సాక్షి, హైదరాబాద్: రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ... ఈ మూడు సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఆధార్ నంబర్ అడగడం చట్టబద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సంక్షేమ పథకాల అమలు కోసం ఆధార్ వివరాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధరణిలో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఆధార్, కులం వివరాలు అడగరాదంటూ నవంబర్ 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి చట్టం లేకుండా ధరణిలో ఆస్తుల నమోదుకు ఆధార్, కులం వివరాలు అడగాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
పాత విధానంలోనే వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్లాట్ విధానాన్ని కూడా నిలిపివేశామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఆధార్ వివరాలు అడగడం చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే తాము ఈ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ విధానం కొనసాగుతుందని తెలిపారు. వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఆధార్, కులం వివరాలు అడగరాదంటూ నవంబర్ 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు.
పారదర్శకతకే ధరణి
‘‘రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు, బీమా, రుణ మాఫీ పథకాలను వర్తింప జేస్తోంది. రైతు బంధు కింద ఎకరాకు ఏటా రూ.10 వేలు పంట పెట్టుబడి కోసం సాయం అందిస్తోంది. రైతు బీమా కింద రైతు చనిపోతే రూ.5 లక్షలు పరిహారం ఇస్తోంది. రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. ధరణిలో నమోదు చేసుకోవడం ద్వారా పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఎలక్ట్రానిక్ విధానంలో ఉంటాయి. రుణం ఇవ్వాలంటే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఎలక్ట్రానిక్ విధానంలో రికార్డులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవచ్చు. రైతులు భౌతికంగా పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ చూపించాల్సిన అవసరం ఉండదు. ఈ వివరాలన్నీ తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (టీఎల్‌ఆర్‌ఎంఎస్)లో భద్రపరుస్తాం.
ధరణి ద్వారా రెవెన్యూ విభాగంలో పారదర్శకత పెంపొందించడంతో పాటు అవినీతిని రూపుమాపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్రజలకు సుపరిపాలన అందించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది’’అని సీఎస్ పిటిషన్‌లో వివరించారు. ఎప్పటి నుంచో ఆధార్ వివరాలు ఇస్తున్నామని, ఇప్పుడు ఇవ్వడం వల్ల నష్టమేంటని ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డిని ప్రశ్నించింది. సీఎస్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment