
244 కొలువులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 244 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ పంపించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థిక శాఖ ప్రస్తుత అవసరాల మేరకు ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది.
టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ, నియామకాల భర్తీకి అవసరమైన షెడ్యూలు జారీ, తదితర చర్యలు చేపట్టే బాధ్యతలను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించింది. స్థానికత, రోస్టర్ వివరాలు, అర్హత నిబంధనలన్నీ సంబంధిత విభాగం టీఎస్‌పీఎస్‌సీకి అందజేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.