మార్కెట్‌లకు మహర్దశ
- ఆధునిక హంగులతో నిర్మాణం
- ప్రతిపాదనల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు
బెల్లంపల్లి : కూరగాయలు, మాంసం మార్కెట్లకు మహర్దశ రాబోతోంది. ఆధునిక హంగులతో మా ర్కెట్లను నిర్మించి ఏసీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతు బజార్, పాత మా ర్కెట్లను ఆధునికీకరించి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన కూరగాయలు, మాంసం విక్రయాలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. పక్షం రోజు ల్లోగా ప్రతిపాదనలు పంపించాలని పురపాలక, ప ట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. వీరు సంబంధిత ప్రతిపాదనలు కలెక్టర్‌కు అందించాల్సి ఉంది. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉండగా.. వీటి పరిధిలో ఏడు మార్కెట్లు ఉన్నాయి.
దశాబ్దాల క్రితం కూరగాయలు, మాంసం మార్కెట్లను నిర్మించారు. పాలకుల నిర్లక్ష్యంతో ఆయా మున్సిపాలిటీల్లోని మార్కెట్‌లలో కనీస సదుపాయాలు లేకుండాపోయాయి. భవనాలు శిథిలావస్థకు చేరుకుని, కనీస సదుపాయాలు కరువయ్యాయి. వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాలు లేకుండాపోయాయి. మార్కెట్‌లలో సదుపాయాలు కల్పించడంలో ఏళ్ల తరబడి నుంచి నిర్లక్ష్యం జరుగుతోంది.
ప్రతిపాదించాల్సిన అంశాలు..
మార్కెట్‌ల ఏర్పాటుకు తగిన ఫార్మాట్‌లో ప్రతిపాదించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీలకు సూచించింది. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ల సంఖ్య, ఆయా మార్కెట్‌ల విస్తీర్ణం, కొత్తగా ప్రతిపాదించే మార్కెట్‌లు, ఆధునికీకరణకు ప్రతిపాదన చేసే మార్కెట్‌ల సంఖ్య, ఇందుకు సంబంధించి అవసరమయ్యే నిధులు, ఇతర మౌలిక అంశాలతో మున్సిపాలిటీలకు నిర్దేశించిన ఫార్మాట్‌ను మున్సిపల్ శాఖ పంపించింది. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని మార్కెట్‌ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించింది. ఒక్కో మున్సిపాలిటీ తరఫున మూడేసి ప్రతిపాదనల సెట్లను పంపించాలని ఆదేశించింది. మున్సిపాలిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది.
క్రయవిక్రయాలకు సూచనలు
పాత కూరగాయలు, మాంసం మార్కెట్‌లు, రైతు బజార్‌లు ఆధునికీకరించే వరకు ఆహార పదార్థాల అమ్మకాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. నేలపై ఉంచి కూరగాయలు, మాంసం విక్రయాలు జరపరాదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తే టేబుల్, ప్లాట్‌ఫాంపై సురక్షిత పద్ధతిలో విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. యథాప్రకారం కాకుండా ఇకపై వధించే జంతువుల ఆరోగ్య స్థితిని వెటర్నరీ వైద్యులతో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని పేర్కొంది.
మాంసం మార్కెట్‌లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాంసాన్ని నైలాన్ నెట్స్‌తో కప్పి ఉంచాలని, గాలి, వెలుతురు సరిపడా వచ్చేలా చూడాలని, మాంసం వ్యర్థపదార్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రత్యేకంగా చెత్తబుట్టలో వేసి పారిశుధ్య సిబ్బందికి అప్పగించేలా చూడాలంది. 40 మైక్రన్‌ల కంటే తక్కువ మందం కలిగిన పాల్తిన్ కవర్ల అమ్మకాలు జరగకుండా నిరోధించాలని, వస్త్రం, కాగితంతో తయారు చేసిన బ్యాగ్‌ను ప్రోత్సహించాలని, స్థలం అందుబాటులో ఉంటే కూరగాయల మార్కెట్‌లోనే వ్యర్థపదార్థాలతో వర్మికంపోస్టు యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెట్ కమిటీలకు మార్గదర్శకం చేయాలని, వర్షం నీరు మార్కెట్‌లో నిల్వ ఉండకుండా ప్రత్యేక డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ విషయంపై బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఏఈ రాజ్‌కుమార్ ను వివరాలు కోరగా.. రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించి ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో వచ్చినట్లు తెలిపారు.