land problems
-
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్‌గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: అనాధీనం, ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో (ఆర్ఎస్ఆర్) నమోదైన వేలాది ఎకరాల భూముల సమస్యను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రకాల భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందుకోసం 2017 చుక్కల భూముల చట్టాన్ని సవరించింది. ఈ మేరకు 2022 ఏపీ చుక్కల భూముల (సవరణ) ఆర్డినెన్స్‌ను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జారీ చేశారు. దీంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించి దాదాపు 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందుతారు. అనాధీనం భూములు అనకాపల్లి, శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉండగా, ఖాళీ (కాలమ్) భూములు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, రిమార్కుల కాలమ్‌లలో చుక్కలు ఉన్నట్లుగానే అనాధీనం, ఖాళీ (చుక్కల బదులు ఖాళీగా వదిలేసిన) భూములు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఈ కేటగిరీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలూ లేవు. ఈ తరహా భూములు ఎక్కువగా ఉన్నట్లు పలు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ఆ భూముల రైతులు చుక్కల భూముల చట్టం ప్రకారం వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తులు పెడుతున్నట్లు తెలిపారు. కానీ, చుక్కల భూముల చట్టంలో అనాధీనం, ఖాళీ భూముల ప్రస్తావన లేకపోవడంతో ఆ దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో ఈ భూముల సమస్య పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానిపై దృష్టి సారించి చుక్కల భూముల చట్టం ద్వారా వాటికి పరిష్కారం చూపింది. అనాధీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టంలో చేర్చింది. కొత్తగా ఈ చట్టంలో చుక్కల భూములతోపాటు అనాధీనం, ఖాళీ భూములు (బ్లాంక్ ల్యాండ్స్) అని రెండు కాలమ్స్‌ను అదనంగా కలిపారు. ఇకపై ఈ భూములను చుక్కల భూముల మాదిరిగానే కచ్చితమైన రికార్డులు ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు భూములుగా నిర్ధారించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించవచ్చు. అలాగే 2017 చుక్కల భూముల చట్టాన్ని కేవలం రాయలసీమ ప్రాంతంలోని భూములకే పరిమితమయ్యేలా కాలమ్ 16, 17 అని పేర్కొన్నారు. ఆ కాలమ్‌లు రాయలసీమ జిల్లాల్లో మాత్రమే ఉండేవి. కోస్తా జిల్లాల్లోని ఆర్‌ఎస్‌ఆర్‌లో 11, 12 కాలమ్ వరకే ఉండటంతో ఈ చట్టం అక్కడి జిల్లాలకు వర్తించడంలేదు. తాజా సవరణ చట్టంలో ఏ కాలమ్‌లో చుక్కలు ఉన్నా, అనాధీనం, బ్లాంక్ ఉన్నా దానికి ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. -
Telangana: కొత్త రెవెన్యూ చట్టం.. రెండేళ్లయినా బాలారిష్టాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012– 13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దర ఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లా లోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్‌లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయని తెలుస్తోంది. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. -
సర్వేతోనే సర్వం సెటిల్!
భూ సర్వేతో ఏంటి ప్రయోజనం ప్రతి గ్రామానికి ఒక పటం, ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దురాళ్ల వివరాలతో టిప్పన్ తయారు చేస్తారు. ఆ తర్వాత భూమి రకం ఏంటి?.. అంటే ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? తదితర వివరాలతో సేత్వారు తయారు చేస్తారు. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకాలు, దానం, వీలునామాతో భూమి సంక్రమిస్తే హక్కుల రికార్డులో మార్పులు చేసి పకడ్బందీగా పట్టా జారీ చేస్తారు. భూ కమతంలో విభజన జరిగితే సర్వే చేసి టిప్పన్ తయారు చేస్తారు. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: భూమి ఇక్కడ ప్రాణం కంటే విలువైనది. అందుకే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిరంతరం భూమి చుట్టే పరిభ్రమిస్తుంటాయి. స్వాతంత్య్రానికి ముందు భుక్తినిచ్చే భూమి కోసం నిజాం –దేశ్‌ముఖ్‌ల చేతుల్లో నాలుగువేల మంది నిరుపేదల అమరత్వం పది లక్షల ఎకరాలకు రైతు కూలీలను యజమానులుగా చేసిన చారిత్రిక ఘట్టం ఒకవైపు.. స్వాతంత్య్రాంతరం ఇదే నేల భూదాన ఉద్యమంలో పేద రైతాంగాన్ని నాలుగు లక్షల ఎకరాలకు భూయజమానులుగా చేసిన మహోజ్వల ఘట్టం మరోవైపు.. ఇలా దేశంలో పేదలకు పంచిన ప్రభుత్వ భూము ల్లో 14 శాతం తెలంగాణాలోనే ఉండటం మరో విశేషం. అయితే రాష్ట్రం ఏర్పడే రోజుకు రాష్ట్రంలోని 56 శాతం కుటుంబాలకు గుంట భూమి కూడా లేకపోగా, భూమి ఉన్న 40 శాతం కమతాల్లో గుంటకో సమస్య అన్నట్టుగా ఉండటం విచిత్రం. భూమి ఉంటే పట్టా లేకపోవడం, పట్టా ఉంటే భూమి అధీనంలో లేకపోవడం వంటి సమస్యలతో ధరణి సేవా కేంద్రాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా, సమగ్ర భూసర్వేతోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో నిజాం కాలంలో సర్వే.. హైదరాబాద్ రాష్ట్రం చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1911లో మొదలైన సమగ్ర భూ సర్వే 1940లో పూర్తి అయ్యింది. ప్రతి గ్రామానికి ఒక పటం (మ్యాప్), ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దుల కూడిన వివరాలతో టిప్పను తయారు చేశారు. దీంతో పాటు ఆ భూమికి పట్టాదారు ఎవరు? ఆ భూమి ప్రభుత్వ భూమా?, ప్రైవేటు భూమా? అన్న వివరాలతో సెటిల్మెంట్ రికార్డు (సేత్వారు) రూపొందించారు. ఎనభై ఏళ్ల క్రితం రూపొందించిన టిప్పన్లలో అధిక భాగం చెదలు పట్టడం, గ్రామ పటాలు చిరిగిపోవటంతో తదనంతర కాలంలో ఎలాంటి సర్వే లేకుండానే భూ కమతాల క్రయవిక్రయాల సమయంలో కాగితాలపైనే సబ్ డివిజన్ చేసి కొత్త నంబర్ ఇచ్చేశారు. సివిల్ కోర్టుల్లో నానుతున్న కేసుల్లో మూడింట రెండొంతులు భూ హద్దులు, రికార్డులకు సంబంధించినవే కావటం సమగ్ర భూ సర్వే, సెటిల్మెంట్ ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది. భూ సర్వే ఇంకెంత దూరం తెలంగాణలో సమగ్ర భూ సర్వే ఏడేళ్లుగా వాయిదా పడుతోంది. డిజిటల్ ఇండియా ప్యాకేజీలో భాగంగా కేంద్రం రూ.83.85 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం రూ.వెయ్యి కోట్లు కేటాయించాయి. తొలుత 33 జిల్లాల్లోనూ జిల్లాకో గ్రామం చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా భూసర్వే చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత దాన్ని అటకెక్కించారు. భూ పరిపాలనలో బిహార్, గుజరాత్ ,త్రిపుర, కర్ణాటక, ఏపీ తీరు భేషుగ్గా ఉండగా, తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చాక సమస్యల సంఖ్య మరింత పెరిగిందని భూచట్టాల నిపుణులు పేర్కొనడం గమనార్హం. కర్ణాటకలో దిశాంక్, ఏపీలో సమగ్ర సర్వే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమైన కర్ణాటకలో దిశాంక్ యాప్ విస్తృత సేవలందిస్తోంది. ఏదైనా భూమిలో నిలబడి ఆ యాప్ ఓపెన్ చేస్తే భూమి వివరాలన్నీ ప్రతక్ష్యమవుతుండటం విశేషం. ఆ రాష్ట్రంలో కమతం వారీగా కేటాయించిన ప్రత్యేక నంబర్‌ను జీపీఎస్‌కు సైతం అనుసంధానం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ ఆండ్ రీసెర్చ్), సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో చేపట్టిన సమగ్ర భూ సర్వే త్వరలోనే పూర్తి కానుంది. రికార్డులు, హద్దుల సమస్యల్లేవ్..! పుట్టలభూపతి.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో 104 కుటుంబాలున్న ఓ ఆదివాసీ గ్రామం. అక్కడ అందరికీ వారసత్వంగా వచ్చినా రెవెన్యూ భూమి ఉంది. కానీ రికార్డులు, సరైన హద్దురాళ్లు లేవు. దీంతో వారికి ప్రభుత్వపరంగా ఏ సహాయం అందలేదు. తమ ఊరికి వచ్చిన నాయకులందరినీ అడిగీ అడిగీ అలసిపోయారు. అయితే నల్సార్ మరో సంస్థ ‘లీఫ్’తో కలిసి కొత్త చరిత్రను లిఖించింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు భూ రికార్డులు, సర్వే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితోనే రికార్డులను సరి చేయటం, ఊరి మొత్తంలో ఉన్న ఆరు సర్వే నంబర్లలోని రెవెన్యూ భూమిని సబ్ డివిజన్లుగా విభజించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి ఎవరి భూమి ఎక్కడో తేల్చిచెప్పారు. అనంతరం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అదాలత్ ద్వారా వాటికి ఆమోదముద్ర వేసి ‘పట్టాల పండుగ’పేరుతో ఉత్సవమే నిర్వహించారు. తద్వారా హద్దుల వివాదం, రెవెన్యూ రికార్డు సంబంధిత పేచీల్లేనీ క్లీన్ విలేజ్‌గా పుట్టలభూపతి ఘనత సాధించింది. ఆ గ్రామంలో ప్రస్తుతం 73 కుటుంబాల భూ రికార్డులు, హద్దులు నిర్ధారించిన తీరుపై 17 రాష్ట్రాల ప్రతినిధులు ఓ కేస్ స్టడీగా తీసుకోవడం గమనార్హం. దిశాంక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు.. మా రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన దిశాంక్ యాప్ బాగుంది. నా భూమిలోకి వెళ్లి యాప్ ఓపెన్ చేస్తే గ్రామం, సర్వే నంబర్, భూమి వివరాలు, యజమాని పేరు, భూమి మ్యాప్, హద్దురాళ్లతో సహా వివరాలన్నీ వచ్చేస్తాయి. పట్టాదారు వారీగా రైతులకు కేటాయించిన నంబర్ ఆధారంగా జీపీఎస్ ద్వారా భూమి హద్దుల్లోకి తీసుకెళ్తుంది. ఈ యాప్ వచ్చాక భూమి సంబంధిత ఇబ్బందులు తొలిగిపోయాయి. – పి.ప్రభాకర్, తడ్పల్లి, బీదర్ జిల్లా, కర్ణాటక రెండేళ్లలో సర్వే పూర్తి చేయొచ్చు భూహద్దులు, రికార్డులు పక్కాగా ఉంటేనే శాంతి, ఆర్థికవృద్ధి సాధ్యం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో భూసర్వే, రికార్డుల నిర్వహణ సులువుగా మారిపోయింది. అమెరికా, యూరప్ దేశాల ప్రగతిలో భూహద్దులు, రికార్డులే కీలకం. దేశంలో తెలంగాణ కోరితే నా సేవలు అందించేందుకు సిద్ధం. రెండేళ్లల్లో భూ సర్వే పూర్తి చేయొచ్చు. ఒక సర్వే వందేళ్ల ప్రగతికి బాట. – స్వర్ణ సుబ్బారావు, రిటైర్డ్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా భూనక్షలు చెదపట్టాయి.. హద్దులు చెదిరిపోయాయి తెలంగాణ ఆవిర్భావ సమయంలోనే మేము అన్ని జిల్లాల్లో 2,500 కి.మీ పర్యటించి పదివేల మందిని కలిసి భూ పరిపాలన ఎలా ఉండాలన్న అంశంపై మేనిఫెస్టో రెడీ చేశాం. అందులో అత్యంత ప్రధానంగా భూముల సర్వే, భూ రికార్డుల సవరణలున్నాయి. తెలంగాణలో ఇంకా 80 ఏళ్ల క్రితం నాటి సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 30 శాతానికి పైగా అప్పటి భూనక్షలు చెద పట్టిపోయాయి. హద్దురాళ్లు చెదిరిపోయాయి. తొలుత భూ సర్వే, సెటిల్మెంట్ ఆపై చేతిరాత పహాణీలు రెడీ చేశాక..ధరణి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే బాగుండేది. కానీ ఆ పని జరగలేదు. దీంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. భూసర్వే, సెటిల్మెంట్ మాత్రమే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు ప్రభుత్వ స్పందన కోసం చూస్తున్నాం.. రాష్ట్రంలో అమల్లో ఉన్న వందకు పైగా భూచట్టాలను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితుల మేరకు చేయాల్సిన మార్పులపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. సమగ్ర భూ సర్వే కోసం తగు న్యాయ సహకారం అందించేందుకు మేం సిద్ధమని కూడా చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ప్రారంభించిన భూ సర్వే, సెటిల్మెంట్ ప్రాజెక్ట్‌లో నల్సార్ ఇప్పటికే భాగస్వామిగా చేరింది. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వీసీ, నల్సార్ -
‘ధరణి’ దారికొచ్చేనా..? రెండేళ్లయినా పరిష్కారం కాని సమస్యలు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 అక్టోబర్ 20న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పైసా లంచం చెల్లించకుండా పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ధరణి పోర్టల్‌ను రూపొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అదే పోర్టల్ పెద్ద సమస్యగా మారింది. ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 50 శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్‌కి సంబంధించినవే వస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం బాధితులు నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు ధరణిలో పొందుపర్చినా అవసరమైనవి లేకపోవడంతో భూమి కొనుగోళ్లు, అమ్మకాలు, మ్యూటేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరణి సమస్యలపై తొలుత తహసీల్దార్ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్‌కు పంపిస్తే పరిష్కారం లభిస్తోంది. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు నివేదికలు పంపించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఇందుకు పోర్టల్‌లోని సాంకేతిక లోపాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సర్కారు కొన్ని మాడ్యూల్స్‌కు అవకాశం కల్పించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. పని చేయని కొత్త ఆప్షన్.. ప్రభుత్వం ఇటీవల టీ ఎం–33 (పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్) ఆప్షన్ ద్వారా చేర్పులు, మార్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణకు రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలన చేసి కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. అయితే ఈ ఆప్షన్ సరిగా పనిచేయనందున ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో దరఖాస్తుదారులకు ఆరి్థక ఇబ్బందులు తప్పడం లేదు. మీసేవాలో దరఖాస్తు చేసుకునేందుకు రూ.1500 వరకు ఖర్చు అవుతోందని, అయినా పని కావడం లేదని ఓ రైతు వాపోయాడు. ఈసీ ధ్రువపత్రాల జారీకి అవకాశం కల్పించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్డేట్ చేయించినా సిస్టమ్‌లో జనరేట్ కావడం లేదు. నిషేధిత జాబితా(పీవోబీ) మాడ్యుల్లోని భూముల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కొనుగోలుదార్లకు ఇబ్బందులు.. ధరణి పోర్టల్ ప్రారంభ సమయంలో తలెత్తిన లోపాలను సవరించే క్రమంలో భూ లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమి జాబితాలో పట్టా భూములు, సర్వే నంబర్లలో లోపాలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను అవసరానికి అమ్ముకోలేని దుస్ధితి ఏర్పడింది. గతంలో అమ్మిన వారి పేరుపైనే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తుండడంతో కొనుగోలుదార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పలు రకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు అమ్ముకోలేక పోతున్నాం గత కొన్నేళ్లుగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందనపల్లిలో 20 మంది కలిసి ఇంటి స్థలాలు తీసుకున్నాం. గోధుమకుంటలో ఇదే సర్వే నంబర్‌తో ఉన్న వ్యవసాయ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో మా ఇంటి స్థలాలను సైతం అదే జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీనివాస్‌రావు, దమ్మాయిగూడ మొర పెట్టుకున్నా పరిష్కారం లేదు ఏన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలోని 25 గుంటలు ధరణి పోర్టల్‌లో నమోదు కాలేదు. సరి చేయాలని మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకుని తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. – ఎన్.కృష్ణయాదవ్, కీసర మండలం -
Dharani Portal: కరుణించని ధరణి
►రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామం సర్వే నంబర్ 208లో మహ్మద్ కుతుబుద్దీన్ గోరి, మునీరున్నీసాలిద్దరూ కలిసి 20 ఏళ్ల క్రితం ఆరెకరాల భూమి కొని హద్దులు ఖరారు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా వీరి పేరు మీదనే ఉన్నాయి. కానీ పహాణీలో పూర్వపు పట్టాదారు పేరు రావడాన్ని ఆసరాగా చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, పూర్వపు పట్టాదారుతో మిలాఖత్ అయి తన బంధువుల పేరిట 2014 సంవత్సరంలో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఆ ప్రజాప్రతినిధి తన పరపతిని ఉపయోగించి మూడేళ్ల క్రితం కొత్త పాసుపుస్తకాలు కూడా తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గోరీ, మునీరున్నీసాలిద్దరూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా డాక్యుమెంట్లను సమర్పించారు. రెవెన్యూ అధికారులు కూడా వివరాలు సరిగ్గా ఉన్నాయని చెబుతున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల ఆధారంగా పట్టామార్పిడి చేసే ఆప్షన్ ధరణి పోర్టల్‌లో ఇంకా రాలేదనడంతో గోరీ, మునీరున్నీసాలిద్దరూ లబోదిబోమంటున్నారు. ►ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 140లో ఆకుల సోమప్పకు 3.33 ఎకరాల భూమి ఉంది. తన అవసరాల నిమిత్తం 1.31 ఎకరాలను 1999లో అమ్ముకున్నాడు. మరలా 2004లో అదే వ్యక్తికి ఇంకో 36 గుం టలు అమ్ముకున్నాడు. ఈ మొత్తం పోను ఇంకా 1.6 ఎకరాల భూమి సోమప్ప పేరిట ఉండాలి. కానీ, ధరణి పోర్టల్‌లో నమోదు చేసే సమయంలో తప్పుగా కేవలం 10 గుం టలు మాత్రమే సోమప్ప పేరిట ఉన్నట్టు చూపించారు. సోమప్ప నుంచి భూమిని కొనుగోలు చేసిన వారికీ, ఇతరులకు కలిపి 10 గుంటలు అదనంగా చూపించారు. ఇంకో 26 గుంటలను పెండింగ్‌లో పెట్టారు. తన భూమిని తన పేరిట మార్చాలని సోమప్ప కాళ్లరిగేలా తిరుగుతున్నా అటు ధరణి పోర్టల్ కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ కనికరించడం లేదు. సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో భూ సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ఈ పోర్టల్ ద్వారా తమ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర అగచాట్లు పడుతూనే ఉన్నారు. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చి ఆరునెలలు దాటిపోయినా ఇంకా బాలారిష్టాలు వీడకపోవడం, చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిచేసుకునే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. అన్నీ సక్రమంగా ఉండి పాసుపుస్తకం ఉన్న భూములకు మాత్రమే ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా లావాదేవీలు జరుగుతుండగా, ఏ చిన్న సమస్య ఉన్నా రిజిస్ట్రేషన్ లావాదేవీలకు పోర్టల్ అంగీకరించకపోవడంతో రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా పౌతీ (వారసత్వ హక్కులు బదలాయింపునకు అనుమతి)కి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఆప్షన్లు .. ఇటు సమస్యలు ఫలానా ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నామంటూ ప్రభుత్వం పలు ఆప్షన్లు ప్రకటించడమే తప్ప అటు మీసేవ కేంద్రాల్లో కానీ, ఇటు తహసీల్ కార్యాలయాల్లో కానీ అవి అందుబాటులోకి రావడం లేదు. విచిత్రమేమిటంటే.. రాష్ట్రంలోని తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌లో వివరాలు కనిపించకపోవడంతో సిటిజన్ లాగిన్లోకి వెళ్లి సదరు వివరాలను డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గతంలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలుగా గుర్తించిన 37 రకాల సమస్యల్లో ఒకటి రెండింటికీ మినహా దేనికీ పరిష్కారం లభించడం లేదు. ఇటీవల ఆధార్‌లో తప్పులు, ఆధార్‌తో అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పులు, ఫొటో తప్పులు, లింగ నమోదు, కులం పేర్లలో తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూస్వభావ రికార్డుల్లో మార్పు, భూవర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల ఆప్షన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇలా ప్రకటించి 20 రోజులు గడుస్తున్నా ఈ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు మోక్షం కలగడం లేదని రైతులు వాపోతున్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్లు వాటి రికార్డులను పరిశీలించి, ఫైళ్లు తయారు చేసి ఆర్డీవోలకు, ఆర్డీవోలు పరిశీలించి ఇంకో ఫైలు తయారు చేసి కలెక్టర్లకు పంపేందుకే సమయం చాలడం లేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పెండింగ్‌లో పడిపోయాయి. రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉన్నత స్థాయి యంత్రాంగమంతా ఇదే అంశంలో బిజీగా ఉండడంతో ధరణి సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తాజాగా మరో ఆప్షన్.. తాజాగా ధరణి పోర్టల్ ద్వారా పౌతీకి అవకాశం కల్పిస్తున్నట్టు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు వర్తమానం అందింది. అంటే భూయజమాని చనిపోయినట్టయితే వారి వారసులకు ఆ భూమి యాజమాన్య హక్కులను విరాసత్ (బదలాయింపు) చేయడం అన్నమాట. దీనికి ఆప్షన్ ఇస్తున్నట్టు సమాచారం వచ్చింది. కానీ తమకైతే ఇప్పటివరకైతే దరఖాస్తులు రావడం లేదని తహసీల్దార్లు చెపుతున్నారు. -
ఆ సంచీలో ఒక్క రూపాయి లేదు.. కిడ్నాప్ ఓ డ్రామా!
మంథని: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 50 లక్షలతో వెళ్లిన తాము కిడ్నాప్‌కు గురయ్యామన్న ఇద్దరు వ్యక్తుల వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం కిడ్నాప్ నాటకం ఆడినట్లు తేల్చి 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మంథనిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ వివరాలు వెల్లడించారు. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బిల్క్ ఉన్నిసాబేగం వద్ద కొనుగోలు చేసి న భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 17న రూ. 50లక్షలతో ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వారు తిరిగి రాలేదని రాజేశం భార్య పుష్పలత రామగిరి పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నెల 19న అర్ధరాత్రి రెండు గంటలకు రాజాపూర్ శివారులో మల్లయ్య, రాజేశంలను వదిలేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిని తీసుకెళ్లి విచారించారు. తమను గు ర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు బాధితులు వెల్లడించారు. అనంతరం మంథని సీఐ మహేందర్ రెడ్డి, రామగిరి ఎస్సై మహేందర్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చి, గట్టిగా మందలించడంతో కిడ్నాప్ డ్రామా ఆ డినట్లు ఒప్పుకున్నారు. తమకు భూమి అ మ్ముతానని ఉన్నిసాబేగం రూ.36లక్షలు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. భూ సమస్య పరి ష్కారం కోసమే నాటకం ఆడినట్లు చెప్పారని డీసీపీ పేర్కొన్నారు. ఖాళీ సంచినే డబ్బులు ఉన్నట్లు నమ్మించినట్లు చెప్పారన్నారు. రాజేశం, మల్లయ్యలపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించిన ట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు కిరణ్, సదానందంల కు నగదు పురస్కారం అందించి, మంథని సీఐ, రామగిరి ఎస్సైలను అభినందించారు. చదవండి: రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు చెప్పిన కథనంలో అనుమానాలు.. అసలేం జరిగింది..? -
పల్లె పార్క్‌లకు స్థల సమస్య
సాక్షి, నిజామాబాద్ : నగరాలు, పట్టణాల మా దిరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు స్థలాల సమస్య వెంటాడుతోంది. వీటిని ఏర్పాటు చేసేందుకు సౌకర్యవంతమైన ప్రభుత్వ భూమి గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా యి. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలకు గాను, సుమారు 70 గ్రామ పంచాయతీల్లో స్థలాలు అందుబా టులో లేవు. దీంతో స్థలాలు లేనిచోట్ల పనులు ప్రారంభం కావడం లేదు. ఒక్కో ప్రకృతి వనాన్ని కనీసం ఎకరం స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు వీటిని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పలు గ్రామాల్లో ఎకరం విస్తీర్ణం లేకపోవడంతో అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. పనులు చేపట్టిన 460 గ్రామాల్లోని 59 గ్రామాల్లోని అటవీభూముల్లో ఈ పార్కులను నిర్మిస్తున్నారు. 401 గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ, ఆబాదీభూములున్నాయి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూముల కొరత ఉండటం సాధారణం. కానీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు పల్లె ప్రకృతి వనాల విషయానికి వస్తే గ్రామాల్లో సైతం ప్రభుత్వ భూముల సమస్య తెరపైకి రావడం గమనార్హం. ఆర్డీవోలకు బాధ్యతలు.. పల్లె ప్రకృతి వనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. నిర్మాణం ప్రారంభం కాని గ్రామ పంచాయతీల్లో భూముల గుర్తింపు బాధ్యతలను కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆర్డీవోలకు అప్పగించారు. వీలైనంత త్వరగా భూములను గుర్తించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ప్రారంభం కాని గ్రామాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతే ఆ భూములను స్వాధీనం చేసుకుని పార్కుకు కేటాయిస్తారు. సమీపంలో అటవీభూములుంటే కూడా వాటిలో ఈ పార్కులను నిర్మిస్తారు. ఇవేవీ అందుబాటులో లేనిపక్షంలో గ్రామాల్లో దాతల నుంచి భూములు సేకరించాలని భావిస్తున్నారు. వేగంగా పనులు.. జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా సాగుతున్నాయి. స్థలాలు అప్పగించిన 460 గ్రామాల్లో వీటి నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 60 గ్రామాల్లో ఈ వనాల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా ఒక్కో ప్రకృతి వనాన్ని రూ.5.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల వరకు నిర్వహణ నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తున్నారు. ఈ వనాల్లో ప్రతి మూడు ఫీట్లకు ఒకటి చొప్పున మొక్కలు నాటుతున్నారు. వనం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు. నడక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
రైతుల ఇబ్బందులు తొలగిస్తాం
సాక్షి, కందుకూరు: భూ సమస్యలన్నీ పరిష్కరించి రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లోకేశ్‌కుమార్ అన్నారు. అందులో భాగంగానే ప్రతి రెవెన్యూ డివిజన్లో వారానికి ఓసారి ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కందు కూరు ఆర్డీఓ కార్యాలయంలో జేసీ హరీష్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రజావాణిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాను ప్రతి నెలా మొదటి సోమవారం చేవెళ్ల, రెండో సోమవారం షాద్‌నగర్, మూడో వారం కందుకూరు, నాలుగో సోమ వారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. తొలి ప్రాధాన్యం భూసమస్యల పరిష్కారానికే ఇచ్చినట్లు చెప్పారు. భూ సమస్యలు పరిష్కారమైన తర్వాత మిగతా శాఖల అధికారుల్ని కూడా ప్రజావాణిలో భాగస్వామ్ముల్ని చేస్తామని వివరించారు. ప్రస్తుతం భూప్రక్షాళనకు సంబం« దించిన పార్ట్ బి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సర్వే నంబర్ వాస్తవ విస్తీర్ణంతో సరిపోలని సమస్యలు దాదాపు 28 వేలు ఉంటే అందులో దాదాపు 17 వేల సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. మిగతావి కూడా పరిష్కార దశలో ఉన్నాయన్నారు. 22ఏ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కడ్తాల్‌లో 361 మ్యుటేషన్లకు గాను 150 కేవైసీ పెండింగ్ ఉన్నాయన్నారు. మహేశ్వరంలో 2030కి 900, కందుకూరులో 1524కు 430 కేవైసీ, తలకొండపల్లిలో 293కు గాను 260 కేవైసీ పెండింగ్ ఉన్నాయన్నారు. గ్రామాల్లో వారానికి మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలియజేశారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమన్‌గల్లు, బాలాపూర్, సరూర్‌నగర్, తలకొండపల్లి తహసీల్దార్లు యశ్వంత్, సుజాత, జానకీ, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్పందన కరువు సోమవారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ లోకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. అధికారులు ముందస్తుగా తగినంత ప్రచారం కల్పించకపోవడంతో రైతులకు సమాచారం లేక సమస్యలను వివరించడానికి రాలేకపోయారు. డివిజన్ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, సరూర్‌నగర్, బాలాపూర్ మండలాల నుంచి రెవెన్యూ అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరైయ్యారు. కానీ, ఆయా మండలాల్లో కనీసం ప్రచారం చేపట్టలేదు. దీంతో గత నెలలో పెద్దఎత్తున హాజరైన ప్రజలు, ఈసారి అతి తక్కువగా వచ్చారు. కేవలం 11 అర్జీలు మాత్రమే అందినట్లు సమాచారం. -
పరిష్కారమే ధ్యేయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూసంబంధిత సమస్యల పరిష్కారానికి పల్లెల్లో మరోసారి గ్రామసభలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. తొలివిడతలో నిర్వహిస్తున్న సభల్లో బాధితుల నుంచి అధిక సంఖ్యలలో దరఖాస్తులు అందుతున్న విషయం తెలిసిందే. ఇందులో నిర్దిష్ట గడువులోపు ఎన్ని పరిష్కరించారో తెలుసుకునేందుకు రెండోసారి సభలు తలపెట్టాలని యంత్రాంగం యోచిస్తోంది. గ్రామసభల్లో అప్పటికప్పుడు కొన్ని సరళమైన సమస్యలు పరిష్కరిస్తున్నప్పటికీ.. మరికొన్నింటికి కొన్ని రోజుల సమయం పడుతోంది. ఈ నిర్దిష్ట గడువులోపు అధికారులు పరిష్కరించారా? లేదా? లేకుంటే ఎందువల్ల జాప్యం జరిగింది.. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారా? ఇంకేమైనా జఠిల సమస్యలు ఉన్నాయా.. తదితర వివరాలు రాబట్టేందుకు తొలిసారి గ్రామసభలు నిర్వహించిన పల్లెల్లో... రెండోసారి సభలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీలైతే వచ్చే సోమవారమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదీ పరిస్థితి.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వారంలో మూడు రోజలుపాటు గ్రామసభలు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. రాజేంద్రనగర్ మినహా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని పదుల సంఖ్యల గ్రామాల్లో ఈ సభలు ముగిశాయి. ఒక్కో డివిజన్లో సగటున 250 నుంచి 350 వరకు బాధితుల నుంచి అధికారులకు దరఖాస్తులు అందాయి. కొన్ని గ్రామాల్లో సభలు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఎన్ని దరఖాస్తులకు మోక్షం కలిగిందో రెండోసారి గ్రామసభ నిర్వహించి ఆరా తీయనున్నారు. తప్పులు పునరావృతం కాకుండా.. సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయడానికి కూడా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. గ్రామ సభల నిర్వహణ, అధికారులు తీసుకుంటున్న దరఖాస్తులు, పరిష్కారం తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేస్తున్న లేదా ఇతర జిల్లాల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే వీలుందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా రికార్డుల ప్రక్షాళన సమయంలో చాలావరకు కిందిస్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని సాకుగా చూపి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. మళ్లీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఆర్డీఓ స్థాయి వ్యక్తులను ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిజిటల్ సంతకం 88 శాతం పూర్తి జిల్లా వ్యాప్తంగా 10.98 లక్షల సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ఇప్పటికే 9.60 లక్షల సర్వేనంబర్లపై ఎటువంటి కిరికిరి లేదు. దీంతో వీటికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు డిజిటల్ సంతకం పూర్తయింది. ఇవిపోను మరో 1.38 లక్షల సర్వే నంబర్లు మిగిలాయి. ఇందులో ప్రభుత్వ భూములకు సంబంధించి 45 వేల సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ఉండదు. దీంతో డిజిటల్ సంతకం చేయాల్సిన పనిలేదు. ఇక 36 వేలకు సర్వే నంబర్లు.. భూ వినియోగ మార్పిడి కింద ఉన్నాయి. వీటికీ డిజిటల్ సంతకంతో పనిలేదు. ఇవన్నీ మినహాయించగా మరో 7,514 సర్వే నంబర్లకు సంబంధించి సంతకం పెండింగ్‌లో ఉంది. 2,200 సర్వే నంబర్లల్లో భూమి కలిగి ఉన్న వ్యక్తులు తమ ఆధార్ నంబర్ అందజేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సంతకం చేయడం కుదరదు. మరో 5,300 సర్వే నంబర్లకు సంబంధించి ఆధార్ నంబర్లు అందజేసినా.. భూ విస్తీర్ణంలో తేడాలు కనిపించడంతో అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్) ఆధారంగా వీటిని పరిష్కరించనున్నారు. (1)బి సర్వే నంబర్ల ప్రదర్శన వివాదాస్పదంగా ఉన్న ఆయా సర్వే నంబర్లను (1)బి జాబితాలో అధికారులు చేర్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా సర్వే నంబర్లు ఉన్నాయి. అయితే, ఏయే సర్వే నంబర్లను ఈ జాబితాలోకి ఎక్కించారు.. ఎందుకు నమోదు చేశారు.. అనే విషయాలు సంబంధిత రైతులకు తెలియడం లేదు. ఫలితంగా పట్టాదారు పాసు పుస్తకాల కోసం నెలల తరబడి కర్షకులు ఎదురుచూస్తున్నారు. (1)బి జాబితాలో ఉన్న సర్వే నంబర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. రెండు గ్రామసభల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని దాదాపుగా నిర్ణయించింది. -
గోదాంలకు స్థలం కొరత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థలం కొరత గోదాంల నిర్మాణానికి అడ్డంకిగా మారింది. జిల్లా, మహానగర అవసరాల మేరకు గిడ్డంకులు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా నిర్దేశిత ప్రాంతాల్లో భూమి లభించడం లేదు. మహానగర శివార్లలోని మండల కేంద్రాల్లో గిడ్డంకులు నిర్మించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఇటీవల జిల్లా యంత్రాంగాన్ని ప్రతిపాదనలు అడిగింది. దీంతో ఆయా మండలాల్లో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారుల సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థల లభ్యత వివరాలు సేకరించారు. ఒక్కో గోదాం నిర్మాణానికి కనీసం ఐదెకరాల భూమి అవసరం. అలాగే గోదాంల వద్దకు వాహనాలు రాకపోకలు జరిపేందుకు వీలుగా రోడ్డు మార్గం అనువుగా ఉండాలి. ఇటువంటి అనుకూలత కోసం రోజుల తరబడి జల్లెడబట్టినా పూర్తిస్థాయిలో స్థలాలు లభించలేదు. ఐదు మండల కేంద్రాల్లో స్థల లభ్యత ఉండగా.. మిగిలిన ఆరు మండలాల్లో కొరత ఉంది. ఐదు చోట్ల భూమి గుర్తింపు.. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో మొత్తం 75,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 28 గిడ్డంకులు ఉన్నాయి. జిల్లా, మహానగర జనాభా అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. జనాభాకు సరిపడ వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యం గల గిడ్డంకులు అవసరం. వీటి నిర్మాణానికి నగరంలో స్థలం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిసర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో నిర్మించాలని భావించారు. ఈ క్రమంలో నాబార్డు నిధులతో జిల్లాలో 11 గోదాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని మార్కెటింగ్ శాఖ జిల్లా యంత్రాంగాన్ని కోరింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5వేల మెట్రిక్ టన్నులు. ఒక్కో గిడ్డంగి నిర్మాణానికి ఐదెకరాల స్థలం అవసరం. వీటి కోసం అన్వేషించగా అబ్దుల్లాపూర్‌మెట్, నందిగామ, శంషాబాద్, కడ్తాల్, చౌదరిగూడలో మాత్రమే స్థలం అందుబాటులో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా మార్కెటింగ్ శాఖ నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపించింది. సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్ విభాగం రిపోర్ట్‌ని నాబార్డ్‌కు అందజేసింది. గోదాం పరిసర ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం? ఏయే పంటలు అధికంగా సాగవుతున్నాయి? దిగుబడి అంచనా? ఎంతమంది రైతులకు మేలు చేకూరుతుంది? తదితర అంశాలపై మరోసారి నాబార్డ్ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. వాళ్లు సానుకూలత వ్యక్తం చేస్తే జిల్లా కలెక్టర్ భూమి కేటాయించనున్నారు. తద్వారా ఈ ఐదు గిడ్డంగులు జిల్లాకు మంజూరై నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ ఆరు వెనక్కి..! మహానగర శివారు ప్రాంతాల్లో గిడ్డంగుల నిర్మాణానికి స్థల లేమి అడ్డంకిగా మారింది. గండిపేట, బాలాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మాడ్గుల, షాద్‌నగర్ ప్రాంతాల్లో స్థల కొరత ఉంది. దీంతో గిడ్డంగుల నిర్మాణం ఇక్కడ సాధ్యం కాదన్న అభిప్రాయానికి మార్కెటింగ్ శాఖ వచ్చింది. ఫలితంగా ఆ ఆరు గిడ్డంగులు జిల్లా నుంచి చేజారిపోయినట్లే. వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి తెలిపారు. -
రెవెన్యూ సదస్సులకు సిద్ధం కండి
కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(అగ్రికల్చర్): రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారానికి జూలై మొదటి లేదా రెండో వారాల్లో ‘మీ ఇంటికి మీ భూమి’ తరహలో సదస్సులు నిర్వహిస్తున్నామని, వీటికి అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ సత్య నారాయణ సూచించారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్ పాల్గొని వివిధ అంశాలపై సూచనలు ఇచ్చారు. డివిజన్ వారిగా ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ భూములను నమోదు చేయాలని సూచించారు. 2014 తరువాత ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల్లో అనర్హులు ఉంటే గుర్తించి పట్టాలను రద్దు చేయాలని వివరించారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ..రెవెన్యూ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయన్నారు. తహసీల్దార్లు జవాబుదారి తనంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్లు డిజిటల్ కీ లను కంప్యూటర్ అపరేటర్లకు అప్పగించకుండా సొంతంగా నిర్వహించడంతో చాలా వరకు సమస్యలు తగ్గుతాయని పలువురు డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ2–రామస్వామి, ఆర్డీఓలు హుస్సేన్‌సాహెబ్, ఓబులేష్, రామసుందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, సత్యనారాయణ, సత్యం, అన్ని మండలాల తహసీల్దార్, డీటీలు పాల్గొన్నారు. -
అదానీ గ్రూప్‌కే భావనపాడు పోర్టు
-
ఇక భూ వివాదాలపై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: భూవివాదాలపై జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టుల్లో ఏళ్లతరబడి భూవివాదాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజాప్రయోజనాలకు ఉపయోగించటానికి వీలులేని పరిస్థితి నెలకొంది. కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల వివాదాలను పరిష్కరించటానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సిటీ సివిల్ కోర్టు జీపీలు, ఏజీపీలు, సీనియర్ న్యాయవాదులు, ప్రభుత్వ లాయర్లు, రెవెన్యూ యంత్రాంగంతో తరచుగా కలెక్టర్ చర్చిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పదిహేను రోజులకోకసారి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికి కొన్ని భూవివాద కోర్టు కేసులు పరిష్కారానికి నోచుకోగా, మిగతా వాటిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. అత్యధికంగా షేక్‌పేట్‌లో హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 831.62 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన వివాదాలు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూముల విలువ రూ. 9489.16 కోట్లు ఉంటుందని అధికారయంత్రాంగం అంచనా వేస్తున్నది. నగరంలో సంపన్న వర్గాలు నివసించే షేక్‌పేట్ మండలంలో రూ.2078 కోట్ల విలువ చేసే 107 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో ఉండగా, మారేడుపల్లి మండలంలో రూ. 4,206 కోట్ల విలువ చేసే 257 ఎకరాల భూములున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఆసీఫ్‌నగర్ మండలంలో రూ.850 కోట్లు విలువ చేసే 172 ఎకరాలు, ముషీరాబాద్ మండలంలో రూ. 861 కోట్లు విలువ చేసే 26 ఎకరాలు, బండ్లగూడ మండలంలో రూ. 311 కోట్లు విలువ చేసే 145 ఎకరాలు, తిరుమలగిరి మండలంలో రూ. 340 కోట్లు విలువ చేసే 66 ఎకరాలు, సికింద్రాబాద్‌లో రూ.100 కోట్లు విలువ చేసే 19 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో ఉన్నాయి. జిల్లాలోని 831 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన కోర్టు కేసులు 81కి పైగా ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టులో నాలుగు కేసులు కూడా ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
భూమి సమస్యలు పరిష్కరించుకోండి: ఆర్డీవో
వేముల (వైఎస్సార్ జిల్లా): భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మీ ఇంటికి మీ భూమి సదస్సులో పరిష్కరించుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం రైతులకు విజ్ఞప్తిచేశారు. సోమవారం వేములలో జరిగిన 'మీ ఇంటికే మీ భూమి' సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, అందుకే ప్రభుత్వం మీ ఇంటికే మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.