గిట్టుబాటు కూలి ఇవ్వడమే లక్ష్యం
చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రోజురోజుకు చతికిలపడుతోంది. పనులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం, కూలీలకు గిట్టుబాటు ధర అందకపోవడమే అందుకు కారణాలని స్పష్టమవుతున్నారుు. జిల్లా అంతటా కరువు పరిస్థితులుండగా, ఏడు మండలాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆ మండలాల్లోనే ఉపాధి పనులు ఎక్కువగా కల్పించేందుకు ప్రభుత్వం ఉపక్రమిస్తుందనే భయూందోళన జిల్లాలోని రైతుకూలీల్లో కలుగుతోంది. ఈ క్రమంలో ఉపాధి పథకం పనులు జరుగుతున్న తీరుతెన్నులను గురించి డ్వామా పీడీ రాజశేఖరనాయుడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలివీ.
జిల్లా అంతటా కరువు పరిస్థితులుండగా, ప్రభుత్వం 7 మండలాలను మాత్రమే వెనుకబడిన మండలాలుగా గుర్తించింది కదా ?
జిల్లాలో వెనుకబడిన మండలాలను గుర్తించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ టీమ్ ఆయా మండల్లాలో తాగు, సాగు నీరు, వ్యవసాయం, కూలీలు, విద్యా విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సేకరించిన వివరాల మేరకు వెనుకబడిన మండలాలను ప్రకటించింది.
ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన మండలాల్లోనే 2015-16 సంవత్సరం ఉపాధి పనులు చేపట్టనున్నారా?
ఉపాధి పనులు ప్రతి మండలంలో యథావిదిగా జరుగుతాయి. అయితే వెనుకబడిన మండలాల్లో మాత్రం ఇంటింటి సర్వే నిర్వహించి, సర్వే నివేదిక మేరకు వెనుకబడిన కుటుంబాల అబివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. వెనుకబడిన కుటుంబాలకు మాత్రం ఉపాధి పనుల్లో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఇతర ప్రభుత్వ పథకాలు కూడా ఆ కుటుంబాల అభ్యున్నతికి దోహదపడే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.
జిల్లాలో 6.4 లక్షల మంది రైతు కూలీలు ఉండగా, 23,400 మందికి మాత్రమే వంద రోజుల పని దినాలను కల్పిస్తున్నారు కదా ?
వంద రోజుల పనిదినాలను కల్పించడంలో వెనుకబడ్డానికి కూలీలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం. రోజుకు రూ.159 మేరకు గిట్టుబాటు కూలి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మన జిల్లాలో రోజుకు రూ. 116 వరకు మాత్రమే గిట్టుబాటు అవుతోంది. పక్క జిల్లాల్లో దాదాపు రూ.155 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. గిట్టుబాటు కూలి ఇవ్వడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
కూలీలకు పేమెంట్ పెండింగ్‌లో ఉండడం కారణంగా, ఉపాధి పనులు కుంటుపడుతున్నాయూ ?
కూలీలకు పేమెంట్ ఏమాత్రం పెండింగ్ లేదు. 98 శాతం మేరకు పేమెంట్ సకాలంలో అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం.
సామాజిక తనిఖీల్లో ఇప్పటివరకు గుర్తించిన అవినీతి సొమ్ము రికవరీలో జాప్యం జరుగుతోంది కదా?
ఉపాధి హామీ పనుల్లో ఇప్పటివరకు రూ.7.06 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందులో రూ.2.61 కోట్ల మేరకు పరిశీలన చేయాల్సి ఉంది. రూ.1.54 కోట్ల మేరకు అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మిగిలిన సొమ్ములో ఇప్పటికి రూ.1.68 కోట్ల మేరకు రికవరీ చేపట్టాము. బాధ్యులైన 420 మంది ఉపాధి సిబ్బందిని తొలగించగా, 94 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
వాటర్‌షెడ్ కమిటీల నియూమకంలో పారదర్శకత లేదు. అధికార పార్టీ నాయకులు సూచించిన వారిని మాత్రమే కమిటీల్లో నియమించారు. పనులను కూడా వారు సూచించిన మేరకే చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి కదా ?
గ్రామ సర్పంచ్‌తో పాటు, రైతులతో కూడిన కమిటీలు వేస్తున్నాం. ఏ పార్టీ నాయకులు చెప్పినట్లు వేయడంలేదు. నీటి నిల్వకు అవసరమైన చోట్లలోనే నీటినిల్వ పనులు, చెరువుల పటిష్టతకు అవసరమైన ప్రదేశాల్లోనే పనులు చేపడుతున్నాం. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఇందుకు బాధ్యులైన వాటర్‌షెడ్స్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం.