అన్ని మండలాల్లో కరువు: ఉత్తమ్
ఉపాధిలో పరిమితులను ఎత్తేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 443 గ్రామీణ మండలాల్లో కరువు తీవ్రత ఉందని, ఉపాధి హామీ పథకం లో వంద రోజుల పని దినాల పరిమితిని తొలగించాలనిపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల వరకు వ్యవసాయ కూలీలు ఉన్నారని, వీరంతా గ్రామాల్లో పనిలేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని తెలిపారు. గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీటికే కాకుండా మూగజీవాల తాగునీటికీ ఇబ్బందులు వస్తున్నాయని ఉత్తమ్ వివరించారు. ఉపాధి కూలీలకు దినసరి కూలిని రూ.124 నుంచి రూ.200కు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 443 గ్రామీణ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 8,517 గ్రామ పంచాయతీల్లో యుద్ధప్రాతిపదికన తాగునీటి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు.