స్వేదం.. నిర్వేదం
మండుటెండలో చెమట చిందించినా.. సంజెవేళ పచ్చడి మెతుకులు కరువు. పేరు పేదలదే అయినా.. దళారుల ఇష్టారాజ్యం. కేటాయింపులు కాగితాల్లో కోట్లు దాటినా.. బడుగు జీవి చేతికందేది చిల్లర పైసలే. మూలిగేనక్కపై తాటికాయ పడినట్లు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన మండలాల పేరిట ‘ఉపాధి’ని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయజూస్తోంది. ఇదీ ఉపాధి పనుల తీరు.
వరుస కరువు.. కలిసిరాని ప్రకృతి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కన్నతల్లి లాంటి ఊరును విడవలేక.. ఉన్నచోట చేయి చాచలేక.. కూలీలు పొట్టచేత పట్టుకుని పట్నాల్లో పిడికెడు ముద్ద దొరక్కపోతుందా అనే ఆశతో మూటాముల్లె సర్దుకుంటున్నారు. మెతుకు వేటలో బక్కజీవి ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది.
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలసలను నిలువరించలేకపోతోంది. కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నా.. పర్యవేక్షిస్తున్న సిబ్బంది, దళారుల బొజ్జలు నింపుతోంది. ఎటొచ్చి కూలీల కడుపు మాడుతోంది. జిల్లాలో యేటా అతివృష్టి, అనావృష్టితో కరువు కరాళనృత్యం చేస్తోంది. వ్యవసాయ కూలీలతో పాటు చిన్న, సన్నకారు రైతులూ సుదూర ప్రాంతాలకు బతుకుదెరువుకు వలసబాట పడుతున్నారు. ఈనేపథ్యంలో స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు.. తద్వారా గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2007-08లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
పథకంతో మేట్ నుంచి అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులు లబ్ధి పొందినా వ్యవసాయ కూలీలకు చిలిగవ్వ అందకపోయింది. ఉదయం 7 నుంచి 1 గంట వరకు నడుం వంచినా అందుతున్న కూలి అత్తెసరే. ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి జాడ కూడా కరువైంది. ఇప్పటికీ గ్రామాలకు సరైన రోడ్లు లేవు.. వ్యవసాయ భూముల్లో బావులు కనిపించవు.. భూగర్భ జలాలు అభివృద్ధి చెందిన దాఖలాల్లేవు.. అయితే కోట్లాది రూపాయలు మాత్రం ఖర్చయిపోయాయి.
ఒక రోజుల్లో దాదాపు 8 గంటలు పనిచేస్తే రూ.100 కూలి లభించక కూలీలు గగ్గోలు పెడుతున్నారు. మేటల్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీఓలతో పాటు దళారీలకు మాత్రం కాసుల పంట పండుతోంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నుంచి సిఫారసు లెటర్లు తీసుకొస్తుండటం వీరి ఆదాయాన్ని తెలియజేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల భర్తీలో ఆ పార్టీ నేతల ఒత్తిళ్లు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడం.. వ్యవసాయ పనులు ముగుస్తుండటంతో పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, డోన్, ఎమ్మిగనూరు, పాణ్యం నియోజకవర్గాల నుంచి వలసలు ఊపందుకున్నాయి. 2014-15లో ఇప్పటి వరకు రూ.103.85 కోట్లు ఖర్చు చేయగా.. అధికారిక లెక్కల ప్రకారం 2.05 లక్షల కుటుంబాలకు చెందిన 3.70 లక్షల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1.37 లక్షల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా.. 67 లక్షలకు మించకపోవడం గమనార్హం.
పనులకు వెళ్లినా కూలి గిట్టుబాటు కాకపోవడంతో వ్యవసాయ కూలీలు ఊరిడుస్తుండటంతో లక్ష్యం పూర్తిగా వెనుకబడుతోంది. గరిష్ట కూలి రూ.169 కాగా.. ఉయ్యాలవాడ మండలంలో సగటున రూ.98.35.. దొర్నిపాడు మండలంలో రూ.93.31.. చాగలమర్రి మండలంలో రూ.81.53.. మిడుతూరు మండలంలో రూ.93.63.. నందవరం మండలంలో రూ.86.04.. వెల్దుర్తి మండలంలో రూ.92.98, హాలహర్వి మండలంలో రూ.98.18, కోసిగి మండలంలో రూ.91.03, కౌతాళం మండలంలో రూ.91.86, పెద్దకడుబూరు మండలంలో రూ.91.15 ప్రకారం అందుతోంది.
జిల్లా మొత్తం మీద సగటున కూలీలకు అందుతున్న మొత్తం రూ.107.92 కావడం గమనార్హం. మేట్‌లకు, పీల్డ్ అసిస్టెంట్లకు వారపు మామూళ్లు ఇచ్చుకుంటే పని చేయకపోయినా రూ.130 నుంచి రూ.150 కూలి లభిస్తోంది. దారుణమైన విషయమేమంటే.. రోజుకు 8 గంటల పాటు పనిచేసినా రూ.30 నుంచి రూ.50 కూలి అందుకుంటున్న కూలీలు జిల్లాలో వేలల్లో ఉండటం ఉపాధి తీరుకు అద్దం పడుతోంది.
మృత్యుబాట
ఆస్పరికి చెందిన కొళ్లు వెంకటరాముడు(52), మరో 20 కుటుంబాలు ఈనెల 20న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో తాటిపల్లికి వలస వెళ్లారు. మరుసటి రోజు శుక్రవారం పత్తి కోత పనులకు వెళ్లగా ఎండకు తాళలేక వెంకటరాముడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందడంతో వలస కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వలస బాట పట్టిన ఇలాంటి జీవితాలెన్నో అర్ధాంతరంగా రాలిపోతున్నాయి.