రండి బాబూ.. రండి! | Pre-GST clearance sale | Sakshi
Sakshi News home page

రండి బాబూ.. రండి!

Published Tue, Jun 6 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

రండి బాబూ.. రండి!

రండి బాబూ.. రండి!

ప్రీ జీఎస్‌టీ క్లియరెన్స్‌ సేల్‌..
జీఎస్‌టీ అమలుపై గ్రేటర్‌ వ్యాపారుల్లో గందరగోళం
మిగిలి ఉన్న స్టాకుపై పన్ను వేస్తారని  ఆందోళన
ప్రీ జీఎస్‌టీ క్లియరెన్స్‌ సేల్‌ పేరిట తగ్గింపుతో అమ్మకాలు
ఆందోళన వద్దంటున్న వాణిజ్య పన్నుల శాఖ
జీఎస్‌టీతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు పెరిగే చాన్స్‌


సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ).. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న దేశమంతా ఒకే పన్ను విధానం.. జీఎస్‌టీతో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయని, మరికొన్ని పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌లోని వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తమ వద్ద మిగిలి ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తదితరాల స్టాకుపై జీఎస్‌టీ అధికంగా విధిస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

గతంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, కూలర్లు, వాషింగ్‌ మెషిన్లు, ఓవెన్స్, వాచీలు, మొబైల్స్‌ వంటి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు సంబంధించి ఇప్పటికే వ్యాపారుల వద్ద చాలా స్టాకు మిగిలింది. జీఎస్‌టీ అమలులోకి వస్తే పన్ను అధికంగా వేస్తారన్న భయంతో కొందరు వ్యాపారులు ఆయా వస్తువుల ధరలపై ఐదు నుంచి పది శాతం తగ్గింపుతో విక్రయించేస్తున్నారు.

 దీంతో వినియోగదారులు కూడా ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాల్లో జీఎస్‌టీపై ఆందోళన అవసరం లేదని, పెద్ద మొత్తంలో స్టాకు కొనుగోలు చేసి విక్రయించకుండా తమ వద్ద ఉన్నవారు గతంలో అధిక పన్నులు చెల్లించిన పక్షంలో జీఎస్‌టీలో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, జీఎస్‌టీ అమలుతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు సుమారు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

దిగిరానున్న నిత్యావసరాల ధరలు..
గ్రేటర్‌ జనాభా కోటికి చేరువైంది. ఇందులో 70 శాతానికిపైగా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారే. ప్రతినెలా వీరంతా ఇంటి అవస రాలకు బియ్యం, గోధుమలు, పాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తారు. వీటిపై జీఎస్‌టీ తగ్గించడంతో ఆయా ధాన్యాలపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర తగ్గే అవకాశాలున్నాయి. వంటనూ నెలపైనా పన్ను తగ్గడంతో లీటర్‌ నూనెపై ఇదే స్థాయిలో ధర తగ్గుముఖం పడతాయి. తలనూనె, సబ్బులు, టూత్‌పేస్టులపైనా పన్ను 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు రూ.5 నుంచి రూ.8 వరకూ తగ్గే అవకాశాలున్నాయి. దీంతో వేతనజీవులు, నిరు పేదల నెల బడ్జెట్‌ తగ్గుతుంది. వేతనజీవులు నెలవారీగా నిత్యా వసరా లకు రూ.5 వేలు ఖర్చు చేస్తుంటే.. జూలై నుంచి వారికి నెలకు రూ.500–1,000 వరకు మిగులు ఉండే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.

విలాస వస్తువులపైనే అధికం..
జీఎస్‌టీ విలాస వస్తువు లపైనే అధికంగా ఉంది. నిత్యావసరాలపై తక్కువగా ఉంది. ఈ పన్ను పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటగానే ఉంది. న్యాయంగా వ్యాపారం చేసేవారికి జీఎస్‌ టీ బాగానే ఉంటుంది. దొంగ వ్యాపారులకే ఇబ్బందికరం.    – జి.గోపాల్, వ్యాపారి

5 శాతానికి పరిమితం చేయాలి
నాన్‌ ఏసీ హోటల్స్‌కు12%, ఏసీ హోటల్స్‌కు 18% జీఎస్‌టీ విధించడంతో భోజన ప్రియులు హోటళ్లకు దూరమయ్యే పరిస్థితి ఉంది. జీఎస్‌టీ వల్ల హోటళ్ల గిరాకీపై తీవ్ర ప్రభావం పడ నుంది. హోటళ్లపై జీఎస్‌టీని 5 శాతానికే పరిమితం చేయాలి.    
– కిషన్‌యాదవ్, నందిని గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌

మిగిలిన స్టాకుపై పన్ను వద్దు
రెడీమేడ్‌ దుస్తులపై 23 శాతం జీఎస్‌టీ వి«ధించడం సబబుగాలేదు.గతంలో వీటిపై పన్ను చాలా తక్కువగా ఉండే ది. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్టాక్‌ పై పన్ను విధించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని తెలిసింది. దీనిని తక్షణం ఉపసంహరించు కోవాలి.    – ప్రసాద్, వ్యాపారి, బడీచౌడీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement