సాక్షి, హైదరాబాద్: మాంసం ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మాంసం ఎగుమతి సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. దుబాయ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న గల్‌ఫుడ్–2018 ఫుడ్ ట్రేడ్ షోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని పాల్గొన్నారు.
మాంసం ఉత్పత్తి, పాల ఉత్పత్తి, పౌల్ట్రీరంగాల ఏర్పాటుకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని ప్రతినిధులకు వివరించారు. దాదాపు 100 ఎకరాల్లో మాంసం ఎగుమతి కేంద్రాన్ని నెలకొల్పేందుకు లూలూ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులు సీఈవో సలీం, కో–డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో చర్చ సందర్భంగా ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు.
5,800 మందికి ఉపాధి..
హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా దాదాపు 800 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సదస్సులో మంత్రితో పాటు డెయిరీ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి బృందం పాల్గొన్నారు. భారత్ నుంచి మాంసం, చికెన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులకు సంబంధించిన దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
అపెడా (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ), అల్‌కబీర్, చెంగిచర్లలోని మహ్మద్ సలీం అండ్ కంపెనీ తదితర సంస్థలు రాష్ట్రం నుంచి స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే మాంసం నాణ్యత విషయంలో అన్నిరకాల నిబంధనలను పాటిస్తామని చెప్పారు. 2017–18 సంవత్సరంలో 420 మెట్రిక్ టన్నుల గొర్రె మాంసం, 59,800 మెట్రిక్ టన్నుల గేదె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మాంసం ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పాలన్న సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
Published Wed, Feb 21 2018 12:41 AM | Last Updated on Wed, Feb 21 2018 12:41 AM
Comments
Please login to add a commentAdd a comment