‘ధరణి’ దారికొచ్చేనా..? రెండేళ్లయినా పరిష్కారం కాని సమస్యలు | Telangana Will Dharani Problems Solved | Sakshi
Sakshi News home page

‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు

Published Mon, Sep 5 2022 7:58 AM | Last Updated on Mon, Sep 5 2022 3:55 PM

Telangana Will Dharani Problems Solved - Sakshi

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 అక్టోబర్‌ 20న మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పైసా లంచం చెల్లించకుండా పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ధరణి పోర్టల్‌ను రూపొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే అదే పోర్టల్‌ పెద్ద సమస్యగా మారింది. ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 50 శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్‌కి సంబంధించినవే వస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం బాధితులు నెలల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు ధరణిలో పొందుపర్చినా అవసరమైనవి లేకపోవడంతో భూమి కొనుగోళ్లు, అమ్మకాలు, మ్యూటేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరణి సమస్యలపై తొలుత తహసీల్దార్‌ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్‌కు పంపిస్తే పరిష్కారం లభిస్తోంది. అయితే తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు నివేదికలు పంపించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఇందుకు పోర్టల్‌లోని సాంకేతిక లోపాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సర్కారు కొన్ని మాడ్యూల్స్‌కు అవకాశం కల్పించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. 

పని చేయని కొత్త ఆప్షన్‌.. 
ప్రభుత్వం ఇటీవల టీ ఎం–33 (పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్‌) ఆప్షన్‌ ద్వారా చేర్పులు, మార్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణకు రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్‌ పరిశీలన చేసి కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. అయితే ఈ ఆప్షన్‌ సరిగా పనిచేయనందున ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో దరఖాస్తుదారులకు ఆరి్థక ఇబ్బందులు తప్పడం లేదు. మీసేవాలో దరఖాస్తు చేసుకునేందుకు రూ.1500 వరకు ఖర్చు అవుతోందని, అయినా పని కావడం లేదని ఓ రైతు వాపోయాడు. ఈసీ ధ్రువపత్రాల జారీకి అవకాశం కల్పించి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అప్‌డేట్‌ చేయించినా సిస్టమ్‌లో జనరేట్‌ కావడం లేదు. నిషేధిత జాబితా(పీవోబీ) మాడ్యుల్లోని భూముల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 

కొనుగోలుదార్లకు ఇబ్బందులు..  
ధరణి పోర్టల్‌ ప్రారంభ సమయంలో తలెత్తిన లోపాలను సవరించే క్రమంలో భూ లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమి జాబితాలో పట్టా భూములు, సర్వే నంబర్లలో లోపాలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను అవసరానికి అమ్ముకోలేని దుస్ధితి ఏర్పడింది. గతంలో అమ్మిన వారి పేరుపైనే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తుండడంతో కొనుగోలుదార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పలు రకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భూములు అమ్ముకోలేక పోతున్నాం 
గత కొన్నేళ్లుగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందనపల్లిలో 20 మంది కలిసి ఇంటి స్థలాలు తీసుకున్నాం. గోధుమకుంటలో ఇదే సర్వే నంబర్‌తో ఉన్న వ్యవసాయ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో మా ఇంటి స్థలాలను సైతం అదే జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. 
– శ్రీనివాస్‌రావు, దమ్మాయిగూడ 

మొర పెట్టుకున్నా పరిష్కారం లేదు 
ఏన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలోని 25 గుంటలు ధరణి పోర్టల్‌లో నమోదు కాలేదు. సరి చేయాలని మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకుని తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 
– ఎన్‌.కృష్ణయాదవ్, కీసర మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement