►రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామం సర్వే నంబర్ 208లో మహ్మద్ కుతుబుద్దీన్ గోరి, మునీరున్నీసాలిద్దరూ కలిసి 20 ఏళ్ల క్రితం ఆరెకరాల భూమి కొని హద్దులు ఖరారు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా వీరి పేరు మీదనే ఉన్నాయి. కానీ పహాణీలో పూర్వపు పట్టాదారు పేరు రావడాన్ని ఆసరాగా చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, పూర్వపు పట్టాదారుతో మిలాఖత్ అయి తన బంధువుల పేరిట 2014 సంవత్సరంలో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఆ ప్రజాప్రతినిధి తన పరపతిని ఉపయోగించి మూడేళ్ల క్రితం కొత్త పాసుపుస్తకాలు కూడా తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గోరీ, మునీరున్నీసాలిద్దరూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా డాక్యుమెంట్లను సమర్పించారు. రెవెన్యూ అధికారులు కూడా వివరాలు సరిగ్గా ఉన్నాయని చెబుతున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల ఆధారంగా పట్టామార్పిడి చేసే ఆప్షన్ ధరణి పోర్టల్‌లో ఇంకా రాలేదనడంతో గోరీ, మునీరున్నీసాలిద్దరూ లబోదిబోమంటున్నారు.
►ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 140లో ఆకుల సోమప్పకు 3.33 ఎకరాల భూమి ఉంది. తన అవసరాల నిమిత్తం 1.31 ఎకరాలను 1999లో అమ్ముకున్నాడు. మరలా 2004లో అదే వ్యక్తికి ఇంకో 36 గుం టలు అమ్ముకున్నాడు. ఈ మొత్తం పోను ఇంకా 1.6 ఎకరాల భూమి సోమప్ప పేరిట ఉండాలి. కానీ, ధరణి పోర్టల్‌లో నమోదు చేసే సమయంలో తప్పుగా కేవలం 10 గుం టలు మాత్రమే సోమప్ప పేరిట ఉన్నట్టు చూపించారు. సోమప్ప నుంచి భూమిని కొనుగోలు చేసిన వారికీ, ఇతరులకు కలిపి 10 గుంటలు అదనంగా చూపించారు. ఇంకో 26 గుంటలను పెండింగ్‌లో పెట్టారు. తన భూమిని తన పేరిట మార్చాలని సోమప్ప కాళ్లరిగేలా తిరుగుతున్నా అటు ధరణి పోర్టల్ కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ కనికరించడం లేదు.
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో భూ సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ఈ పోర్టల్ ద్వారా తమ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర అగచాట్లు పడుతూనే ఉన్నారు. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చి ఆరునెలలు దాటిపోయినా ఇంకా బాలారిష్టాలు వీడకపోవడం, చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిచేసుకునే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. అన్నీ సక్రమంగా ఉండి పాసుపుస్తకం ఉన్న భూములకు మాత్రమే ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా లావాదేవీలు జరుగుతుండగా, ఏ చిన్న సమస్య ఉన్నా రిజిస్ట్రేషన్ లావాదేవీలకు పోర్టల్ అంగీకరించకపోవడంతో రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా పౌతీ (వారసత్వ హక్కులు బదలాయింపునకు అనుమతి)కి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అటు ఆప్షన్లు .. ఇటు సమస్యలు
ఫలానా ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నామంటూ ప్రభుత్వం పలు ఆప్షన్లు ప్రకటించడమే తప్ప అటు మీసేవ కేంద్రాల్లో కానీ, ఇటు తహసీల్ కార్యాలయాల్లో కానీ అవి అందుబాటులోకి రావడం లేదు. విచిత్రమేమిటంటే.. రాష్ట్రంలోని తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌లో వివరాలు కనిపించకపోవడంతో సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లి సదరు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గతంలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలుగా గుర్తించిన 37 రకాల సమస్యల్లో ఒకటి రెండింటికీ మినహా దేనికీ పరిష్కారం లభించడం లేదు. ఇటీవల ఆధార్‌లో తప్పులు, ఆధార్‌తో అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పులు, ఫొటో తప్పులు, లింగ నమోదు, కులం పేర్లలో తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూస్వభావ రికార్డుల్లో మార్పు, భూవర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల ఆప్షన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇలా ప్రకటించి 20 రోజులు గడుస్తున్నా ఈ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు మోక్షం కలగడం లేదని రైతులు వాపోతున్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్లు వాటి రికార్డులను పరిశీలించి, ఫైళ్లు తయారు చేసి ఆర్డీవోలకు, ఆర్డీవోలు పరిశీలించి ఇంకో ఫైలు తయారు చేసి కలెక్టర్లకు పంపేందుకే సమయం చాలడం లేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పెండింగ్‌లో పడిపోయాయి. రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉన్నత స్థాయి యంత్రాంగమంతా ఇదే అంశంలో బిజీగా ఉండడంతో ధరణి సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
తాజాగా మరో ఆప్షన్..
తాజాగా ధరణి పోర్టల్ ద్వారా పౌతీకి అవకాశం కల్పిస్తున్నట్టు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు వర్తమానం అందింది. అంటే భూయజమాని చనిపోయినట్టయితే వారి వారసులకు ఆ భూమి యాజమాన్య హక్కులను విరాసత్ (బదలాయింపు) చేయడం అన్నమాట. దీనికి ఆప్షన్ ఇస్తున్నట్టు సమాచారం వచ్చింది. కానీ తమకైతే ఇప్పటివరకైతే దరఖాస్తులు రావడం లేదని తహసీల్దార్లు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment