నిఘా నిద్దరోతోంది!
- జహీరాబాద్ కమర్షియల్ టాక్స్ చెక్‌పోస్టు అధికారుల నిర్లక్ష్యం
- వేబిల్లులు లేకుండానే రాష్ట్రంలో ప్రవేశిస్తున్న సరుకులు
- సిగరెట్ల వ్యాన్ పట్టివేతతో తేటతెల్లం
సంగారెడ్డి క్రైం: జిల్లా సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టు నిద్రపోతోంది. మామూళ్లపై శ్రద్ధ చూపుతున్న ఆ శాఖ అధికారులు అక్రమ రవాణాను నిలువరించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు ఎటువంటి వే బిల్లులు లేకుండానే లక్షల రూపాయల సరుకులను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సర్కార్ ఖజానాకు చేరాల్సిన సొమ్ములు పక్కదారి పడుతున్నాయి.
జహీరాబాద్ పట్టణ శివారులో అధికారులు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అయితే నిఘా తీవ్రం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడింది ఆటా పాడింది పాటగా మారింది. చెక్‌పోస్టుపై సంబంధిత శాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద ఎటువంటి వే బిల్లులు లేకుండా సిగరెట్ల లోడ్లతో వెళ్తున్న డీసీఎం (ఏపీ 09టీ 0849)ను పట్టుకున్నారు. ఆ వ్యాన్‌లో మొత్తం 53 కాటన్లలో ఇండోనేషియా సిగరెట్లు ఉన్నాయి. ఈ వ్యాన్ ముంబాయ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని సంగారెడ్డిలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వే బిల్లులు లేకుండా తరలిస్తున్న ఈ వ్యాన్ సంగారెడ్డిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఆధీనంలో ఉంది.
వాహనంలో ఉన్న సిగరెట్ల విలువ ఎంత ? ఈ వాహనం వే బిల్లులు లేకుండా ఎక్కడికి వెళ్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలా వెళ్లాయా? అనే విషయాలపై ఆరా తీయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రపోతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవంటూ కాలయాపన చేశారు. సోమవారం నిపుణులను పిలిపించి డీసీఎంలోని సిగరెట్ల విలువ ఎంతో నిర్ణయిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ చెక్‌పోస్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా సరిహద్దు దాటుతున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్‌పోస్టువద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు.