‘కరువు’లో మరో 50 పనిదినాలు | Cabinet Clears 50 Extra Days' Work Under MGNREGA | Sakshi
Sakshi News home page

‘కరువు’లో మరో 50 పనిదినాలు

Published Thu, Sep 17 2015 12:38 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘కరువు’లో మరో 50 పనిదినాలు - Sakshi

‘కరువు’లో మరో 50 పనిదినాలు

ఉపాధి హామీ కార్మికులకు కేంద్రం వరం
న్యూఢిల్లీ: దేశంలోని కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం ఉన్న 100 రోజులకు తోడు మరో 50 పనిదినాలు అదనంగా కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలు 15 శాతాన్ని మించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30 జిల్లాలకు గానూ 27 జిల్లాలు కరువుబారిన పడినట్లు కర్ణాటక ఇప్పటికే ప్రకటించింది.

ఈ నిర్ణయంతో కరువుతో కష్టాలు పడుతున్న గ్రామీణ పేదలు లబ్ధి పొందుతారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ దీంతో పాటు పలు ఇతర విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు..
     
రూ.5,142.08 కోట్లతో శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్(ఎస్పీఎంఆర్‌ఎం)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతరాలను తగ్గించే లక్ష్యంతో 2020 నాటికి దేశవ్యాప్తంగా 300 గ్రామ సముదాయాల(రూరల్ క్లస్టర్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మైదాన, తీర గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న సమీప గ్రామాలను.. ఏడారి, పర్వత, గిరిజన ప్రాంతాల్లో మొత్తం 5,000 నుంచి 15 వేల జనాభా ఉన్న సమీప గ్రామాలను రూరల్ క్లస్టర్స్‌గా ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడ్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఎస్పీఎంఆర్‌ఎంను ఏర్పాటు చేశారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పుర(ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్) స్థానంలో ఎన్డీయే ప్రభుత్వం ఈ మిషన్‌ను తీసుకువచ్చింది. యూపీఏ ప్రభుత్వ ‘పుర’కు.. బీజేపీ మాతృసంస్థ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ఆరెస్సెస్ వ్యవస్థాపక సభ్యుడు అయిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టిన తాజా పథకానికి తేడా ఏంటన్న మీడియా ప్రశ్నకు.. యూపీఏ ప్రభుత్వ పథకం పూర్తిగా ప్రైవేటు రంగానికే పరిమితమైందని, దానిలో ప్రభుత్వ భాగస్వామ్యం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌధరి బీరేందర్ సింగ్ సమాధానమిచ్చారు. ఆ లోటును తమ తాజా పథకం పూడుస్తుందన్నారు.
     
విజయవాడ(ఆంధ్రప్రదేశ్), కురుక్షేత్ర(హరియాణా), భోపాల్(మధ్యప్రదేశ్), జోరాట్(అస్సాం)ల్లో నెలకొల్పనున్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)’ సంస్థల్లో ఒక్కో సంస్థలో ఒక్కొక్కరి చొప్పున నలుగురు డెరైక్టర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
     
నాగా తిరుగుబాటు సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్(కే)పై ఐదేళ్ల నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ జూన్‌లో మణిపూర్‌లో దాడి చేసి 18 మంది సైనికుల ప్రాణాలు తీయడంతో పాటు భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎన్‌ఎస్‌సీఎన్(కే) తరచుగా ఉల్లంఘిస్తోంది. మరో తిరుగుబాటు సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం)తో కేంద్రం ఇటీవల శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement