అధి‘కార్ల’ వైభోగం! | CTO Officers hulchul in krishna district | Sakshi
Sakshi News home page

అధి‘కార్ల’ వైభోగం!

Published Fri, May 20 2016 3:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

అధి‘కార్ల’ వైభోగం!

అధి‘కార్ల’ వైభోగం!

వాణిజ్య శాఖ కమిషనర్ ఆంక్షలు  
పర్యవేక్షణ బాధ్యతలు సీటీవోలకు..
 
విజయవాడ సిటీ : వాణిజ్య పన్నుల శాఖలో అద్దె కార్ల వినియోగంపై ఆ శాఖ కమిషనర్ ఆంక్షల కొరఢా ఝలిపించారు. అనర్హులు సైతం అడ్డగోలుగా కార్లను వినియోగిస్తూ..శాఖాపరమైన అవసరాలకు అందుబాటులో ఉంచకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిషనర్ జె.శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆడిట్ అవసరం కోసం మాత్రమే వాహనాలు వినియోగించాల్సిన డీసీటీవోలు సొంత పనులకు కార్లను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించారు. వాహనాల తనిఖీలకు వెళ్లేందుకు అవసరమైన వాహనాలు లేవంటూ ఏసీటీవో స్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దీనిపై దృష్టిసారించారు.
 
 సంఖ్యాపరంగా అద్దె కార్లు ఉన్నప్పటికీ..వాహనాలు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన ఆయన   17వతేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఆయా సర్కిల్ పరిధిలో ఉండే వాహనాలు వాణిజ్య పన్నుల అధికారి(సీటీవో) పర్యవేక్షణలోనే శాఖాపరమైన విధులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆయా వాహనాల వినియోగానికి సంబంధించి ప్రత్యేక రికార్డు(లాగ్‌బుక్) నిర్వహించాలని ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్లకు స్పష్టం చేశారు.
 
 50కి పైగా అద్దె వాహనాలు...
 జిల్లా వాణిజ్య శాఖలో ఇద్దరు ఉప కమిషనర్లు(డీసీ), ఒక అదనపు ఉప కమిషనర్(ఏడీసీ), నలుగురు సహాయ కమిషనర్లు(ఏసీ), 20మంది సీటీవోలు, 40మంది డీసీటీవోలు ఉన్నారు. వీరికి ఉద్యోగ అవసరాల కోసం శాఖాపరంగా తగినన్ని సొంత వాహనాలు లేవు. కేవలం 10 జీపులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కండిషన్‌లో లేకపోవడం, డ్రైవర్లు పదవీ విరమణ చేయడంతో అద్దె కార్ల వినియోగానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఉన్నతాధికారులతో పాటు డీసీటీవో స్థాయి అధికారులు ఆడిట్‌కు వెళ్లేందుకు,సీటీవో, ఏసీటీవో స్థాయి అధికారులు వాహనాల తనిఖీలు చేసేందుకు వీటిని వినియోగించాలి.  
 
 నిబంధనలు ఇవీ...
 అద్దె ప్రాతిపదికన తీసుకునే కార్లకు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.25వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.24వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. ప్రతి వాహనం నెలకు 2500 కిలో మీటర్లు తిరగాలి. రవాణాశాఖ నిబంధనల ప్రకారం నాలుగేళ్ల లోపు కొనుగోలు చేసిన వాహనాలను మాత్రమే అద్దెకు తీసుకోవాలి. ఇందుకయ్యే ఇంధనం, మరమ్మతులు సహా అన్ని ఖర్చులను కారు యజమాని భరించాల్సిందే. ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కండీషన్‌లో లేని వాహనాలు  తిరుగుతున్నట్టు తెలిసింది.
 
 కాదంటే కట్...
 అద్దె ప్రాతిపదికన తిప్పే వాహనాలను సొంత అవసరాలకు వాడుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఇందుకు అంగీకరించకుంటే వాహనం కాంట్రాక్టు రద్దు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిసింది.
 
 టెండర్లు మేలు...
 ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే టెండర్ల ద్వారా వాహనాలు అద్దెకు తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ఇక్కడి ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పారదర్శకతతో పాటు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాదనేది వీరి అభిప్రాయం.
 
 ఉల్లంఘన...
 జిల్లాలోని వాణిజ్య శాఖలో కొందరు అధికారులు బంధువులు, సన్నిహితుల పేరిట టాక్సీ వాహనాలను కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన తిప్పుతున్నారు. రెండో డివిజన్ పరిధిలోని ఓ ఉన్నత అధికారి తన స్నేహితుడైన బ్యాంక్ అధికారి పేరిట వాహనం కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నట్టు ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే చెపుతున్నారు. ఇదే డివిజన్‌లోని కొందరు యూనియన్ నేతలు కూడా తమ సన్నిహితుల పేరిట కార్లను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారు. ఈ వ్యవహారాలు బయటకు రాకుండా చూసేందుకు రెండు డివిజన్లలో  వ్యవహారాలు చక్కబెట్టడంలో చేయి తిరిగిన గుమాస్తా, ఓ డీసీటీవో స్థాయి మహిళా అధికారిణికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. వీరు ఒక్కొక్క వాహనానికి రూ.1000 నుంచి రూ.2000 వరకు నెలవారీ మామూళ్ల కింద వసూలు చేస్తున్నట్టు చెపుతున్నారు.
 
కలెక్షన్ ఏజెంట్లుగా...
కొందరు అధికారులు ప్రైవేటు కారు డ్రైవర్లను తనిఖీల పేరిట కలెక్షన్లు వసూళ్లకు వినియోగిస్తున్నారు. తనిఖీలు, ఆడిట్ల సమయాల్లో వాహనాలు ఆపడం, బేరసారాలు సాగించడం మొదలు అనధికారిక మామూళ్లను వీరు వసూలు చేసి అధికారులకు ఇస్తున్నారు. గుడివాడ సీటీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో సంబంధిత అధికారి ప్రైవేటు కారు డ్రైవరు వద్ద రూ.2లక్షలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement