కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ఐదేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రుణ మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. వచ్చే నెల 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలి సంతకం రుణ మాఫీపైనే చేస్తానని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అంశంపైనే కేంద్రీకృతమైంది. ఖరీఫ్ సమయం ముంచుకొస్తుండటంతో రుణాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హామీ నేపథ్యంలో 2013 ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను చెల్లించేందుకు రైతులు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది.
ఇదే సమయంలో బ్యాంకులు పంట రుణాల ఊసెత్తకపోవడం గందరగోళానికి తావిస్తోంది. పాత రుణాలు చెల్లించనిదే బ్యాంకులు తిరిగి రుణాలిచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే పెట్టుబడి సమస్య రైతులను ముప్పుతిప్పలు పెట్టనుంది. అయితే జిల్లాలో రుణమాఫీపై బ్యాంకర్లు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. పంట రుణాలు.. వ్యవసాయ టర్మ్ రుణాలు.. వ్యవసాయానికి బంగారంపై రుణాలు తీసుకున్న అకౌంట్ల వివరాలు, ఎన్ని కోట్లు మాఫీ అయ్యేందుకు అవకాశం ఉందనే విషయమై సిండికేట్ బ్యాంకు అధికారులు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్‌కు నివేదించారు.
ఆ మేరకు జిల్లాలో 6,12,320 అకౌంట్లకు సంబంధించి రూ.4344.13 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో జిల్లాకు సంబంధించి దాదాపు రూ.5 వేల కోట్లు మాఫీ కాగా.. 5.50 లక్షల మంది రైతులు రుణ విముక్తులయ్యారు. రుణ మాఫీ వర్తించని రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల ప్రకారం ప్రోత్సాహకం పంపిణీ చేశారు. తాజాగా ఆరేళ్ల తర్వాత చంద్రబాబు అదే రుణమాఫీ హామీతో ఎన్నికల్లో లబ్ధి పొందారు. అయితే హామీపై సందిగ్ధం నెలకొనడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
రైతన్న ఆశలన్నీ రుణ మాఫీపైనే!
Published Fri, May 30 2014 1:20 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement