దూసుకుపోతున్న వాణిజ్యపన్నుల శాఖ
- 3 నెలల్లో రూ. 8,484 కోట్ల రెవెన్యూ
- గత ఏడాది కన్నా 14.6 శాతం వృద్ధి
- మద్యం అమ్మకాలపై పన్నులో 24 శాతం వృద్ధి
- ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43,115 కోట్ల లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వాణిజ్యపన్నుల శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాల దిశగా పరుగెడుతోంది. ఈ సంవత్సరం తొలి త్రైమాసిక ం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లో 2015-16 కన్నా 14.6 శాతం వృద్ధిరేటుతో రూ. 8,484 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇది గత సంవత్సరం మూడు నెలల్లో సాధించిన రెవెన్యూ కన్నా రూ. 1,077 కోట్లు అధికం. మద్యం అమ్మకాల పై వచ్చే పన్ను ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇక డివిజన్‌లలో కూడా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ప్రతి నెలా రూ. 2,800 కోట్ల సగటుతో వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం సమకూర్చుకుంటోంది.
83 శాతం వసూలు..
2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 43,115 కోట్ల రెవెన్యూ సాధించాలని వాణిజ్యపన్నుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది గత ఏడాది (2015-16) కన్నా రూ. 11,997 కోట్లు అధికం. కాగా తొలి మూడు నెలల్లో రూ. 10,266 కోట్లు లక్ష్యం కాగా, 3 నెలల్లో రూ. 8,484 కోట్లతో 83 శాతం లక్ష్యా న్ని సాధించింది. ఇందులో మద్యం అమ్మకాలపై 24 శాతం వృద్ధిరేటుతో మూడు నెలల్లో రూ. 2,290 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులపై రూ.1,810 కోట్లు (వృద్ధిరేటు 7.68 శాతం) రాగా, 12 డివిజన్‌ల నుంచి 4,383 కోట్లు (వృద్ధి రేటు 13 శాతం) వచ్చింది.
వ్యాట్, సీఎస్‌టీ ద్వారా 97 శాతం రెవెన్యూ..
వాణిజ్యపన్నుల శాఖ వసూలు చేసే పన్నులు ఏడు రకాలుగా ఉండగా, కేవలం విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్‌టీ) ద్వారానే 97 శాతానికి పైగా రెవెన్యూ రావడం విశేషం. మూడు నెలల్లో మొత్తం వసూలైన రూ. 8,484 కోట్లలో 8,261 కోట్ల రూపాయలు కేవలం వ్యాట్, సీఎస్‌టీల ద్వారానే రాగా, మరో రూ. 222 కోట్లు మాత్రమే ఇతర పన్నుల ద్వారా సమకూరాయి. వృత్తిపన్ను ద్వారా రూ. 85.97 కోట్లు, వినోదపు పన్ను ద్వారా రూ. 33.11 కోట్లు, లగ్జరీ పన్ను ద్వారా రూ. 25.68 కోట్లు, ఆర్‌డీ సెస్ ద్వారా రూ.64 కోట్లు, ప్రవేశపన్ను కింద రూ. 1.41 కోట్లు, గుర్రపు పందాలు, బెట్టింగుల ద్వారా రూ. 12.15 కోట్లు సమకూరాయి.