భూ సర్వేతో ఏంటి ప్రయోజనం
ప్రతి గ్రామానికి ఒక పటం, ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దురాళ్ల వివరాలతో టిప్పన్ తయారు చేస్తారు. ఆ తర్వాత భూమి రకం ఏంటి?.. అంటే ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? తదితర వివరాలతో సేత్వారు తయారు చేస్తారు. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకాలు, దానం, వీలునామాతో భూమి సంక్రమిస్తే హక్కుల రికార్డులో మార్పులు చేసి పకడ్బందీగా పట్టా జారీ చేస్తారు. భూ కమతంలో విభజన జరిగితే సర్వే చేసి టిప్పన్ తయారు చేస్తారు.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: భూమి ఇక్కడ ప్రాణం కంటే విలువైనది. అందుకే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిరంతరం భూమి చుట్టే పరిభ్రమిస్తుంటాయి. స్వాతంత్య్రానికి ముందు భుక్తినిచ్చే భూమి కోసం నిజాం –దేశ్‌ముఖ్‌ల చేతుల్లో నాలుగువేల మంది నిరుపేదల అమరత్వం పది లక్షల ఎకరాలకు రైతు కూలీలను యజమానులుగా చేసిన చారిత్రిక ఘట్టం ఒకవైపు.. స్వాతంత్య్రాంతరం ఇదే నేల భూదాన ఉద్యమంలో పేద రైతాంగాన్ని నాలుగు లక్షల ఎకరాలకు భూయజమానులుగా చేసిన మహోజ్వల ఘట్టం మరోవైపు.. ఇలా దేశంలో పేదలకు పంచిన ప్రభుత్వ భూము ల్లో 14 శాతం తెలంగాణాలోనే ఉండటం మరో విశేషం.
అయితే రాష్ట్రం ఏర్పడే రోజుకు రాష్ట్రంలోని 56 శాతం కుటుంబాలకు గుంట భూమి కూడా లేకపోగా, భూమి ఉన్న 40 శాతం కమతాల్లో గుంటకో సమస్య అన్నట్టుగా ఉండటం విచిత్రం. భూమి ఉంటే పట్టా లేకపోవడం, పట్టా ఉంటే భూమి అధీనంలో లేకపోవడం వంటి సమస్యలతో ధరణి సేవా కేంద్రాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా, సమగ్ర భూసర్వేతోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడో నిజాం కాలంలో సర్వే..
హైదరాబాద్ రాష్ట్రం చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1911లో మొదలైన సమగ్ర భూ సర్వే 1940లో పూర్తి అయ్యింది. ప్రతి గ్రామానికి ఒక పటం (మ్యాప్), ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దుల కూడిన వివరాలతో టిప్పను తయారు చేశారు. దీంతో పాటు ఆ భూమికి పట్టాదారు ఎవరు? ఆ భూమి ప్రభుత్వ భూమా?, ప్రైవేటు భూమా? అన్న వివరాలతో సెటిల్మెంట్ రికార్డు (సేత్వారు) రూపొందించారు.
ఎనభై ఏళ్ల క్రితం రూపొందించిన టిప్పన్లలో అధిక భాగం చెదలు పట్టడం, గ్రామ పటాలు చిరిగిపోవటంతో తదనంతర కాలంలో ఎలాంటి సర్వే లేకుండానే భూ కమతాల క్రయవిక్రయాల సమయంలో కాగితాలపైనే సబ్ డివిజన్ చేసి కొత్త నంబర్ ఇచ్చేశారు. సివిల్ కోర్టుల్లో నానుతున్న కేసుల్లో మూడింట రెండొంతులు భూ హద్దులు, రికార్డులకు సంబంధించినవే కావటం సమగ్ర భూ సర్వే, సెటిల్మెంట్ ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది.
భూ సర్వే ఇంకెంత దూరం
తెలంగాణలో సమగ్ర భూ సర్వే ఏడేళ్లుగా వాయిదా పడుతోంది. డిజిటల్ ఇండియా ప్యాకేజీలో భాగంగా కేంద్రం రూ.83.85 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం రూ.వెయ్యి కోట్లు కేటాయించాయి. తొలుత 33 జిల్లాల్లోనూ జిల్లాకో గ్రామం చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా భూసర్వే చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత దాన్ని అటకెక్కించారు. భూ పరిపాలనలో బిహార్, గుజరాత్ ,త్రిపుర, కర్ణాటక, ఏపీ తీరు భేషుగ్గా ఉండగా, తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చాక సమస్యల సంఖ్య మరింత పెరిగిందని భూచట్టాల నిపుణులు పేర్కొనడం గమనార్హం.
కర్ణాటకలో దిశాంక్, ఏపీలో సమగ్ర సర్వే
ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమైన కర్ణాటకలో దిశాంక్ యాప్ విస్తృత సేవలందిస్తోంది. ఏదైనా భూమిలో నిలబడి ఆ యాప్ ఓపెన్ చేస్తే భూమి వివరాలన్నీ ప్రతక్ష్యమవుతుండటం విశేషం. ఆ రాష్ట్రంలో కమతం వారీగా కేటాయించిన ప్రత్యేక నంబర్‌ను జీపీఎస్‌కు సైతం అనుసంధానం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ ఆండ్ రీసెర్చ్), సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో చేపట్టిన సమగ్ర భూ సర్వే త్వరలోనే పూర్తి కానుంది.
రికార్డులు, హద్దుల సమస్యల్లేవ్..!
పుట్టలభూపతి.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో 104 కుటుంబాలున్న ఓ ఆదివాసీ గ్రామం. అక్కడ అందరికీ వారసత్వంగా వచ్చినా రెవెన్యూ భూమి ఉంది. కానీ రికార్డులు, సరైన హద్దురాళ్లు లేవు. దీంతో వారికి ప్రభుత్వపరంగా ఏ సహాయం అందలేదు. తమ ఊరికి వచ్చిన నాయకులందరినీ అడిగీ అడిగీ అలసిపోయారు. అయితే నల్సార్ మరో సంస్థ ‘లీఫ్’తో కలిసి కొత్త చరిత్రను లిఖించింది.
అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు భూ రికార్డులు, సర్వే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితోనే రికార్డులను సరి చేయటం, ఊరి మొత్తంలో ఉన్న ఆరు సర్వే నంబర్లలోని రెవెన్యూ భూమిని సబ్ డివిజన్లుగా విభజించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి ఎవరి భూమి ఎక్కడో తేల్చిచెప్పారు. అనంతరం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అదాలత్ ద్వారా వాటికి ఆమోదముద్ర వేసి ‘పట్టాల పండుగ’పేరుతో ఉత్సవమే నిర్వహించారు.
తద్వారా హద్దుల వివాదం, రెవెన్యూ రికార్డు సంబంధిత పేచీల్లేనీ క్లీన్ విలేజ్‌గా పుట్టలభూపతి ఘనత సాధించింది. ఆ గ్రామంలో ప్రస్తుతం 73 కుటుంబాల భూ రికార్డులు, హద్దులు నిర్ధారించిన తీరుపై 17 రాష్ట్రాల ప్రతినిధులు ఓ కేస్ స్టడీగా తీసుకోవడం గమనార్హం.
దిశాంక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు.. మా రాష్ట్రంలో కొత్తగా
తెచ్చిన దిశాంక్ యాప్ బాగుంది. నా భూమిలోకి వెళ్లి యాప్ ఓపెన్ చేస్తే గ్రామం, సర్వే నంబర్, భూమి వివరాలు, యజమాని పేరు, భూమి మ్యాప్, హద్దురాళ్లతో సహా వివరాలన్నీ వచ్చేస్తాయి. పట్టాదారు వారీగా రైతులకు కేటాయించిన నంబర్ ఆధారంగా జీపీఎస్ ద్వారా భూమి హద్దుల్లోకి తీసుకెళ్తుంది. ఈ యాప్ వచ్చాక భూమి సంబంధిత ఇబ్బందులు తొలిగిపోయాయి.
– పి.ప్రభాకర్, తడ్పల్లి, బీదర్ జిల్లా, కర్ణాటక
రెండేళ్లలో సర్వే పూర్తి చేయొచ్చు
భూహద్దులు, రికార్డులు పక్కాగా ఉంటేనే శాంతి, ఆర్థికవృద్ధి సాధ్యం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో భూసర్వే, రికార్డుల నిర్వహణ సులువుగా మారిపోయింది. అమెరికా, యూరప్ దేశాల ప్రగతిలో భూహద్దులు, రికార్డులే కీలకం. దేశంలో తెలంగాణ కోరితే నా సేవలు అందించేందుకు సిద్ధం. రెండేళ్లల్లో భూ సర్వే పూర్తి చేయొచ్చు. ఒక సర్వే వందేళ్ల ప్రగతికి బాట.
– స్వర్ణ సుబ్బారావు, రిటైర్డ్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా
భూనక్షలు చెదపట్టాయి.. హద్దులు చెదిరిపోయాయి
తెలంగాణ ఆవిర్భావ సమయంలోనే మేము అన్ని జిల్లాల్లో 2,500 కి.మీ పర్యటించి పదివేల మందిని కలిసి భూ పరిపాలన ఎలా ఉండాలన్న అంశంపై మేనిఫెస్టో రెడీ చేశాం. అందులో అత్యంత ప్రధానంగా భూముల సర్వే, భూ రికార్డుల సవరణలున్నాయి. తెలంగాణలో ఇంకా 80 ఏళ్ల క్రితం నాటి సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
30 శాతానికి పైగా అప్పటి భూనక్షలు చెద పట్టిపోయాయి. హద్దురాళ్లు చెదిరిపోయాయి. తొలుత భూ సర్వే, సెటిల్‌మెంట్ ఆపై చేతిరాత పహాణీలు రెడీ చేశాక..ధరణి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే బాగుండేది. కానీ ఆ పని జరగలేదు. దీంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. భూసర్వే, సెటిల్మెంట్ మాత్రమే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
– భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు
ప్రభుత్వ స్పందన కోసం చూస్తున్నాం..
రాష్ట్రంలో అమల్లో ఉన్న వందకు పైగా భూచట్టాలను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితుల మేరకు చేయాల్సిన మార్పులపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. సమగ్ర భూ సర్వే కోసం తగు న్యాయ సహకారం అందించేందుకు మేం సిద్ధమని కూడా చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ప్రారంభించిన భూ సర్వే, సెటిల్‌మెంట్ ప్రాజెక్ట్‌లో నల్సార్ ఇప్పటికే భాగస్వామిగా చేరింది.
– ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వీసీ, నల్సార్
Comments
Please login to add a commentAdd a comment