కరువును ఎదుర్కొంటాం
- శాసనసభలో సీఎం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్న విషయం వాస్తవమేనని, దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభకు తెలిపారు. రాష్ట్రాన్ని కరువులేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కరువుపై 344 నిబంధన కింద శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ‘‘ఈ ఏడాది సగటున రాష్ట్రంలో కనీస వర్షపాతం కంటే 36.3 శాతం తక్కువ వర్షం కురిసింది.
ఉత్తర కోస్తాలో 25 శాతం, రాయలసీమలో 40 శాతం, దక్షిణ కోస్తాలో 63 శాతం వర్షపాత లోటు ఉంది. అనంతపురం జిల్లాలో 5 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట దెబ్బతింది. ఇంత కరువు ఉన్నా వ్యవసాయంలో 5.9 శాతం వృద్ధి సాధించాం. రాష్ట్రంలో 10,196 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. 2,278 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. వేసవిలో తాగునీటి సరఫరా కోసం తాత్కాలిక చర్యలన్నీ తీసుకున్నాం’’ అని సీఎం తెలిపారు.
ఉపాధి హామీ పనిదినాలు పెంపు..
కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 238 మండలాల్లో కూలీలకు ఉపాధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిదినాలను వంద నుంచి 150 పెంచామని సీఎం తెలిపారు.
తాగునీటికి నిధులు: చినరాజప్ప
తాగునీటి సమస్యను అధిగమించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నిధులు విడుదల చేశామని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి చినరాజప్ప ప్రకటించారు. జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యమే రాయలసీమను ఎడారిగా మార్చిందని అన్నారు.
రాయలసీమను ఆదుకోవాలి: విష్ణుకుమార్‌రాజు
దుర్భరమైన కరువువల్ల తాగునీటికి, తిండికి అలమటిస్తున్న రాయలసీమను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఉత్తరాంధ్రలో వంద అడుగుల నీరు పడుతుందని, రాయలసీమలో 1,200-1,500 అడుగులు లోతుకు బోర్లు వేసినా నీరు పడని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు.