మంత్రి.. ఉన్నతాధికారి.. అండా దండా! | Deputy Commissioner of Commercial Taxes Department of the CM complaints | Sakshi
Sakshi News home page

మంత్రి.. ఉన్నతాధికారి.. అండా దండా!

Published Fri, Jun 17 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

Deputy Commissioner of Commercial Taxes Department of the CM complaints

వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌పై  సీఎం వరకు ఫిర్యాదులు
ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరోపణలు
మంత్రి వ్యతిరేక వర్గం పక్కా వ్యూహం
ఏసీబీ సోదాలతో   చర్చనీయాంశం

 

విజయవాడ :  వాణిజ్య పన్నుల శాఖ డివిజన్-2 డిప్యూటీ కమిషనర్ శీతలం శేఖర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి తెలిపారు. ఆయన ఇంట్లో రూ.3 లక్షల నగదు, అర కిలో బంగారంతో పాటు వైజాగ్‌లో ఒక జీ+3 భవనం డాక్యుమెంట్లు లభించాయని ఆమె చెప్పారు. శేఖర్ ఇంటి వద్దే కాకుండా కార్యాలయానికి కూడా ఏసీబీ అధికారులు వచ్చి తనిఖీ చేశారని వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది తెలిపారు. ఆయన కార్యాలయంపై దాడులు జరగడం ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ తదితర ప్రాంతాల్లోని శేఖర్ బంధువుల ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిపై ఏసీబీ సోదాలు జరగటం ఇదే ప్రథమం.

 
డీలర్లతో వివాదాలు...

శేఖర్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వారు. ఆయన గతంలో విజయనగరం, విశాఖపట్నం, కర్నూలులో పనిచేసేటప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కర్నూలులో పనిచేసేటప్పుడు డీలర్లతో వివాదం జరిగితే ఏకంగా ఆ జిల్లా మంత్రి వరకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన్ను అక్కడ నుంచి అప్పటికప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు సమాచారం. అయినా తన పరపతిని ఉపయోగించుకుని విజయవాడ డివిజన్-2 డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతిపై వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత తనకు అనుకూలంగా ఒక వర్గాన్ని తయారు చేసుకుని అవినీతికి పాల్పడేవారని వాణిజ్య పన్నుల శాఖలో చర్చ జరుగుతోంది. దీంతో మిగిలిన సిబ్బంది ఆయనకు దూరమయ్యారు. నగరంలోని కొంతమంది డీలర్లతోనూ వివాదాలు ఏర్పడ్డాయని తెలిసింది. 

 
ఒక జేబులో మంత్రి.. మరో జేబులో ఉన్నతాధికారి...

డిప్యూటీ కమిషనర్ శేఖర్‌కు ఉన్నతస్థాయిలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ఆయనకు ఒక జేబులో మంత్రి, మరో జేబులో వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నతాధికారి ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్జీవో సంఘ నేతల నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారు నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించేవారని ఆయన వ్యతిరేక వర్గం చెబుతోంది. వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో తన మార్క్ చూపించేందుకు శేఖర్ ప్రయత్నించారని తెలిసింది. వాస్తవంగా వాణిజ్య పన్నుల శాఖలో రెండు మూడేళ్లు దాటగానే బదిలీ చేస్తారు. విజయవాడలోని రెండు డివిజన్ల డిప్యూటీ కమిషనర్లను మూడేళ్లు దాటినా బదిలీ చేయకుండా అక్కడే కొనసాగించడం గమనార్హం. తన బదిలీని ఆపేందుకే గాక ఆదాయం వచ్చే డివిజన్లను తనకు అనుకూలంగా ఉండే డీసీలకు ఇప్పించేందుకు ప్రయత్నించడంతో ఆయన కంటే సీనియర్లు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి నుంచి పూర్తిస్థాయి అండదండలు లభించడంతో ఆయన అనుకున్నట్లుగా సాగేదని సమాచారం. డిప్యూటీ కమిషనర్ శేఖర్‌కు విశాఖపట్నంలో 2200 చదరపు గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో స్థలాలు, హైదరాబాద్ మాదాపూర్, కొండాపూర్ వంటి చోట స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఆయన స్వస్థలం తాడేపల్లిగూడెం, శ్రీకాకుళంలో ఆస్తులు కూడబెట్టినట్లు వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు మంత్రితో ఉన్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యతిరేక వర్గం ఆయన కార్యకలాపాలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో ఏసీబీ దాడి చేసినట్లు సమాచారం.

 

నీరుగార్చేందుకు యత్నాలు!
డిప్యూటీ కమిషనర్-2 శేఖర్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి సోదాలు చేసినప్పటికీ కేసు కట్టలేదని తెలిసింది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో దాడి నిర్వహిస్తే ప్రభుత్వోద్యోగిపై సాధారణంగా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. అయితే శేఖర్‌పై కేసు కట్టడం లేదని తెలిసింది. దీని వెనుక పెద్ద మంత్రాంగమే నడిచినట్లు సమాచారం. శేఖర్ అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకి సమీప బంధువు. దాడుల ఘటనతో అప్రమత్తమైన ఆయన తనకు అనుకూలంగా ఉండే మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సాయంత్రం ఐదు గంటలకు ఆ శాఖ ముఖ్య అధికారి ఒకరు, ఏపీ ఎన్జీవోస్ ముఖ్య నేత, మరో ముగ్గురు సీటీవోలు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. అప్పటికే ఇద్దరు మంత్రులు సీఎం వద్ద చక్రం తిప్పారని వాణిజ్య పన్నుల శాఖలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మంత్రుల సిఫార్సు మేరకు శేఖర్‌పై కేసు నమోదు చేయబోమని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.

 

కొనసాగుతున్న సోదాలు
విజయవాడ (ఆటోనగర్) : డిప్యూటీ కమిషనర్ శీతలం శేఖర్ నివాసంలో గురువారం ఉదయం మొదలైన సోదాలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కించిన ఆస్తుల విలువ రూ 1.50 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.10 కోట్లపైనే ఉంటుందని సమాచారం. సోదాలు పూర్తయ్యాక శేఖర్‌ను అరెస్ట్ చేస్తామని ఏసీబీ డిఎస్పీ ఎ.రమాదేవి తెలిపారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సోదాల్లో పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటి డాక్యుమెంట్లు శేఖర్ నివాసంలోనే లభ్యమైనట్లు సమాచారం. సోదాలు జరిగే సమయంలో శేఖర్ ఆయన నివాసంలోనే ఉంటడంతో ఆస్తుల వివరాలను ఆయన్నే అడిగి ధృవీకరిస్తున్నారు. మిగతా ప్రదేశాలలో కూడా ఆస్తులున్నాయో లేదో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement