ఆధార్‌ అడగొద్దు.. కులం వివరాలు కోరొద్దు | Dont Ask Aadhaar For Online Registration Says TS High Court | Sakshi
Sakshi News home page

ఆధార్‌ అడగొద్దు.. కులం వివరాలూ కోరొద్దు

Published Fri, Dec 18 2020 1:58 AM | Last Updated on Fri, Dec 18 2020 1:59 PM

Dont Ask Aadhaar For Online Registration Says TS High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్‌ నంబర్లు, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా, సాక్షుల ఆధార్‌ నంబర్లను కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోవడంతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామని, అయితే ప్రభుత్వం తెలివిగా స్లాట్‌ బుకింగ్‌ సమయంలో ఆధార్‌ తదితర వివరాలు కోరుతోందని మండిపడింది. ఈ సమాచారాన్ని అడగబోమని హామీ ఇచ్చి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తంచేసింది. న్యాయస్థానం పట్ల ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలని హితవు పలికింది. స్లాట్‌ బుకింగ్‌ మాన్యువల్‌లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా తదితర వివరాలు కోరుతూ ఉన్న కాలమ్స్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అప్పటి వరకు స్లాట్‌ బుకింగ్, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ (పీటీఐఎన్‌) ఇచ్చే ప్రక్రియను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

పీటీఐఎన్‌ జారీకి కూడా ఆధార్‌ తదితర వివరాలు అడగానికి వీల్లేదని, అయితే ఏదైనా ఇతర గుర్తింపు కార్డుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎటువంటి చట్టం లేకుండా ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల నమోదు చేసుకోవాలని.. అందుకు ఆధార్, కులం వివరాలు ఇవ్వాలని కోరడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాదులు గోపాల్‌శర్మ, సాకేత్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. స్లాట్‌ బుకింగ్‌ కోసం 29 పేజీలను నింపాల్సి ఉందని, అందులో ఆస్తులు అమ్మే, కొనే వారి ఆధార్‌ తదితర వివరాలను కోరుతున్నారని పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాది కృతి కలగ వాదనలు వినిపించారు.

ఎంతమంది ఆధార్‌ అడుగుతారు?
‘‘ప్రజల సౌకర్యం కోసం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందు స్లాట్‌ విధానం అమలుకు అనుమతి తీసుకొని.. తప్పుడు విధానాల్లో ఆధార్, కులం వివరాలు కోరడమేంటి? రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే 29 పేజీలు నింపాల్సి వస్తోంది. ఇందులో ఆస్తులు అమ్మేవారి, కొనేవారి ఆధార్‌ నెంబర్లు, వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ నెంబర్లు, కులం వివరాలు, చివరికి సాక్షుల ఆధార్‌ వివరాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎంతమంది ఆధార్‌ నెంబర్లు కోరతారు? వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్, కులం వివరాలు అడగబోమని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మాన్యువల్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు 14 మంది సోదరులు ఉన్నారనుకుందాం. అందులో ఒక సోదరుడు ఆస్తి అమ్ముకోవాలంటే మిగిలిన 13 మంది ఆధార్‌ వివరాలు అడిగితే ఎలా? అందులో కొందరు ఇక్కడుంటారు.. ఇంకొందరు ఎక్కడో ఉంటారు.

వారి వివరాలు ఇవ్వాలంటే ఎలా’’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆధార్‌ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇవ్వడం ఇష్టం లేనివారి కోసం ప్రత్యామ్నాయ విధానం ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. అసలు ఆధార్, కులం వివరాలు సేకరించడానికే వీల్లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఉందని చెప్పడం ఏంటంటూ ధర్మాసనం మండిపడింది. ఈ వివరాలు తొలగిస్తూ మాన్యువల్‌ను సవరిస్తామని ఏజీ హామీ ఇవ్వగా.. మీ హామీని నమ్మలేమని, సవరించిన మాన్యువల్‌ను సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ధరణి వెబ్‌పోర్టల్‌ నిబంధనలు ఏజెన్సీ ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు వర్తించవంటూ దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌పై పిటిషనర్‌ తరఫు న్యాయవాది రిప్‌లై దాఖలు చేసేందుకు గడువునిస్తూ తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement