యాచారం: రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడానికి యాచారం పీఏసీఎస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి ఏ బ్యాంకులో రుణం పొందని రైతులకు రుణాలు ఇచ్చేందుకు పీఏసీఎస్ పాలకవర్గం కృషిచేస్తుంది. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా రైతులకు పీఏసీఎస్ సేవలు అందేలా చూస్తున్నారు. యాచారం పీఏసీఎస్‌లో దాదాపు 7 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో 4,985 మంది రైతులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక, వ్యవసాయ తదితర పద్దుల కింద రూ.40 కోట్లకు పైగా రుణాలు పొందారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రుణాల కోసం 200 మందికి పైగా అర్జీలు పెట్టుకున్నారు.
గ్రామాల్లో ముమ్మర ప్రచారం..
ఈ ఏడాది యాచారం పీఏసీఎస్‌లో రూ.2 కోట్లకు పైగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు సంఘం నిర్ణయించింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతును పీఏసీఎస్‌లో భాగాస్వామ్యం(రుణాలు కల్పించి సభ్యత్వం ఇవ్వడం) చేసే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా గ్రామాల్లో పీఏసీఎస్ డైరెక్టర్ల ద్వారా రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అప్పు పరిమితి పట్టిక(క్రెడిట్ లిమిట్) తయారు చేసి డీసీసీబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ నుంచి యాచారం పీఏసీఎస్‌కు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.1.50 కోట్ల నిధుల మంజూరుకు పీఏసీఎస్ అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు.
వ్యవసాయ పంట రుణాలు ఇలా..(ఎకరాకు)
- వరి, పత్తి తదితర మెట్ట పంటలకు రూ.30 వేలు
- కూరగాయల పంటలకు రూ.38 వేలు
ప్రతి రైతుకు రుణం ఇస్తాం
మండలంలోని 24 గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు అర్జీలు స్వీకరిస్తున్నాం. ప్రతి రైతుకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
– తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, యాచారం
Comments
Please login to add a commentAdd a comment