
సాక్షి, హైదరాబాద్: ధరణిలో నమోదు చేసేందుకు ప్రజల నుంచి సేకరిస్తున్న వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమాచారం హ్యాక్ కాదన్న గ్యారంటీ ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆధార్ సమాచారం మూడుసార్లు లీక్ అయినా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయిందని, కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్‌హౌస్, బకింగ్‌హమ్ ప్యాలెస్‌లకు చెందిన డేటా కూడా హ్యాక్ అయిందని పేర్కొంది. ధరణిలో నమోదు చేసేందుకు ప్రజల నుంచి సేకరిస్తున్న ఆస్తుల సమాచారం దుర్వినియోగమైతే అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించింది.
సేకరిస్తున్న డేటాను పరిశీలించే అధికారం తహసీల్దార్, ఇతర అధికారులకు ఇస్తే దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువని అభిప్రాయపడింది. ధరణిలో వ్యవసాయ, వ్యయసాయేతర ఆస్తులు నమోదు చేసుకోవాలని, ఇందుకు ఆధార్, కులం వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు కాశీభట్ల సాకేత్, గోపాల్‌శర్మలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
అది రాజ్యాంగ విరుద్ధం: ‘రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ ప్రక్రియను ఏకకాలంలో చేపట్టడం మంచిదే. అయితే ఆస్తులను ధరణిలో నమోదు చేసుకోకపోతే బదిలీ చేసుకోలేరంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 300–ఎకు విరుద్ధం. ఆస్తులు నమోదు చేయకపోతే రిజిస్ట్రేషన్ చేయరా? ధరణిలో నమోదు చేసుకోని ఆస్తులకు సంబంధించిన యజమాని చనిపోతే ఆ ఆస్తులు వారసులకు చెందవా’అని ధర్మాసనం ప్రశ్నించింది. ధరణిలో నమోదు చేసుకోకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ప్రకటించాలని, ఈ మేరకు జీవో జారీ చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. వ్యవసాయ ఆస్తులకు ఆధార్, కులం వివరాలు కోరరాదని, అలాగే వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment