'ధైర్యముంటే రాజీనామా చేయించి గెలిపించుకో'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజాదరణే ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు వెళ్లడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబుకు ధైర్యముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి గెలిపించుకోవాలన్నారు.
సీఎంఎస్ సర్వే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే కుటుంబసభ్యుల సర్వేని అంబటి ఎద్దేవా చేశారు. సీఎంకు ప్రత్యామ్నాయమే లేదని ఈ సర్వే ద్వారా చెప్పించారని...ఇలా చెప్పించుకోవడం చంద్రబాబుకు కొత్తమే కాదని ఆయన దుయ్యబట్టారు. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబుదే అధికారమని సీఎంఎస్ రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. దీన్ని బట్టి ఈ సర్వే విశ్వసనీయత ఏంటో అర్థం చేసుకోవచ్చునని అంబటి రాంబాబు చెప్పారు.
ఈ నెల 19న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్లో అన్ని జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, రైతాంగ సమస్యలు, తాగునీటి ఎద్దడి సహా ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఆ సమావేశం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అంబటి చెప్పారు.