Neglected by the authorities
-
అధికారుల నిర్లక్ష్యంతోనే పేదలకు అందని భూమి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నర్సింహులపేట: అధికారుల నిర్లక్ష్యంతోనే నిరుపేద ఎస్సీలకు భూమి అందడం లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లిలో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణిలో అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతో జాప్యం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఎస్సీ కుటుంబాలను గుర్తించామని, 18 లక్షల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 10 వేల ఎకరాల భూమిని అమ్మడానికి రైతులు ముందుకు వచ్చారని, అరుుతే తదుపరి చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2013-14లో రూ.100 కోట్లు, 2014-15కు రూ.184 కోట్లను ఎస్సీల భూ పంపిణికి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వచ్చే నాలుగేళ్లలో అర్హులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టం చేశారు. -
గిట్టుబాటు కూలి ఇవ్వడమే లక్ష్యం
చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రోజురోజుకు చతికిలపడుతోంది. పనులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం, కూలీలకు గిట్టుబాటు ధర అందకపోవడమే అందుకు కారణాలని స్పష్టమవుతున్నారుు. జిల్లా అంతటా కరువు పరిస్థితులుండగా, ఏడు మండలాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆ మండలాల్లోనే ఉపాధి పనులు ఎక్కువగా కల్పించేందుకు ప్రభుత్వం ఉపక్రమిస్తుందనే భయూందోళన జిల్లాలోని రైతుకూలీల్లో కలుగుతోంది. ఈ క్రమంలో ఉపాధి పథకం పనులు జరుగుతున్న తీరుతెన్నులను గురించి డ్వామా పీడీ రాజశేఖరనాయుడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలివీ. జిల్లా అంతటా కరువు పరిస్థితులుండగా, ప్రభుత్వం 7 మండలాలను మాత్రమే వెనుకబడిన మండలాలుగా గుర్తించింది కదా ? జిల్లాలో వెనుకబడిన మండలాలను గుర్తించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ టీమ్ ఆయా మండల్లాలో తాగు, సాగు నీరు, వ్యవసాయం, కూలీలు, విద్యా విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సేకరించిన వివరాల మేరకు వెనుకబడిన మండలాలను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన మండలాల్లోనే 2015-16 సంవత్సరం ఉపాధి పనులు చేపట్టనున్నారా? ఉపాధి పనులు ప్రతి మండలంలో యథావిదిగా జరుగుతాయి. అయితే వెనుకబడిన మండలాల్లో మాత్రం ఇంటింటి సర్వే నిర్వహించి, సర్వే నివేదిక మేరకు వెనుకబడిన కుటుంబాల అబివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. వెనుకబడిన కుటుంబాలకు మాత్రం ఉపాధి పనుల్లో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఇతర ప్రభుత్వ పథకాలు కూడా ఆ కుటుంబాల అభ్యున్నతికి దోహదపడే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. జిల్లాలో 6.4 లక్షల మంది రైతు కూలీలు ఉండగా, 23,400 మందికి మాత్రమే వంద రోజుల పని దినాలను కల్పిస్తున్నారు కదా ? వంద రోజుల పనిదినాలను కల్పించడంలో వెనుకబడ్డానికి కూలీలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం. రోజుకు రూ.159 మేరకు గిట్టుబాటు కూలి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మన జిల్లాలో రోజుకు రూ. 116 వరకు మాత్రమే గిట్టుబాటు అవుతోంది. పక్క జిల్లాల్లో దాదాపు రూ.155 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. గిట్టుబాటు కూలి ఇవ్వడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కూలీలకు పేమెంట్ పెండింగ్‌లో ఉండడం కారణంగా, ఉపాధి పనులు కుంటుపడుతున్నాయూ ? కూలీలకు పేమెంట్ ఏమాత్రం పెండింగ్ లేదు. 98 శాతం మేరకు పేమెంట్ సకాలంలో అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. సామాజిక తనిఖీల్లో ఇప్పటివరకు గుర్తించిన అవినీతి సొమ్ము రికవరీలో జాప్యం జరుగుతోంది కదా? ఉపాధి హామీ పనుల్లో ఇప్పటివరకు రూ.7.06 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందులో రూ.2.61 కోట్ల మేరకు పరిశీలన చేయాల్సి ఉంది. రూ.1.54 కోట్ల మేరకు అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మిగిలిన సొమ్ములో ఇప్పటికి రూ.1.68 కోట్ల మేరకు రికవరీ చేపట్టాము. బాధ్యులైన 420 మంది ఉపాధి సిబ్బందిని తొలగించగా, 94 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటర్‌షెడ్ కమిటీల నియూమకంలో పారదర్శకత లేదు. అధికార పార్టీ నాయకులు సూచించిన వారిని మాత్రమే కమిటీల్లో నియమించారు. పనులను కూడా వారు సూచించిన మేరకే చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి కదా ? గ్రామ సర్పంచ్‌తో పాటు, రైతులతో కూడిన కమిటీలు వేస్తున్నాం. ఏ పార్టీ నాయకులు చెప్పినట్లు వేయడంలేదు. నీటి నిల్వకు అవసరమైన చోట్లలోనే నీటినిల్వ పనులు, చెరువుల పటిష్టతకు అవసరమైన ప్రదేశాల్లోనే పనులు చేపడుతున్నాం. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఇందుకు బాధ్యులైన వాటర్‌షెడ్స్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
రూ.4.73 కోట్లు
ఇదీ దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం ఖరీదు 2012-13 ఆడిట్లో వెలుగుచూసిన వాస్తవాలు దేవస్థాన ఆదాయంతో సమానంగా ఖర్చు విజయవాడ : రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అధికారులు నిర్లక్ష్యం ఖరీదు రూ.4,73,25,868గా ఆడిట్ అధికారులు నిర్ధారించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం రికార్డులను పరిశీలించిన అధికారులు 64 రకాల అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారి ఆదాయం మరో రూ.4.73 కోట్లు పెరిగి ఉండేదని తమ నివేదికలో పేర్కొన్నారు. దేవస్థానానికి వచ్చే ఆదాయం మొత్తం అధికారులు ఖర్చు చేసేస్తున్నారే తప్ప మిగిల్చేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదంటూ అందులో తెలిపారు. 2012-13లో దేవస్థానానికి రూ.78 కోట్లు ఆదాయంవస్తే ఇంచుమించుగా అంతే ఖర్చు చూపించడం గమనార్హం. నిదర్శనాలు ఇవిగో... ► జిల్లాలోని చిన్నచిన్న దేవాలయాలకు అమ్మవారి దేవస్థానం ప్రోనోట్లు రాయించుకుని అప్పుగా ఇస్తుంది. ఈ విధంగా కొన్నేళ్లుగా రూ.2.01 కోట్లు అప్పుగా ఇచ్చారు. వీటిని తిరిగి వసూలు చేయడంపై అధికారులు శ్రద్ధ చూపలేదు. ► నగరపాలక సంస్థకు రోడ్ల మరమ్మతుల నిమిత్తం రూ.50 లక్షల అమ్మవారి సొమ్ము ఇచ్చారు. మరమ్మతుల్లేవు. బకాయి చెల్లింపులూ లేవు. కనీసం కార్పొరేషన్‌కు కట్టే పన్నుల్లో నుంచైనా ఈ సొమ్మును మినహాయించేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించలేదు. ► దేవస్థానం లడ్డూ ప్రసాదాలను గతంలో ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించేది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును ఆంధ్రాబ్యాంకులోని దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. 2012 అక్టోబర్ ఒకటి నుంచి 31 మార్చి 2013 వరకు రూ.20,65,134 యూనియన్ సభ్యులు వాడేసుకున్నారు. అధికారులు అప్రమత్తమై దీన్ని రికవరీ చేశారు. ఈ డబ్బుకు సుమారు రూ.5 లక్షలు వరకు వడ్డీ వసూలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ►దేవస్థానం బస్సు కింద పడి ఒక పాపకు గాయం అయితే ఆమెకు అమ్మవారి సొమ్ము రూ.2,03,643 వెచ్చించి వైద్యం చేయించారు. ఈ సొమ్మును బీమా శాఖ నుంచి రికవరీ చేసుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నాలు జరగలేదు. ► ఘాట్ రోడ్డు, దుర్గాఘాట్‌లో ఉండే చిరు వ్యాపారుల నుంచి రూ.55,15,979 వసూలు చేశారు. వారికి రసీదులు కూడా ఇస్తున్నారు. ఈ సొమ్మును రికార్డుల్లో సరిగా నమోదు చేయడం లేదని ఆడిట్ అధికారులు గుర్తించారు. ► దేవస్థానానికి ఎస్బీఐ, ఆంధ్రా, సిండికేట్, ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్ బరోడాల్లో డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో అకౌంట్లను, దేవస్థానం క్యాష్ బుక్‌ను పరిశీలిస్తే సుమారు రూ.1,88,75,935 మేర తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ► దేవస్థానం పనులు చేసే కాంట్రాక్టర్ వద్ద ఇన్‌కం ట్యాక్స్, ఇసుక సీనరేజీలు, లేబర్ సెస్‌లు వసూలు చేసి ఆయా శాఖలకు చెల్లించాలి. ఈ విధంగా చెల్లించనందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ దేవస్థానం నుంచి రూ.66,069 జరిమానా వసూలు చేసింది. ►దేవస్థానానికి చెందిన చెప్పుల స్టాండ్, కొబ్బరి చిప్పలు, చీరలు, టోల్గేట్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుగా చె ల్లించిన ఈఎండీ డిపాజిట్‌ను కాంట్రాక్టు పూర్తయిన తరువాత ఇవ్వాలి. అధికారులు ఆఖరు వాయిదాకు ఈ సొమ్మును జమ చేసుకోవడం గమనార్హం. కాంట్రాక్టర్ల వద్ద లీజు సొమ్మును సకాలంలో వసూలు చేయకపోవడం వల్ల దేవస్థానం ఆదాయానికి గండి పడుతోంది. ► ఇవేగాక ఇంకా అనేక లోపాలను ఆడిట్ అధికారులు గుర్తించారు. కొత్తగా వచ్చే పాలకవర్గం, ఈవోలు వీటిపై దృష్టి పెట్టి లోపాలను సరిదిద్దాలని భక్తులు కోరుతున్నారు. -
నిఘా నిద్దరోతోంది!
- జహీరాబాద్ కమర్షియల్ టాక్స్ చెక్‌పోస్టు అధికారుల నిర్లక్ష్యం - వేబిల్లులు లేకుండానే రాష్ట్రంలో ప్రవేశిస్తున్న సరుకులు - సిగరెట్ల వ్యాన్ పట్టివేతతో తేటతెల్లం సంగారెడ్డి క్రైం: జిల్లా సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టు నిద్రపోతోంది. మామూళ్లపై శ్రద్ధ చూపుతున్న ఆ శాఖ అధికారులు అక్రమ రవాణాను నిలువరించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు ఎటువంటి వే బిల్లులు లేకుండానే లక్షల రూపాయల సరుకులను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సర్కార్ ఖజానాకు చేరాల్సిన సొమ్ములు పక్కదారి పడుతున్నాయి. జహీరాబాద్ పట్టణ శివారులో అధికారులు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అయితే నిఘా తీవ్రం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడింది ఆటా పాడింది పాటగా మారింది. చెక్‌పోస్టుపై సంబంధిత శాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద ఎటువంటి వే బిల్లులు లేకుండా సిగరెట్ల లోడ్లతో వెళ్తున్న డీసీఎం (ఏపీ 09టీ 0849)ను పట్టుకున్నారు. ఆ వ్యాన్‌లో మొత్తం 53 కాటన్లలో ఇండోనేషియా సిగరెట్లు ఉన్నాయి. ఈ వ్యాన్ ముంబాయ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని సంగారెడ్డిలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వే బిల్లులు లేకుండా తరలిస్తున్న ఈ వ్యాన్ సంగారెడ్డిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఆధీనంలో ఉంది. వాహనంలో ఉన్న సిగరెట్ల విలువ ఎంత ? ఈ వాహనం వే బిల్లులు లేకుండా ఎక్కడికి వెళ్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలా వెళ్లాయా? అనే విషయాలపై ఆరా తీయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రపోతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవంటూ కాలయాపన చేశారు. సోమవారం నిపుణులను పిలిపించి డీసీఎంలోని సిగరెట్ల విలువ ఎంతో నిర్ణయిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ చెక్‌పోస్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా సరిహద్దు దాటుతున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్‌పోస్టువద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. -
లేని భూమికి రుణం!
యాచారం: పట్టాలిచ్చి హద్దులు చూపని అధికారుల నిర్లక్ష్యం.. ఆ పట్టాలకు భూములున్నాయో లేవో తేల్చుకోకుండానే వాటిపై అప్పులిచ్చిన బ్యాంకు అధికారుల నిర్వాకం.. లేని భూములకు అప్పులు తెచ్చుకున్న రైతుల వ్యవహారం.. ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామనడం, ఎన్నికల హామీ మేరకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం వంటిని ఈ ఉదంతం బయటపడేందుకు ఉపకరిస్తున్నాయి. అప్పట్లో పట్టాలు తీసుకున్న మాకు హద్దులు చూపలేదని, మళ్లీ మాకు భూమి ఇవ్వాలని అప్పటి లబ్ధిదారులు ఇన్నాళ్ల తర్వాత ఆందోళన బాట పడుతున్నారు. ఇక ఇన్నేళ్లుగా అదే భూమిపై యేటా బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుంటున్న వీరు.. భూములు చూసి నిర్ధారించుకున్నాకే రుణమాఫీకి సిఫారస్ చేస్తామని అధికారులు అంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. భూ పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా మండలంలోని 20 గ్రామాల పరిధిలో వందలాది మంది రైతులకు రెండు ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూములను పంచింది. కానీ చాలా గ్రామాల్లో 90 శాతం మందికి పట్టాలు మాత్రమే ఇచ్చిన అధికారులు హద్దులను చూపలేదు. మండలంలోని నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మాల్ గ్రామాల్లోనే సుమారు 150 మందికిపైగా పట్టాలిచ్చిన అధికారులు భూములు స్వాధీనం చేయలేదు. అప్పట్లో భూములు చూపెట్టకున్నా రైతు అనిపించుకున్న లబ్ధిదారులు వాటిని ఏళ్ల నుంచి ఆయా బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలో రుణమాఫీ చేసినప్పుడు వీరిలో చాలా మందికి రుణం మాఫీ అయింది. కచ్చితమైన నిబంధనలు పెట్టకుండానే అప్పట్లో రుణాలు మాఫీ కావడంతో చాలా మంది లబ్ధిపొందారు. అయితే ఈసారి అర్హులను గుర్తించి, భూములు పరిశీలించే రుణమాఫీకి సిఫారస్ చేస్తామని అధికారులు చెబుతుండడంతో రుణాలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, వ్యవసాయాధికారి, ఆయా బ్యాంకు మేనేజర్లు కమిటీగా ఏర్పడి రుణమాఫీ వర్తించే వారిని నిర్ధారిస్తారని ప్రచారం జరుగుతోంది. గుట్టలకు కూడా పంట రుణాలు.. రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకు అధికారులు ఏ మాత్రం నిబంధనలు పాటించలేదు. రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ కార్యాలయం నుంచి వచ్చిన రికార్డులను చూసి, భూములను స్వయంగా పరిశీలించాలి. ఏఏ పంటలు సాగుచేస్తున్నారన్న విషయాన్ని నమోదు చేసుకున్న తర్వాతే రుణం మంజూరు చేయాలి. కానీ రుణాలిచ్చిన బ్యాంకులు ఇవేమీ చూసుకోకుండానే లక్షల రూపాయలు ఇచ్చేశాయి. మండలంలోని పలు గ్రామాల్లో కేవలం పట్టాలుపెట్టే రూ.50 లక్షల వరకు రుణాలు పొందినట్టు తెలుస్తోంది. మాల్లోని ఆంధ్రాబ్యాంకు, మండల కేంద్రంలోని పీఏసీఎస్, నక్కర్తమేడిపల్లిలోని ఇండియన్ బ్యాంకు, యాచారంలోని ఎస్బీహెచ్లలో వందలాదిమంది ఈ విధంగానే రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఇక కొన్ని గ్రామాల్లో కొంత మంది రైతులకు అధికారులు గుట్టలు, రాళ్లున్న స్థలాలను అంటగట్టారు. వాటిని కూడా బ్యాంకుల్లో పెట్టి లబ్ధిదారులు అప్పు తీసుకున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో బ్యాంకు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. నిబంధనలు పాటించకుండానే రుణాలిచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళితే చర్యలుంటాయని భయపడుతున్నారు. ఇదిలాఉంటే పలు గ్రామాల్లోని రైతులకు బోగస్ పట్టాలిప్పించి.. వాటిని బ్యాంకుల్లో పెట్టి బ్రోకర్లు రుణాలు కాజేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ విషయంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల వివరాలుతీస్తే భూముల్లేకుండా రుణాలు తీసుకున్న వారి వివరాలు బయటపడే అవకాశం ఉంది. మాకూ భూములివ్వాలి అప్పట్లో పట్టాలు తీసుకుని భూములు పొందని రైతులు ప్రస్తుతం తమకు కూడా ప్రభుత్వం మూడెకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో పట్టాలే ఇచ్చారని, దాని వల్ల ప్రయోజనమేమీలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నారు.