
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది. గతేడాది అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమైంది. అయితే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అధికారిక కార్యకలాపాలు మాత్రం నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాదిలో మొత్తం 10.45 లక్షలకు పైగా ధరణి ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భూముల రిజిస్ట్రేషన్లు 75 శాతం ఉండగా, 25 శాతం మేర మ్యుటేషన్లు, పంపకాలు, వారసత్వ హక్కులు, వ్యవసాయేతర భూములుగా మార్చే కార్యకలాపాలు జరిగాయని ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటివరకు 96 శాతం దరఖాస్తులు పరిష్కారం కాగా, 4 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చినట్లు సీసీఎల్‌ఏ వర్గాలు చెబుతున్నాయి.
కొంచెం ఇష్టం.. ఇంకొంచెం కష్టం
అవినీతికి, ఆలస్యానికి తావు లేకుండా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల లావాదేవీలను పారదర్శకంగా జరపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, వీలున్నంత త్వరగా లావాదేవీలు పూర్తి చేయడం, ఈ లావాదేవీల ద్వారా రైతు ఇంటికే నేరుగా హక్కు పత్రాలు పంపే విషయంలో ధరణి సమర్థంగానే పనిచేస్తోందనే అభిప్రాయం ఉంది.
చదవండి: (కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..)
అయితే సమన్వయ లోపం, సాంకేతిక సమస్యల కారణంగా రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దరఖాస్తుల పరిష్కారానికి చాలా సమయం తీసుకుంటోంది. దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మూడంచెల వ్యవస్థ, కలెక్టర్ల పని ఒత్తిడి లాంటి అంశాల కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతుండటం, ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. పోర్టల్ ద్వారా సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకే కట్టబెట్టడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద పారదర్శకతను తీసుకొచ్చే క్రమంలో ధరణి వ్యవస్థ ప్రస్తుతానికి బాలారిష్టాలను దాటే దశలో ఉందని, దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి పనిచేస్తే వీలున్నంత త్వరలోనే వ్యవసాయ భూముల లావాదేవీలు మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్త చట్టానికీ ఏడాది
కాగా, గతంలో ఉన్న చట్టానికి మార్పులు చేసుకుని భూ హక్కులు, పాసుపుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం కూడా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చట్టాన్ని 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అదే ఏడాది అక్టోబర్ 28న నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 9న ఈ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
సీఎం అభినందనలు
ధరణి పోర్టల్ సేవలను ఏడాది కాలంగా విజయవంతంగా అమలు చేస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం, అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. ధరణి పోర్టల్ అందిస్తున్న పారదర్శక, అవాంతరాలు లేని సేవల కారణంగా ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని గురువారం ఓ ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ధరణిని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లను సీఎస్ సోమేశ్ కుమార్ మరొక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.