కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలంటూ జిల్లాలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రైతులు, మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. పలు చోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహం చేశారు.
రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని రైతులు, మహిళలతో శ్రేణులు కదంతొక్కాయి. రైతుల అన్ని రకాల వ్యవసాయ రుణాలు, మహిళలకు డ్వాక్రా రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హమీ ఇచ్చారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత పూటకోరకంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కేందుకు యత్నించారని ఆరోపించారు.
కమిటీ పేరుతో కాలయాపన చేసి చివరకు తూతూ మంత్రంగా కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు, డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వరకు మాత్రమే రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. సర్కార్ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. రైతుల వ్యవసాయ రుణాలు, మహిళల డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసేంత వరకు వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని తెలిపారు.
కల్లూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్రకళాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణ మాఫీ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామన్నారు.
హోళగుంద, దేవనకొండ, చిప్పగిరి, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
డోన్ మండలం వెంకటాపురం, బొంతిరాళ్ల, యు.కొత్తపల్లి, మల్లంపల్లి, లక్షుంపల్లి, సీసంగుండం, అబ్బిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో సైతం నిరసనలు పెల్లుబికాయి.
ఆళ్లగడ్డలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీ నాయకుడు బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో సంత మార్కెట్ దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, నాగేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఓర్వకల్లు బస్టాండ్ దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రుణమాఫీపై మాట తప్పిన చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్ర, శనివారాల్లోనూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి.
నిరసన జ్వాల
Published Fri, Jul 25 2014 3:12 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement