ధరణి పోర్టల్‌కు అర్జీల వెల్లువ
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పెండింగ్‌లో 2.45 లక్షల దరఖాస్తులు
మార్చిలో స్పెషల్ డ్రైవ్ పేరుతో 1.5 లక్షల అర్జీలకు పరిష్కారం
లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన డ్రైవ్
అప్పట్నుంచి ఇప్పటివరకు మరో లక్ష దరఖాస్తులు
వీటిపై సమీక్షకు రేపు కలెక్టర్లతో సీసీఎల్‌ఏ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: తమ భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్‌కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. గత మూడు నెలల్లోనే లక్ష దరఖాస్తులు అందాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్షల సంఖ్యలో దరఖాస్తులు పరిష్కరించినా, మళ్లీ ధరణి పోర్టల్‌లో దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఎన్నికల కోడ్ అడ్డంకితో డ్రైవ్ ఆగిపోయినప్పటి నుంచి ఇటీవలి వరకు కొత్తగా లక్ష దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పురోగతిని పరిశీలించడంతో పాటు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది.
ధరణి కమిటీ చొరవతో..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ల పని ఒత్తిడికి తోడు పోర్టల్‌లోని సాంకేతిక కారణాలతో చాలా దరఖాస్తులు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయాయి. దీంతో ధరణి పోర్టల్‌ను సంస్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చొరవతో ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఈ ఏడాది మార్చినెల మొదటి వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అదే నెలలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.
సాధారణ ప్రక్రియలో భాగంగా అడపాదడపా పరిష్కరించిన కొన్ని దరఖాస్తులు కలిపి మొత్తం 1.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా మిగిలిన దాదాపు లక్ష దరఖాస్తులకు తోడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ధరణి పోర్టల్‌కు వచ్చిన మరో లక్ష కలిపి ఇప్పుడు పెండింగ్ దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో సీసీఎల్‌ఏ మిత్తల్ శుక్రవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విడతల వారీగా ఒక్కోసారి ఐదారు జిల్లాల కలెక్టర్లతో గంట పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌తో పాటు ప్రజావాణి, గ్రీవెన్స్ కార్యక్రమాల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయానికి నేరుగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విషయమై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment