లక్ష్యం చేరాల్సిందే!
- ఈ ఏడాది వాణిజ్యపన్నుల శాఖ
- టార్గెట్ రూ.43 వేల కోట్లు
- బకాయిలు, ఎగవేతలపై సీఎం సీరియస్
- క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్నిపటిష్టం చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్యపన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచిసంస్కరించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సమకూరుతున్న పన్నులకు తోడు అధికార యంత్రాంగం పనితీరును మెరుగుపరిచి వసూళ్లు పెంచాలన్నది సీఎం ఆలోచన. ఇందులో భాగంగానే ఈ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం శనివారం వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వచ్చే పన్ను మీదే ఆధారపడకుండా మొండి బకాయిల వసూళ్లు, కోర్టు కేసుల పరిష్కారం, జీరో దందాను అరికట్టే విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏయేటికాయేడు 20 శాతం అదనపు రెవెన్యూ రాబడి లక్ష్యంగా పన్నులు వసూలు చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ.. జీరోదందాను అరికట్టి, అక్రమ వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప సత్ఫలితాలు సాధించలేదన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్దేశించుకున్న రూ. 43,115 కోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయాల్సిందేనని, అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. దీంతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్దేశించి పన్ను వసూళ్లలో వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.
మద్యం, పెట్రో ఉత్పత్తులపై రూ. 15 వేల కోట్లుపైనే..
2015-16 సంవత్సరంలో రూ. 33,965 కోట్ల పన్ను వసూలు లక్ష్యాన్ని పెట్టుకున్న వాణిజ్యపన్నుల శాఖ రూ. 32,492 కోట్లు సాధించింది. 96 శాతం లక్ష్యాన్ని సాధించినప్పటికీ, ఇందులో సగం పన్ను కేవలం మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారానే సమకూరింది. సుమారు రూ. 17వేల కోట్లు మాత్రమే మిగతా వస్తువుల మీద పన్ను రూపంలో సమకూరింది. వాణిజ్యపన్నుల శాఖ పన్ను వసూళ్ల డిమాండ్ నోటీస్ ఇవ్వగానే కోర్టులను ఆశ్రయించే బడా బాబుల నుంచి రావలసిన మొత్తమే రూ. 3,600 కోట్లు ఉంది. కోర్టు కేసులతో సంబంధం లేకుండా రావలసిన మొండి బకాయిలు మరో 2వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా. కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయవాదులను నియమించుకొని ఆదాయాన్ని రాబట్టుకోవాలని గతంలో సీఎం ఆదేశించినా, ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. శనివారం నాటి సమావేశంలో బకాయిల వసూళ్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పన్ను విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి
వ్యాట్‌తో పాటు గుర్రపు పందాల పన్ను, వినోద పు పన్ను, లగ్జరీ ట్యాక్స్ వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. అలాగే పన్ను విధానంలో మార్పులు చేయడం, ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై నిఘా పెంచడం, చెక్‌పోస్టుల ఆధునీకరణతో పాటు జిల్లాల వారీగా డివిజన్‌ల ఏర్పాటు, సర్కిళ్ల పెంపు, అధికారుల నియామకం తదితర అంశాలను కూడా సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. సంస్కరణలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం.