సాక్షి, హైదరాబాద్: కులరహిత సమాజం కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం అవి మరింత బలంగా మారే పనులు చేయడం దారుణమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుల ప్రాతిపదికన భూములు ఎలా కేటాయిస్తారు.. వారు కట్టుకొనే కమ్యూనిటీ భవన్‌లలోకి ఇతర కులాలను అనుమతిస్తారా? అని ప్రశ్నించింది.
ప్రభుత్వం అలా ఎలా భూములు కేటాయిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? ఈ రకమైన వివాహాలకు ఏదైనా సాయం అందిస్తోందా? కుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేయాలి.
21వ శతాబ్దంలో కూడా కులాల ఆధారిత విభజన ఉందంటే.. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇలాంటి ఆలోచ నలు చాలా సంకుచితమైనవి.. అసంబద్ధమైనవి’ కకులాల మధ్య మరింత అంతరాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్లు అనిపిస్తుంది. అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. కర్ణాటకలోనూ లింగాయత్ కమ్యూనిటీ విద్యాసంస్థలు, చారిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మార్కెట్ విలువకే ప్రభుత్వం నుంచి భూములు తీసుకుందని.. ఇలా కుల ప్రాతిపదికన భూములు కేటాయించడం సమర్థనీయమా అని ప్రశ్నించింది.
ప్రభుత్వాలు ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కమ్మ, వెలమ కులాలకు 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలోని అత్యంత విలువైన భూములను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఎకరం విలువ రూ. 50 కోట్లకుపైనే...
పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘ఖానామెట్ విలేజ్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) రహదారికి ఆనుకొని హైటెక్ సిటీ రోడ్డుకు పక్కన ఉన్న 5 ఎకరాల భూమిని ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు, అయ్యప్ప సొసైటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న మరో 5 ఎకరాల భూమిని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించింది.
ఈ రెండూ రాష్ట్రంలో అత్యంత ధనిక కులాలు. కేటాయించిన భూములు కూడా అత్యంత విలువైనవి. ఎకరం రూ. 50 కోట్లకుపైనే ఉంటుంది’అని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వం ఈ రెండు కులాలకు మాత్రమే భూములు ఇవ్వలేదు.. అనేక ఇతర కులాలకు కూడా కమ్యూనిటీ భవన్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించింది.
జీవో నంబర్ 571 ఆధారంగా మార్కెట్ విలువ మేరకు భూములు కేటాయించింది. ఇతర కులాల్లో పేదలు ఎక్కువ శాతం ఉన్నందున వారికి మార్కెట్ విలువలోనూ తగ్గింపు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కులాలకు భూకేటాయింపులపై అసంతృప్తి వ్యకం చేసింది. ఈ పిటిషన్‌లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. వెలమ అసోసియేషన్‌కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామని పేర్కొంటూ విచారణను జూన్ 28కి వాయిదా వేసింది.
మరికొన్ని సంస్థలకు భూ కేటాయింపులపైనా...
రాజబహదూర్ వెంట్రామిరెడ్డి విద్యాసంస్థలు(రెడ్డి హాస్టల్), శారదా పీఠం, జీయర్ ట్రస్టు, దర్శకుడు ఎన్.శంకర్‌కు భూ కేటాయింపులపై దాఖలైన పిల్ కూడా సీజే ధర్మాసనం వద్ద విచారణకు వచ్చింది. రెడ్డి హాస్టల్ కేటాయింపు పిటిషన్‌లో పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే 2018లో భూమి కేటాయిస్తే ఇప్పుడు ఎందుకు పిల్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 23కు వాయిదా వేసింది.
కుల ప్రాతిపదికన భూములా?
Published Fri, Jun 16 2023 5:28 AM | Last Updated on Fri, Jun 16 2023 5:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment