యాచారం: పట్టాలిచ్చి హద్దులు చూపని అధికారుల నిర్లక్ష్యం.. ఆ పట్టాలకు భూములున్నాయో లేవో తేల్చుకోకుండానే వాటిపై అప్పులిచ్చిన బ్యాంకు అధికారుల నిర్వాకం.. లేని భూములకు అప్పులు తెచ్చుకున్న రైతుల వ్యవహారం.. ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామనడం, ఎన్నికల హామీ మేరకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం వంటిని ఈ ఉదంతం బయటపడేందుకు ఉపకరిస్తున్నాయి.
అప్పట్లో పట్టాలు తీసుకున్న మాకు హద్దులు చూపలేదని, మళ్లీ మాకు భూమి ఇవ్వాలని అప్పటి లబ్ధిదారులు ఇన్నాళ్ల తర్వాత ఆందోళన బాట పడుతున్నారు. ఇక ఇన్నేళ్లుగా అదే భూమిపై యేటా బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుంటున్న వీరు.. భూములు చూసి నిర్ధారించుకున్నాకే రుణమాఫీకి సిఫారస్ చేస్తామని అధికారులు అంటుండడంతో ఆందోళన చెందుతున్నారు. భూ పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా మండలంలోని 20 గ్రామాల పరిధిలో వందలాది మంది రైతులకు రెండు ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూములను పంచింది. కానీ చాలా గ్రామాల్లో 90 శాతం మందికి పట్టాలు మాత్రమే ఇచ్చిన అధికారులు హద్దులను చూపలేదు.
మండలంలోని నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మాల్ గ్రామాల్లోనే సుమారు 150 మందికిపైగా పట్టాలిచ్చిన అధికారులు భూములు స్వాధీనం చేయలేదు. అప్పట్లో భూములు చూపెట్టకున్నా రైతు అనిపించుకున్న లబ్ధిదారులు వాటిని ఏళ్ల నుంచి ఆయా బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలో రుణమాఫీ చేసినప్పుడు వీరిలో చాలా మందికి రుణం మాఫీ అయింది. కచ్చితమైన నిబంధనలు పెట్టకుండానే అప్పట్లో రుణాలు మాఫీ కావడంతో చాలా మంది లబ్ధిపొందారు. అయితే ఈసారి అర్హులను గుర్తించి, భూములు పరిశీలించే రుణమాఫీకి సిఫారస్ చేస్తామని అధికారులు చెబుతుండడంతో రుణాలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, వ్యవసాయాధికారి, ఆయా బ్యాంకు మేనేజర్లు కమిటీగా ఏర్పడి రుణమాఫీ వర్తించే వారిని నిర్ధారిస్తారని ప్రచారం జరుగుతోంది.
గుట్టలకు కూడా పంట రుణాలు..
రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకు అధికారులు ఏ మాత్రం నిబంధనలు పాటించలేదు. రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ కార్యాలయం నుంచి వచ్చిన రికార్డులను చూసి, భూములను స్వయంగా పరిశీలించాలి. ఏఏ పంటలు సాగుచేస్తున్నారన్న విషయాన్ని నమోదు చేసుకున్న తర్వాతే రుణం మంజూరు చేయాలి. కానీ రుణాలిచ్చిన బ్యాంకులు ఇవేమీ చూసుకోకుండానే లక్షల రూపాయలు ఇచ్చేశాయి. మండలంలోని పలు గ్రామాల్లో కేవలం పట్టాలుపెట్టే రూ.50 లక్షల వరకు రుణాలు పొందినట్టు తెలుస్తోంది.
మాల్‌లోని ఆంధ్రాబ్యాంకు, మండల కేంద్రంలోని పీఏసీఎస్, నక్కర్తమేడిపల్లిలోని ఇండియన్ బ్యాంకు, యాచారంలోని ఎస్‌బీహెచ్‌లలో వందలాదిమంది ఈ విధంగానే రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ఇక కొన్ని గ్రామాల్లో కొంత మంది రైతులకు అధికారులు గుట్టలు, రాళ్లున్న స్థలాలను అంటగట్టారు. వాటిని కూడా బ్యాంకుల్లో పెట్టి లబ్ధిదారులు అప్పు తీసుకున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో బ్యాంకు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది.
నిబంధనలు పాటించకుండానే రుణాలిచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళితే చర్యలుంటాయని భయపడుతున్నారు. ఇదిలాఉంటే పలు గ్రామాల్లోని రైతులకు బోగస్ పట్టాలిప్పించి.. వాటిని బ్యాంకుల్లో పెట్టి బ్రోకర్లు రుణాలు కాజేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ విషయంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల వివరాలుతీస్తే భూముల్లేకుండా రుణాలు తీసుకున్న వారి వివరాలు బయటపడే అవకాశం ఉంది.
మాకూ భూములివ్వాలి
అప్పట్లో పట్టాలు తీసుకుని భూములు పొందని రైతులు ప్రస్తుతం తమకు కూడా ప్రభుత్వం మూడెకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో పట్టాలే ఇచ్చారని, దాని వల్ల ప్రయోజనమేమీలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నారు.
లేని భూమికి రుణం!
Published Fri, Aug 15 2014 11:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement