పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్‌లో కొత్త ట్విస్ట్
76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించామన్న ప్రభుత్వం
ఆన్‌లైన్‌లో మాత్రం అప్‌డేట్ కాని వివరాలు
అదీకృత లాగిన్‌లు ఇవ్వని పోర్టల్ నిర్వహణ కంపెనీ
ప్రస్తుతం కలెక్టర్ల చేతిలో మాత్రమే అప్‌డేట్ చేసే అవకాశం.. అక్కడి నుంచే అన్ని దరఖాస్తుల పరిష్కార వివరాలు నమోదు చేయలేని పరిస్థితి
ఇంకా పరిష్కరించాల్సిన పెండింగ్ దరఖాస్తులు భారీగానే..
ఈనెల 1 నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదనే అభిప్రాయాలు..
అసలు ముఖ్య అధికారి అభ్యంతరం చెప్పినా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సర్కారు?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలకు పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌లో 76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ వివరాలేవీ పోర్టల్‌లో అప్‌డేట్ కాలేదు. అంతేకాదు పోర్టల్‌లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పెట్టుకున్న గడువు కూడా ముగిసింది.
అయినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు మిగిలిపోయాయి. దీనితో డ్రైవ్‌ను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీ అవసరమైన లాగిన్‌లు ఇవ్వకపోవడంతోనే దరఖాస్తుల పరిష్కార వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోతున్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదన్న భావనలో రెవెన్యూ వర్గాలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో గందరగోళం
రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో పరిష్కారం కోసం వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం వివిధ స్థాయిల్లో పరిష్కరించింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్‌ఏ స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కానీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాలేదు.
ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి కేవలం కలెక్టర్లు, సీసీఎల్‌ఏ వద్ద మాత్రమే డిజిటల్‌తోపాటు అధీకృత లాగిన్‌లు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు లాగిన్‌లు లేవు. గతంలో తహసీల్దార్లకు డిజిటల్ లాగిన్‌లు ఇచ్చినా.. దరఖాస్తులను పరిష్కరించినట్టుగా పేర్కొని అప్‌డేట్ చేసే అదీకృత లాగిన్‌లు లేవు. అ«దీకృత లాగిన్‌లు ఇచ్చేందుకు మరో 10–20 రోజుల సమయం పడుతుందని ‘ధరణి’ నిర్వహణ కంపెనీ చెప్తున్నట్టు తెలిసింది.
గడువు ముగిసిపోయినా..
స్పెషల్ డ్రైవ్ ప్రారంభానికి ముందే.. అన్నిస్థాయిల్లో అదీకృత లాగిన్‌లు ఇవ్వాలని పోర్టల్ నిర్వహణ కంపెనీని కోరినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇప్పటివరకు ఆ లాగిన్‌లు ఇవ్వలేదని.. పరిష్కారమైన దరఖాస్తుల్లోని భూముల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే వీలు లేకుండా పోయిందని అంటున్నాయి. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం పెట్టిన గడువు కూడా ముగిసింది.
దరఖాస్తులు ఇంకా భారీగా పెండింగ్‌లో ఉండటంతో డ్రైవ్‌ను పొడగించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లో లాగిన్‌లు వచ్చేదాకా పరిష్కారమైన దరఖాస్తుల వివరాలన్నీ కలెక్టర్ల లాగిన్‌లకు పంపి అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి మధ్య ఉన్న కలెక్టర్ల పరిధిలో ఈ ప్రక్రియ కష్టమని స్పష్టం చేస్తున్నాయి.
స్పెషల్ డ్రైవ్‌కు అభ్యంతరం చెప్పినా..?
వాస్తవానికి ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టవద్దనే చర్చ ఉన్నతస్థాయిలో జరిగినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద జరిగిన చర్చల సందర్భంగా.. రెవెన్యూ శాఖలోని ముఖ్య అధికారి ఒకరు స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు అభ్యంతరం చెప్పారని, ఎన్నికల కోడ్ వస్తే ఆపేయాల్సి వస్తుందని సూచించారని సమాచారం.
ఎన్నికల కోడ్‌కు, ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి సంబంధం ఉండదని.. 2017లో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ధరణి కమిటీలోని ఓ సభ్యుడు చెప్పడంతో స్పెషల్‌డ్రైవ్ ప్రకటన జరిగిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించే సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చిందని తెలిసింది.
రాష్ట్రంలో రెగ్యులర్ సీసీఎల్‌ఏను నియమిస్తేనే ధరణి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందని సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా ధరణి కమిటీలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ధరణి’పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నిస్థాయిల్లో లాగిన్‌లను ధరణి పోర్టల్ నిర్వహణ కంపెనీ ఎప్పటికి సమకూరుస్తుంది? స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏ మేరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment