
 
11. పాత ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై అప్పీళ్లు, రివిజన్‌ పిటిషన్‌లను కొత్త ఆర్వోఆర్‌ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునళ్లకు పంపాల్సి ఉంటుంది. అలాంటి అప్పీళ్లను ఇప్పటికీ ప్రత్యేక ట్రిబ్యునళ్లకు పంపలేదు. 
12. అగ్రికల్చర్‌ నుంచి నాన్‌ అగ్రికల్చర్‌కు మారిన భూమి మాత్రమే కాకుండా మొత్తం ఆ సర్వే నంబర్‌ను ‘నాలా’ జాబితాలో చూపిస్తున్నారు. 
13. రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)లో నమోదైన భూమిలో కొంత భాగాన్ని మార్చడానికి ఎటువంటి ఆప్షన్‌ అందుబాటులో లేదు. 
14. పొరపాటున ఏదైనా సర్వే నంబర్‌ నిషేధిత జాబితాలో చేరినా.. ప్రభుత్వ భూమి అని నమోదైనా దానిని మార్చడానికి ఆప్షన్‌ అందుబాటులో లేదు. 
15. మ్యుటేషన్‌ చేయాలని కోరుతున్న వ్యక్తికి ఉన్న టైటిల్‌ను తనిఖీ చేయడం అధికారులకు కష్టమైన పనిగా మారింది. మ్యుటేషన్‌ చేయాలని కోరుతున్న భూమి లింక్‌ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసేలా ఆప్షన్‌ ఉండాలి.  
16. ఉమ్మడిగా కొనుగోలు చేసిన భూమి లేదా ఉమ్మడి పట్టాదారుల మధ్య ఉన్న భూమిని హక్కుదారుల మధ్య విభజించడానికి ఎలాంటి ఆప్షన్‌ లేదు. 
17. చనిపోయిన విక్రయదారు వారసుల నుంచి పట్టా పొందే వీలు లేదు. 
18. మిస్సింగ్‌ సర్వే నంబర్లు మళ్లీ చేర్చడానికి, తప్పుడు ఎంట్రీలు మార్చే ఆప్షన్‌ లేదు. 
19. భూ యజమాని నుంచి ప్రభుత్వం భూమి సేకరించిన తర్వాత ఆ భూమిని డిలీట్‌ చేయడానికి ఆప్షన్‌ ఇవ్వలేదు.  
20. అలాగే ప్రభుత్వం అసైన్‌ చేసిన భూముల వివరాలు కూడా ధరణిలో కనిపించడం లేదు. 
► ఇవికాక కోర్టు దృష్టికి రాని ఎన్నో సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement