అధికారుల నిర్లక్ష్యంతోనే పేదలకు అందని భూమి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
నర్సింహులపేట: అధికారుల నిర్లక్ష్యంతోనే నిరుపేద ఎస్సీలకు భూమి అందడం లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లిలో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణిలో అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతో జాప్యం జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో 6 లక్షల ఎస్సీ కుటుంబాలను గుర్తించామని, 18 లక్షల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 10 వేల ఎకరాల భూమిని అమ్మడానికి రైతులు ముందుకు వచ్చారని, అరుుతే తదుపరి చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2013-14లో రూ.100 కోట్లు, 2014-15కు రూ.184 కోట్లను ఎస్సీల భూ పంపిణికి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వచ్చే నాలుగేళ్లలో అర్హులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టం చేశారు.