meat markets
-
లండన్‌లో వెయ్యేళ్ల మార్కెట్ల మూసివేత!
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న రెండు మాంసం దుకాణ వాణిజ్య సముదాయాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. లండన్‌లో 11వ శతాబ్దంలో ఏర్పాటైన బిల్లింగ్స్‌గేట్ చేపల మార్కెట్, స్మిత్ఫీల్డ్ మాంసం మార్కెట్ అతి త్వరలో మూతపడనున్నాయి. ఇన్నాళ్లూ హోల్‌సేల్ మార్కెట్లుగా శాసించిన ఈ రెండు వాణిజ్య సముదాయాలు ఇకపై పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఇక్కడి దుకాణాలను సమీపంలోని డాగెన్హామ్కు తరలించాలని మొదట్లో భావించారు. అయితే విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, ధరల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ రెండు మార్కెట్లు ఇకపై ఎక్కడా తమ కార్యకలాపాలను కొనసాగించబోవు. ఇక్కడి దుకాణాల యజమానులకు తగు నష్టపరిహారం, వ్యాపార ప్రోత్సాహకాలను అందించనున్నారు. దీంతో హోల్‌సేల్ దుకాణదారులు ఇకపై ఎవరికి వారు వేర్వేరుగా వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును త్వరలో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు లండన్ సిటీ కార్పొరేషన్ బుధవారం తెలిపింది. బిల్లింగ్స్‌గేట్, స్మిత్ఫీల్డ్లోని వ్యాపారులు ఇప్పటికిప్పుడు ఆయా వాణిజ్య సముదాయాలను ఖాళీచేయాల్సిన పనిలేదు. 2028 సంవత్సరందాకా వారికి గడువు ఇచ్చారు. ఆలోపు నెమ్మదిగా ఎవరిదారి వారు చూసుకోవాల్సి ఉంటుంది. పాత రోమన్ గోడకు అవతల నిర్మించిన స్మిత్‌ఫీల్డ్‌లో ఆ కాలంలో గుర్రాలు, గొర్రెలు, పశువుల అమ్మకానికి వినియోగించేవారు. తరువాత పూలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీతోపాటు చేపలు, మాంసం అమ్మకాలు మొదలయ్యాయి. వందల ఏళ్లుగా లండన్ నగర చరిత్రకు ఈ మార్కెట్లు సాక్షిగా నిలిచాయి. స్మిత్ఫీల్డ్ భవనాలు విక్టోరియన్ కాలం నాటివి. తర్వాత కొన్ని మార్పులు జరిగినా దాదాపు ఆకాలంనాటిలాగానే ఉన్నాయి. 1958లో ఒక పెద్ద అగ్నిప్రమాదానికి గురైనా చెక్కు చెదరలేదు. స్మిత్‌ఫీల్డ్‌లో వ్యాపారం రాత్రి పదింటికి మొదలై ఉదయం ఆరింటికల్లా ముగుస్తుంది. బిల్లింగ్స్‌గేట్ 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌గా పసిద్ధి చెందింది. శిథిలావస్థకు చేరడంతో మార్కెట్‌ను 1982లో డాక్లాండ్స్కు మార్చారు. ఇప్పుడు బిల్లింగ్స్‌గేట్ స్థలంలో 4,000 కొత్త గృహాలను నిర్మించే ప్రతిపాదన ఉంది. స్మిత్ఫీల్డ్ ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఇక్కడే కొత్త లండన్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. పూర్వం స్మిత్ఫీల్డ్ ప్రాంతం మద్యపానం, రౌడీలతో హింసకు చిరునామాగా ఉండేది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్ స్మిత్ఫీల్డ్ను అప్పట్లో ‘మురికి, బురద’కు కేంద్రస్థానంగా అభివర్ణించారు. ఆయన రాసిన ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ రచనల్లోనూ ఈ మార్కెట్ల ప్రస్తావన ఉంది. -
మటన్ కొంటున్నారా? జర జాగ్రత్త! విజయవాడలో భారీగా కుళ్లిన మాంసం పట్టివేత
సాక్షి, విజయవాడ: విజయవాడలో మాంసం దుకాణాలపై వీఎంసీ అధికారులు దాడులు చేపట్టారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమలో మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్‌నగర్, కొత్తపేట మార్కెట్లలో సోదాలు జరిపారు. మాచవరంలో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నటీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మాంసాన్ని కొనే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, తద్వారా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మొత్తం పరిశీలన చేసిన తరువాతే మాసం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: నాపరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ముగ్గురు కూలీలు దుర్మరణం -
మాంసానికి మకిలి..
రెండు రోజుల కిందట గుంటూరులోని మాంసం దుకాణాలు, హోటళ్లలో మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్‌నాయుడు జీఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. ఇందులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన మాంసం, ముందురోజు ఉడకబెట్టిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో దాచి ఉంచిన వైనం బయటపడింది. అంతే కాకుండా వెన్లాక్ మార్కెట్ వద్ద, రోడ్డు పక్కన విచ్ఛలవిడిగా జంతువధ చేస్తూ దాని నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపక్కన, కాలువల్లో పడేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. గతంలో పలు మార్లు అధికారుల తనిఖీల్లో సైతం ఇదే విషయాలు బయటపడ్డాయి. తనిఖీలు చేసి తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ఇటువంటి ఘటనలే పునరావృతమవుతున్నాయి. సాక్షి, గుంటూరు: నగరంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. రోడ్ల పక్కనే యథేచ్ఛగా జంతువులను వధిస్తూ.. వస్తున్న వ్యర్థాలను మురుగు కాలువల్లోకి వదులుతున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే స్లాటర్ హౌస్ (జంతువధ శాల) కోర్టు అక్షింతలతో మూతపడింది. స్లాటర్ హౌస్ మూతపడి ఏడాది దాటుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్లపక్కన, నివాస ప్రాంతాల్లో జంతువధ చేసేవారిపై చర్యలు తీసుకోవడం లేదు. మాంసానికి మకిలి.. ప్రస్తుతం నగరంలోని మాంసం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో భద్రపరిచి వాటినే ప్రజలకు విక్రయిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి వేలాది మంది డయేరియాతో ఆస్పత్రి పాలై 25 మందికి పైగా మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ప్రజారోగ్యంపై అధికారుల్లో చలనం కనిపించడం లేదు. గుంటూరును రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న హామీలు నీటిమూటలుగానే మారాయి. నగర సుందరీకరణ, నగరాభివృద్ధి మాట అటుంచితే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇక్కడి స్లాటర్ హౌస్ నిబంధనలు పాటించడం లేదని, దాని వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు గతంలో కార్పొరేషన్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పట్లో స్లాటర్ హౌస్‌ను మూసేశామంటూ అధికారులు హైకోర్టుకు నివేదిక ఇవ్వడం, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అక్షింతలు వేసింది. ఆ తర్వాత జంతువధ శాలను మూసివేశారు. అప్పటి నుంచి యథేచ్ఛగా రోడ్ల పక్కనే జంతువులను కోసి మాంస విక్రయాలు జరుపుతున్నారు. వాస్తవానికి జంతువులను వధించాలంటే పశువైద్యుడు సర్టిఫై చేయాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించక పోవడంతో ప్రజల ఆరోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటు.. ఏడాది కాలంగా మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 10న మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం ఓ ఇంజినీరింగ్ సంస్థ డీపీఆర్ తయారు చేసి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అనంతరం నగరంలో కలుషిత నీటితో డయేరియా ప్రబలడం, మూడు నెలల పాటు అధికారులంతా దానిపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. బాధ్యులపై చర్యలతో మోడరన్ స్లాటర్ హౌస్ ఫైల్ మూలనపడింది. స్లాటర్ హౌస్ లేకపోవడంతో రోడ్ల పక్కన జంతు వధ చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా పోతోందని అధికారులే చెబుతున్నారు. పాత స్లాటర్ హౌస్కుఅనుమతులు ఇవ్వాలని కోరాం.. గతంలో మూసివేసిన స్లాటర్ హౌస్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ శాఖను గతంలోనే కోరాం. ఇందులో వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లి శుద్ధి చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటుకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. పాత స్లాటర్ హౌస్‌ను తెరిచేందుకు కాలుష్యనియంత్రణ శాఖ అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నాం. – డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ, గుంటూరు నగరపాలక సంస్థ -
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: మాంసం ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మాంసం ఎగుమతి సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. దుబాయ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న గల్ఫుడ్–2018 ఫుడ్ ట్రేడ్ షోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని పాల్గొన్నారు. మాంసం ఉత్పత్తి, పాల ఉత్పత్తి, పౌల్ట్రీరంగాల ఏర్పాటుకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని ప్రతినిధులకు వివరించారు. దాదాపు 100 ఎకరాల్లో మాంసం ఎగుమతి కేంద్రాన్ని నెలకొల్పేందుకు లూలూ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులు సీఈవో సలీం, కో–డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో చర్చ సందర్భంగా ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. 5,800 మందికి ఉపాధి.. హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా దాదాపు 800 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సదస్సులో మంత్రితో పాటు డెయిరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి బృందం పాల్గొన్నారు. భారత్ నుంచి మాంసం, చికెన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులకు సంబంధించిన దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అపెడా (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ), అల్‌కబీర్, చెంగిచర్లలోని మహ్మద్ సలీం అండ్ కంపెనీ తదితర సంస్థలు రాష్ట్రం నుంచి స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే మాంసం నాణ్యత విషయంలో అన్నిరకాల నిబంధనలను పాటిస్తామని చెప్పారు. 2017–18 సంవత్సరంలో 420 మెట్రిక్ టన్నుల గొర్రె మాంసం, 59,800 మెట్రిక్ టన్నుల గేదె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మాంసం ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పాలన్న సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. -
మాంసం కొంటున్నారా?
పశ్చిమగోదావరి, నిడదవోలు: మాంసం వినియోగం ఇటీవలకాలంలో బాగా పెరుగుతోంది. ఇందులో అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు లభిస్తాయి. దీంతో దాదాపుగా ప్రతి ఇంట్లో మాంసం తప్పనిసరిగా వాడుతున్నారు. ఇక ఆదివారాలైతే సరేసరి. ముక్కలేనిదే ముద్ద దిగని వారు చాలామందే ఉంటారు. అయితే మాంసం ప్రియులు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ మాంసం తింటే వ్యాధుల బారినపడే అవకాశం ఉందని నిడదవోలు పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకోటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మాంసం నాణ్యతను, మాంసం నిల్వ అయితే కలిగే మార్పులను గమనించి కొనుగోలు చేయాలంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రంగు, రుచి, మెత్తదనం, వాసన, నీటిని పీల్చే గుణాన్ని బట్టి మాంసం నాణ్యతను నిర్ధారించవచ్చును. సాధారణంగా మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. గొడ్డు మాంసం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. గొర్రె, మేక మాంసం మధ్యస్థ ఎరుపులోను, పంది మాంసం తెలుపు రంగులో ఉంటుంది. చిన్న వయసు ఉన్న పశుపు మాంసంతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పసుపు మాంసం ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది. నిల్వ ఉంచిన మాంసానికి నీటిని పీల్చుకునే గుణం తక్కువ. మెత్తదనం అనేది కండరాలను కలిపే కణజాలం వల్ల కలుగుతుంది. చిన్న వయసు పశువులతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పశువుల్లో ఈ కణజాలం తక్కువగా ఉండి మాంసం గట్టిగా ఉంటుంది. ప్రతి జంతువు మాంసానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానిని బట్టి మాంసాన్ని గుర్తించవచ్చు. మాంసం నిల్వ ఉంటే కలిగే మార్పులు ♦ మాంసాన్ని సక్రమంగా నిల్వ చేయకుంటే కొన్ని మార్పులు జరిగి పాడైపోతుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాల మూలంగా మాంసంలోని కొవ్వులు, మాంసకృత్తులు విచ్ఛిన్నమై కొన్ని మార్పులు జరుగుతాయి. ♦ సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు జరిపే చర్య వల్ల బ్యుటరిక్, ప్రొపియోనిక్ ఏర్పడి మాంసానికి చెడు వాసన కలుగుతుంది. ♦ నిల్వ మూలంగా సూక్ష్మజీవులు స్రవించే రంగుల వల్ల మాంసం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతుంది. ♦ పూడోమోనాస్, స్టెఫ్టోకోకస్, లాక్టో బాసిల్లస్ వంటి బ్యాక్టీరియాల వల్ల మాంసంపై పలుచని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. ♦ మాంసంపైన శిలీంధ్రాల వల్ల నలుపు, తెలపు, ఆకుపచ్చని రంగుమచ్చలు ఏర్పడతాయి. ♦ మాంసంలో సల్ఫర్ పదార్థాలు ♦ విచ్ఛినమవడం వల్ల హైడ్రోజన్ సల్ఫేట్, ఇతర మార్పుల వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ♦ మాంసం పాడైనప్పుడు ఉత్పత్తి అయిన ఆమ్లాల వల్ల పుల్లగా తయారవుతుంది. ♦ నిల్వ మాంసంలో కొవ్వు పదార్థాలు విచ్ఛినం జరిగి ఒక రకమైన వాసన వస్తుంది. దీనిలే రేన్సీడ్ వాసన అంటారు. ♦ ప్రొటీన్లు విచ్ఛినం జరిగితే చేదు రుచి, చెడు వాసన కలుగుతుంది. ♦ నిల్వ మాంసం ఉపరితలంపై మెరుపు కనిపిస్తుంది. దీనినే ఫాస్ఫోరిసాన్నే అంటారు. ♦ కొన్నిసార్లు ఎముక దగ్గరి మాంసం పాడైపోతుంది. -
మార్కెట్లకు మహర్దశ
- ఆధునిక హంగులతో నిర్మాణం - ప్రతిపాదనల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు బెల్లంపల్లి : కూరగాయలు, మాంసం మార్కెట్లకు మహర్దశ రాబోతోంది. ఆధునిక హంగులతో మా ర్కెట్లను నిర్మించి ఏసీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతు బజార్, పాత మా ర్కెట్లను ఆధునికీకరించి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన కూరగాయలు, మాంసం విక్రయాలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. పక్షం రోజు ల్లోగా ప్రతిపాదనలు పంపించాలని పురపాలక, ప ట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. వీరు సంబంధిత ప్రతిపాదనలు కలెక్టర్‌కు అందించాల్సి ఉంది. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉండగా.. వీటి పరిధిలో ఏడు మార్కెట్లు ఉన్నాయి. దశాబ్దాల క్రితం కూరగాయలు, మాంసం మార్కెట్లను నిర్మించారు. పాలకుల నిర్లక్ష్యంతో ఆయా మున్సిపాలిటీల్లోని మార్కెట్లలో కనీస సదుపాయాలు లేకుండాపోయాయి. భవనాలు శిథిలావస్థకు చేరుకుని, కనీస సదుపాయాలు కరువయ్యాయి. వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాలు లేకుండాపోయాయి. మార్కెట్లలో సదుపాయాలు కల్పించడంలో ఏళ్ల తరబడి నుంచి నిర్లక్ష్యం జరుగుతోంది. ప్రతిపాదించాల్సిన అంశాలు.. మార్కెట్ల ఏర్పాటుకు తగిన ఫార్మాట్లో ప్రతిపాదించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీలకు సూచించింది. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ల సంఖ్య, ఆయా మార్కెట్ల విస్తీర్ణం, కొత్తగా ప్రతిపాదించే మార్కెట్లు, ఆధునికీకరణకు ప్రతిపాదన చేసే మార్కెట్ల సంఖ్య, ఇందుకు సంబంధించి అవసరమయ్యే నిధులు, ఇతర మౌలిక అంశాలతో మున్సిపాలిటీలకు నిర్దేశించిన ఫార్మాట్‌ను మున్సిపల్ శాఖ పంపించింది. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని మార్కెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించింది. ఒక్కో మున్సిపాలిటీ తరఫున మూడేసి ప్రతిపాదనల సెట్లను పంపించాలని ఆదేశించింది. మున్సిపాలిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. క్రయవిక్రయాలకు సూచనలు పాత కూరగాయలు, మాంసం మార్కెట్లు, రైతు బజార్లు ఆధునికీకరించే వరకు ఆహార పదార్థాల అమ్మకాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. నేలపై ఉంచి కూరగాయలు, మాంసం విక్రయాలు జరపరాదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తే టేబుల్, ప్లాట్‌ఫాంపై సురక్షిత పద్ధతిలో విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. యథాప్రకారం కాకుండా ఇకపై వధించే జంతువుల ఆరోగ్య స్థితిని వెటర్నరీ వైద్యులతో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని పేర్కొంది. మాంసం మార్కెట్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాంసాన్ని నైలాన్ నెట్స్‌తో కప్పి ఉంచాలని, గాలి, వెలుతురు సరిపడా వచ్చేలా చూడాలని, మాంసం వ్యర్థపదార్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రత్యేకంగా చెత్తబుట్టలో వేసి పారిశుధ్య సిబ్బందికి అప్పగించేలా చూడాలంది. 40 మైక్రన్ల కంటే తక్కువ మందం కలిగిన పాల్తిన్ కవర్ల అమ్మకాలు జరగకుండా నిరోధించాలని, వస్త్రం, కాగితంతో తయారు చేసిన బ్యాగ్‌ను ప్రోత్సహించాలని, స్థలం అందుబాటులో ఉంటే కూరగాయల మార్కెట్లోనే వ్యర్థపదార్థాలతో వర్మికంపోస్టు యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెట్ కమిటీలకు మార్గదర్శకం చేయాలని, వర్షం నీరు మార్కెట్లో నిల్వ ఉండకుండా ప్రత్యేక డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ విషయంపై బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఏఈ రాజ్‌కుమార్ ను వివరాలు కోరగా.. రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించి ఉత్తర్వులు ఆన్లైన్లో వచ్చినట్లు తెలిపారు.