సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. ధరణి పోర్టల్‌లో కాకుండా పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్లను ఆపాలని తామెప్పుడూ ఆదేశించలేదని తెలిపింది. ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల నమోదు కొరకు ప్రభుత్వం చేస్తున్న సమా చార సేకరణ చట్టబద్దమని తేలిన తర్వాతే కొత్త విధానం (ధరణి పోర్టల్)లో రిజిస్ట్రేషన్లు చేసుకో వచ్చని, అప్పటిదాకా పాత విధానాన్నే కొనసాగిం చాలని పేర్కొంది. ధరణిలో వ్యవసాయ, వ్యవసా యేతర ఆస్తులు నమోదు చేసుకోవాలని, ఇందుకు ఆధార్ నంబర్, కులం, కుటుంబసభ్యుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్‌శర్మ, కె.సాకేత్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
‘ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదు. వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ప్రభుత్వాలు చేసే చట్టాలు, విధానాలు రాజ్యాంగబద్దంగా ఉండాలి. అప్పుడే ఆ చట్టాలు న్యాయసమీక్షలో నిలబడతాయి. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభు త్వం అనుసరిస్తున్న విధానం రాజ్యాంగబద్ధమా అన్నదే మా సందేహం. యజమానుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తారు? ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? ఆ సమాచారం లీక్ అయితే అందుకు బాధ్యులు ఎవరు? అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. ఇంత పెద్దఎత్తున సమాచారం సేకరించేటప్పుడు... దాని చట్టబద్దతపై ప్రజల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంద’ని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తప్పనిసరి అంటే ఎలా ?
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులను తప్పని సరిగా ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలనడం రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ – 300ఎ’కు విరుద్ధం. కుటుంబసభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, కులం లాంటి సున్నితమైన సమాచారం అడుగుతున్నారు. ఈ సమాచారం లీక్ కాదన్న ప్రభుత్వ హామీని నమ్మలేం... అని ధర్మాసనం పేర్కొంది. సమాచార సేకరణకు సంబంధించి ప్రభుత్వం అక్టోబరులో మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ, పంచాయతీలకు సంబంధించి మూడు వేర్వేరు జీవోలు జారీచేసిందని, ఈ రోజే అవి తమకు ఇచ్చారని, వాటినీ సవాల్ చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది డి. ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. ఈ పిటిషన్లపై తాము కౌంటర్లు దాఖలు చేస్తామని ఏజీ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment