‘సినిమా’ చూపిస్తున్నారా?
కలెక్షన్లపై వాణిజ్యపన్నుల శాఖ కన్ను
థియేటర్లలో రూ.కోట్లు వసూలవుతున్నా... వినోదపు పన్ను లక్షలు దాటట్లేదు
టిక్కెట్ల అమ్మకాలకు ఆన్‌లైన్‌తో అనుసంధానం
కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో స్పష్టత ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ
హైదరాబాద్: ఒక సినిమా వందల కోట్ల రూపాయల క్లబ్బుల్లో చేరినా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లిస్తున్న వినోదపు పన్ను రూ.లక్షలు దాటడం లేదు. థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రేక్షకుల సంఖ్యకు, శాఖకు చూపించే లెక్కలకు పొంతనే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వినోదపు పన్ను వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పెట్టింది. ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ వినోదపు పన్ను వసూళ్ల తీరును చూసి నివ్వెరపోయింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సినిమాల ద్వారా రాష్ట్రం నుంచి ఏటా వందల కోట్ల రూపాయలు వసూలవుతున్నా వినోదపు పన్ను రూ.80 కోట్లు దాటడం లేదు. థియేటర్లలో ప్రదర్శితమయ్యే తెలుగు సినిమాలపై 15 శాతం, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషా చిత్రాలపై 20 శాతం పన్ను వసూలు చే స్తారు.
ఆన్‌లైన్ అనుసంధానంతో...
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 532 సినిమా థియేటర్లలో సుమారు 3 లక్షల సీట్లకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు ఆన్‌లైన్ లింక్ చేయాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. తొలుత గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లు, త దుపరి మునిసిపాలిటీలు, గ్రామ స్థాయికి వె ళ్లాలని నిర్ణయించారు. గ్రామ పంచాయితీల్లో సినిమా టిక్కెట్లతో సంబంథం లేకుండా ఉన్న శ్లాబ్ పన్ను విధానాన్ని తొలగించి, టిక్కెట్ల అమ్మకాల ద్వారానే పన్ను వసూలు చేయనున్నారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ లు, థియేటర్లలో జరిగే టిక్కెట్ల అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వాణిజ్యపన్నుల శాఖలో రికార్డ్ అయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) సమన్వయంతో థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాల వివరాలు శాఖకు చేరేలా సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు.
సెట్‌టాప్ బాక్స్‌తో ఎగవేతలకు చెక్...
రాష్ట్రంలో కేబుల్ కనెక్షన్ లేని ఇళ్లు 10 శాతం కూడా ఉండవని ఓ అంచనా. ప్రతి కేబుల్ ఆపరేటర్ వినోదపు పన్నును వేర్వేరు శ్లాబుల్లో చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీలోని కేబుల్ ఆపరేటర్ నెలకు రూ.100 నుంచి రూ. 200 వరకు చెల్లించాలి. ఇక ప్రతి కేబుల్ కనెక్షన్‌కు కార్పొరేషన్‌లో రూ.5, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలో రూ.4, మొదటి, రెండో గ్రేడ్ మునిసిపాలిటీల్లో రూ.3, ఇతర మునిసిపాలిటీల్లో రూ.2 చొప్పున పన్ను చెల్లించాలి. కానీ ఒక్కో ఆపరేటర్‌కు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయన్న విషయంలోనే స్పష్టత లేదు. కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్స్‌లు అనుసంధానం చేయడం వల్ల ఈ వివరాలు తెలుస్తాయి. హైదరాబాద్ పరిధిలో సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తికాగా, మిగతా చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.