సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసమే ధరణి వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ప్రజల ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేసిందని, ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు. భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పరిపాలనాపరమైన సంస్కరణలను తెచ్చిందని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని, ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
వ్యవసాయ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్న నేపథ్యంలో ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కులం వివరాలు అడగడం లేదని, పథకాల అమలులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్న వివరాలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ కోసం ఆధార్, కులం వివరాలు అడగడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సోమేష్‌కుమార్ శనివారం కౌంటర్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా కోటీ ఆరు లక్షల ఆస్తులు నమోదు చేసుకున్నారు.
ఇందులో 12,751 పంచాయతీల్లో 59 లక్షలు, 140 మున్సిపాలిటీల్లో 22 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 25 లక్షల ఆస్తుల వివరాలను నమోదు చేశారు. 1971 తెచ్చిన భూయాజమాన్య హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకత పెంచేలా నూతన చట్టాన్ని తెచ్చాం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం మున్సిపాలిటీ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ చట్టాలను సవరించాం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు గతంలో కాకుండా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కలిసి ఉంటారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ అయ్యేలా రూపకల్పన చేశాం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గతంలో లోపభూయిష్టంగా ఉండేది. ప్రస్తుత విధానంలో బయోమెట్రిక్ ద్వారా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సేకరించిన వివరాలు డేటా సెంటర్‌లో భద్రంగా ఉన్నాయి. ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు. బహిరంగంగా ఎవరికీ కనిపించవు. రికార్డుల్లో తప్పులు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించి సవరించుకోవచ్చు. సంక్షేమ పథకాల అమలులో భాగంగానే ఆధార్ వివరాలు అడుగుతున్నాం. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలి’అని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేనట్లే!
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడింది. 23న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుండగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. హైకోర్టు నుంచి అనుమతి వస్తే తప్ప రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుంచి ప్రారంభం కా వాల్సిన రిజిస్ట్రేషన్లు మరో 3, 4 రోజులు వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment