జోరుగా జీరో
- అనధికారికంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయం
- ఏటా రూ.10 కోట్ల పన్ను ఎగవేత
- నిద్రావస్థలో వాణిజ్యపన్నుల శాఖ
విజయవాడ : జిల్లాలోని పలు పట్టణాల్లో కుప్పలు తెప్పలుగా అనధికారికంగా కంప్యూటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఇళ్లల్లో, అపార్టుమెంట్లలో కంప్యూటర్లు అసెంబ్లింగ్ చేసి కోట్లలో జీరో వ్యాపారం చేస్తున్నారు. సంవత్సర కాలంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయం ముమ్మరమైంది. వ్యాపారులు జీరో వ్యాపారం చేసి ఏటా రూ. 10 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను ఎగనామం పెడుతున్నారు. కస్టమర్లు బిల్లు కావాలంటే ఒక రేటు, అక్కర్లేదంటే మరో రేటుకు కంప్యూటర్లు అమ్ముతున్నారు. విషయాలన్నీ తెలిసినా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంవత్సరానికి రూ.వంద కోట్ల విలువైన కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు జీరో వ్యాపారంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ ఐదు శాతం వ్యాట్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.10 కోట్లపైనే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న జీరో వ్యాపారం లాభసాటిగా ఉండడంతో నగరంలో కంప్యూటర్లు విక్రయించే డీలర్ల సంఖ్య గ ణనీయంగా పెరుగుతోంది. వాడవాడలా కంప్యూటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. అత్యధిక శాతం మంది అనామతుగా ఈ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు.
రైల్వేపార్శిల్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుల ద్వారా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు బిల్లులు లేకుండా వచ్చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల నుంచి యథేచ్ఛగా కంప్యూటర్ల స్పేర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇళ్లలో, అపార్టు మెంట్లలో అక్రమంగా నిల్వచేసి, అసెంబ్లింగ్ చేస్తున్నారు.
చెలరేగిపోతున్న డీలర్లు...
ఇటీవల కాలంలో జిల్లాలో ఈ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అన్ని రంగాల్లో కంప్యూటర్ల వాడకం పెరగటంతో లక్షలాది మంది కొనుగోలు చేస్తున్నారు. డీలర్లలో కొందరు జీరో వ్యాపారం చేస్తుండగా, మరి కొందరు నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్నారు. ఈ తరహా వ్యాపారం చేసే వారు ఎందరున్నారు? నెలకు ఎంత మొత్తం అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం వాణిజ్యపన్నుల శాఖ అధికారుల వద్ద లేకపోవటం గమనార్హం.
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం...
కంప్యూటర్ల జీరో వ్యాపారం విషయమై వాణిజ్యపన్నుల శాఖ -2డివిజన్ డెప్యూటీ కమిషనర్ ఎస్. శేఖర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. దొంగ రవాణాను అరికట్టేందుకు పలు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మకాలు సాగిస్తూ పట్టుపడినవారి నుంచి భారీగా జరిమానా వసూలు చేస్తామని ఆయన హెచ్చరించారు.