సాక్షి, సిటీబ్యూరో: భూవివాదాలపై జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టుల్లో ఏళ్లతరబడి భూవివాదాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజాప్రయోజనాలకు ఉపయోగించటానికి వీలులేని పరిస్థితి నెలకొంది. కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల వివాదాలను పరిష్కరించటానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
సిటీ సివిల్ కోర్టు జీపీలు, ఏజీపీలు, సీనియర్ న్యాయవాదులు, ప్రభుత్వ లాయర్లు, రెవెన్యూ యంత్రాంగంతో తరచుగా కలెక్టర్ చర్చిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పదిహేను రోజులకోకసారి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికి కొన్ని భూవివాద కోర్టు కేసులు పరిష్కారానికి నోచుకోగా, మిగతా వాటిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు.
అత్యధికంగా షేక్‌పేట్‌లో
హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 831.62 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన వివాదాలు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూముల విలువ రూ. 9489.16 కోట్లు ఉంటుందని అధికారయంత్రాంగం అంచనా వేస్తున్నది. నగరంలో సంపన్న వర్గాలు నివసించే షేక్‌పేట్ మండలంలో రూ.2078 కోట్ల విలువ చేసే 107 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో ఉండగా, మారేడుపల్లి మండలంలో రూ. 4,206 కోట్ల విలువ చేసే 257 ఎకరాల భూములున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
ఆసీఫ్‌నగర్ మండలంలో రూ.850 కోట్లు విలువ చేసే 172 ఎకరాలు, ముషీరాబాద్ మండలంలో రూ. 861 కోట్లు విలువ చేసే 26 ఎకరాలు, బండ్లగూడ మండలంలో రూ. 311 కోట్లు విలువ చేసే 145 ఎకరాలు, తిరుమలగిరి మండలంలో రూ. 340 కోట్లు విలువ చేసే 66 ఎకరాలు, సికింద్రాబాద్‌లో రూ.100 కోట్లు విలువ చేసే 19 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో ఉన్నాయి. జిల్లాలోని 831 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన కోర్టు కేసులు 81కి పైగా ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టులో నాలుగు కేసులు కూడా ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.