సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లేకపోగా, అందులో కొన్నింటి పరిష్కారానికి ఆప్షన్లిచ్చింది. ఆధార్ నమోదులో తప్పులు, ఆధార్ వివరాలు సమర్పించకపోవడం, తండ్రి లేదా భర్త పేరులో తప్పులు, కులం మార్పు, సర్వే నంబర్ మిస్సింగ్, పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి అంశాలకు ఆప్షన్లు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలోని మీ–సేవ కేంద్రాలకు వెళ్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీసీఎల్‌ఏ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
కలెక్టర్ల పరిశీలన అనంతరం..
మీ-సేవ కేంద్రాల్లో ఈ మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు నేరుగా కలెక్టర్లకు వెళ్తాయని, వారు పరిశీలించిన అనంతరం దరఖాస్తును ఆమోదిం చడం లేదా తిరస్కరించడం జరుగుతుందని సీసీఎల్‌ఏ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుల విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియ జేసి తదుపరి చర్యలు వివరిస్తారని తెలిపారు. కాగా, వీటితో పాటు ధరణిలో రిజిస్ట్రేషన్ల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే కొలిక్కి తేవాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.
జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అమల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, కంపెనీలకు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ, లీజు బదిలీ, రద్దు, సరెండర్, అమ్మకపు సర్టిఫికెట్లు, కన్వేయన్స్ డీడ్ విస్తీర్ణంలో తేడాలు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లకు, మైనర్లకు పాసు పుస్తకాల్లాంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, 10 రోజుల్లో ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో గాడిలో పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment