నాడు...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పాలనా పగ్గాలు చేపట్టగానే ఎటువంటి నిబంధనలు లేకుండా బ్యాంకులు తీసుకున్న రుణాలన్నీ, మెట్ట రైతులకు విద్యుత్ బకాయిలతో సహా ఒక్క సంతకంతో మాఫీ చేశారు. రాష్ట్రంలోని అందరి రైతుల్లానే సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అప్పుల ఊబి నుంచి బయటపడి అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు.
నేడు...
ఎన్నికల వేళ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీలు గుప్పించి అందలమెక్కిన చంద్రబాబు..రుణ మాఫీ చేస్తామంటూనే రోజుకో నిబంధనతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆధార్‌కార్టు, రేషన్‌కార్డు, సర్వేనంబర్ల ఆన్‌లైన్, పట్టాదారు పుస్తకాల ఆన్‌లైన్ అంటూ ఆంక్షల వలయంలో రైతన్నను బంధించి రుణమాఫీకి దూరం చేశారు. ఫలితంగా కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలో 2,900 మంది రైతులు రూ.23 కోట్ల రుణమాఫీ కోల్పోయారు.
సంతమాగులూరు: రోజుకో కొత్త నిబంధనతో సాధ్యమైనంత ఎక్కువ మందిని రుణమాఫీకి దూరం చేయాలన్న సర్కారు పన్నాగానికి వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని అగ్రహారం భూములు సాగు చేసుకుంటున్న రైతులే దీనికి నిదర్శనం.
రైతుల సాగుభూములు వారిపేర్లతో ఆన్‌లైన్ చేయని కారణంతో ఆ రెవెన్యూ పరిధిలోని కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం, సజ్జాపురం, బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామాలకు చెందిన 2,900 మంది రైతులు రూ.23 కోట్ల మేర రుణమాఫీ సదుపాయాన్ని కోల్పోతున్నారు. రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేసి బ్యాంకులు పంట రుణాలు అందజేసిన అందరికీ మాఫీ వర్తింపజేయాలని రైతు సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
కొమ్మాలపాడు కథ ఇదీ...
స్వాతంత్య్రానికి పూర్వం కొమ్మాలపాడు గుంటూరు జిల్లా పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతం జాగర్లమూడి కుప్పుస్వామి జమీందారిలో సర్వే నంబరు 1 నుంచి 230 వరకు 4,874 ఎకరాలు ఉండేది. స్వాతంత్య్రానంతరం జమీన్‌దారులకు ఏటా కప్పం కడుతూ సాగు చేసుకుంటున్న భూములు రైతుల ఆధీనమయ్యాయి.
అయితే భూములు సాగు చేసుకుంటున్న వారి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. 1972లో ప్రకాశం జిల్లా ఆవిర్భావంతో సంతమాగులూరు సమితి ప్రాంతం గుంటూరు జిల్లా నుంచి విడిపోయి ప్రకాశంలోకి వచ్చింది. మండలాల ఏర్పాటుకు పూర్వమే కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని భూముల్లో సాగులో ఉన్న రైతులు తమ భూములు రీ సర్వే జరిపి యాజమాన్య హక్కులు కల్పించాలని అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు.
అయినా ఫలితం శూన్యం. అయితే రైతువారీగా పంటల వివరాలను, అడంగల్‌లో అనుభవదారులైన రైతుల పేర్లు ఏటా నమోదు చేస్తున్నారు. బ్యాంకులు కూడా రెవెన్యూ అధికారులు జారీ చేసే అడంగల్ ఆధారంగా ఆయా రైతులకు పంటరుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన రుణమాఫీలో కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణాలు పూర్తిగా మాఫీ అయి రుణవిముక్తులయ్యారు.
తాజాగా రుణమాఫీకి అర్థ రహితమైన నిబంధనలు పెట్టడంతో వీరంతా రుణమాఫీ జాబితాలోకి రావడం లేదు. ఈ భూములన్నీ అగ్రహారం భూములని రెవెన్యూ రికార్డుల్లో ఉండటం, రైతు ఖాతాలు ప్రారంభించకపోవడం, ఖాతాలు లేనిదే కంప్యూటర్ అడంగల్ నమోదు కాకపోవడం, అడంగల్‌కు ఆధార్‌కు రుణమాఫీకి లింకు పెట్టడంతో వీరంతా రుణమాఫీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.
ఈ విషయమై ఇటీవల జరిగిన సంతమాగులూరు మండల పరిషత్ సమావేశంలో సభ్యులు తమ ఆవేదనను వ్యక్తపరచారు. తక్షణమే నిబంధనలు సడలించి కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రుణ మాఫీ.. కుచ్చుటోపీ
Published Sun, Nov 9 2014 1:59 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement