కుళ్లిన మాంసాన్ని గుట్టగా పోసి బ్లీచింగ్ చల్లిస్తున్న మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్‌నాయుడు, జీఎంసీ అధికారులు (ఫైల్)
రెండు రోజుల కిందట గుంటూరులోని మాంసం దుకాణాలు, హోటళ్లలో మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్‌నాయుడు జీఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. ఇందులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన మాంసం, ముందురోజు ఉడకబెట్టిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో దాచి ఉంచిన వైనం బయటపడింది. అంతే కాకుండా వెన్‌లాక్ మార్కెట్ వద్ద, రోడ్డు పక్కన విచ్ఛలవిడిగా జంతువధ చేస్తూ దాని నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపక్కన, కాలువల్లో పడేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. గతంలో పలు మార్లు అధికారుల తనిఖీల్లో సైతం ఇదే విషయాలు బయటపడ్డాయి. తనిఖీలు చేసి తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ఇటువంటి ఘటనలే పునరావృతమవుతున్నాయి.
సాక్షి, గుంటూరు: నగరంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. రోడ్ల పక్కనే యథేచ్ఛగా జంతువులను వధిస్తూ.. వస్తున్న వ్యర్థాలను మురుగు కాలువల్లోకి వదులుతున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే స్లాటర్ హౌస్ (జంతువధ శాల) కోర్టు అక్షింతలతో మూతపడింది. స్లాటర్ హౌస్ మూతపడి ఏడాది దాటుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్లపక్కన, నివాస ప్రాంతాల్లో జంతువధ చేసేవారిపై చర్యలు తీసుకోవడం లేదు.
మాంసానికి మకిలి..
ప్రస్తుతం నగరంలోని మాంసం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లలో కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో భద్రపరిచి వాటినే ప్రజలకు విక్రయిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి వేలాది మంది డయేరియాతో ఆస్పత్రి పాలై 25 మందికి పైగా మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ప్రజారోగ్యంపై అధికారుల్లో చలనం కనిపించడం లేదు. గుంటూరును రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న హామీలు నీటిమూటలుగానే మారాయి. నగర సుందరీకరణ, నగరాభివృద్ధి మాట అటుంచితే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇక్కడి స్లాటర్ హౌస్ నిబంధనలు పాటించడం లేదని, దాని వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు గతంలో కార్పొరేషన్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పట్లో స్లాటర్ హౌస్‌ను మూసేశామంటూ అధికారులు హైకోర్టుకు నివేదిక ఇవ్వడం, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అక్షింతలు వేసింది. ఆ తర్వాత జంతువధ శాలను మూసివేశారు. అప్పటి నుంచి యథేచ్ఛగా రోడ్ల పక్కనే జంతువులను కోసి మాంస విక్రయాలు జరుపుతున్నారు. వాస్తవానికి జంతువులను వధించాలంటే పశువైద్యుడు సర్టిఫై చేయాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించక పోవడంతో ప్రజల ఆరోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటు..
ఏడాది కాలంగా మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 10న మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం ఓ ఇంజినీరింగ్ సంస్థ డీపీఆర్ తయారు చేసి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అనంతరం నగరంలో కలుషిత నీటితో డయేరియా ప్రబలడం, మూడు నెలల పాటు అధికారులంతా దానిపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. బాధ్యులపై చర్యలతో మోడరన్ స్లాటర్ హౌస్ ఫైల్ మూలనపడింది. స్లాటర్ హౌస్ లేకపోవడంతో రోడ్ల పక్కన జంతు వధ చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా పోతోందని అధికారులే చెబుతున్నారు.
పాత స్లాటర్ హౌస్‌కుఅనుమతులు ఇవ్వాలని కోరాం..
గతంలో మూసివేసిన స్లాటర్ హౌస్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ శాఖను గతంలోనే కోరాం. ఇందులో వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లి శుద్ధి చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మోడరన్ స్లాటర్ హౌస్ ఏర్పాటుకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. పాత స్లాటర్ హౌస్‌ను తెరిచేందుకు కాలుష్యనియంత్రణ శాఖ అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నాం. – డాక్టర్ శోభారాణి, ఎంహెచ్‌ఓ, గుంటూరు నగరపాలక సంస్థ
Comments
Please login to add a commentAdd a comment