సాక్షి, కర్నూలు : ‘నేను మారాను.. నమ్మండి’ అంటూ పదేపదే ప్రజల ఎదుట మొరపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలోకి రాగానే తన చర్యల ద్వారా ఊసరవెళ్లి అని నిరూపించుకుంటున్నారు. ‘అధికారంలోకొస్తే రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తా’ అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీల వర్షం గుప్పించారు. అధికారం చేపట్టిన తర్వాత రుణాల మాఫీపై కాలయాపన చేసిన బాబు తాజాగా ఒక కుటుంబానికి రూ. లక్షన్నర మాత్రమే రుణమాఫీ అంటూ.. డ్వాక్రా సంఘానికి రూ. లక్షలోపు మాత్రమే రుణం మాఫీ అంటూ మెలిక పెట్టారు. ఆ మాఫీని కూడా ఎప్పుడు వర్తింపజేస్తారన్నది స్పష్టంగా ప్రకటించలేదు. ఇచ్చిన మాటను తప్పిన చంద్రబాబుపై కర్షక, మహిళా లోకం మండిపడుతోంది.
రైతు, డ్వాక్రా మహిళా రుణాల మాఫీ అమలు తూతూమంత్రమేనని తేలిపోయింది. రుణ మాఫీపై పదేపదే ఎన్నికల హామీలు గుప్పించిన చంద్రబాబు చివరకు మాట తప్పారు. అటు అన్నదాతలను ఇటు డ్వాక్రా మహిళలను నిట్టనిలువునా ముంచారు. పోనీ.. చంద్రబాబు ప్రకటించిన మేరకైనా రుణాలను మాఫీ చేస్తారా అంటే అదీ లేదు. అందుకూ ఓ మెలిక పెట్టారు. రుణ మాఫీకి అయ్యే నిధుల సమీకరణ కోసం మరో కమిటీని వేస్తానని ప్రకటించారు. ఆ నిధులు సమీకరించేదెన్నడు.. రుణ మాఫీ చేసెదెన్నడూ అన్న అంశంపై స్పష్టత లేదు.
పంట రుణాలపై పిల్లిమొగ్గలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు శఠగోపం పెట్టారు. ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నింటినీ రద్దు చేస్తామని నమ్మబలికిన బాబు ముఖ్యమంత్రి కాగానే రైతు రుణ మాఫీపై పిల్లిమొగ్గలు వేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మొసలి కన్నీళ్లు కార్చారు. చివరికి ఒక్కో కుటుంబానికి ఒక రైతుకు రూ. 1.50 లక్షల రుణ మాఫీ మాత్రమే అంటూ మాయమాటలతో అందరికీ కన్నీళ్లు మిగిల్చారు. జిల్లాలో 2014 మార్చి 31 నాటికి 6,21,676 మంది చిన్న, సన్నకారు, మధ్య, పెద్ద రైతులకు బ్యాంకర్లు వ్యవసాయ రుణాలు ఇచ్చారు.
పంట రుణాల కింద 4,02,952 మంది రైతులకు రూ. 2,560.47 కోట్లు ఇచ్చారు. 1,21,086 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. 1,042.83 కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్ప కాలిక(టర్మ్) రుణాల రూపంలో 97,638 మంది రైతులకు బ్యాంకర్లు రూ. 1,175.09 కోట్లను రుణంగా ఇచ్చారు. మరో రూ. 17 కోట్లను బ్యాంకులు కౌలు రైతులకు రుణాలుగా అందజేశాయి. అంటే వ్యవసాయ, బంగారు రుణాల రూపంలో రూ. 4,778.39 కోట్లను రైతులు బ్యాంకర్లకు బకాయిపడినట్లు స్పష్టమవుతోంది. బాబు ఇచ్చిన హామీ మేరకు రూ. 4,778.39 కోట్లను మాఫీ చేయాలి.
కానీ.. ఏరుదాటక తెప్ప తగలేసినట్టు.. అధికారం చేపట్టాక చంద్రబాబు ఎన్నికల హామీలకు మంగళం పాడారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వ్యవసాయ, బంగారు రుణం అన్నీ కలిపి గరిష్టంగా రూ. 1.50 లక్షలోపు మాఫీ చేస్తానని ప్రకటించారు. దీని ప్రకారం వ్యవసాయ, బంగారు రుణాలను రెండింటినీ కలిపితే జిల్లాలో 5,24,038 మంది తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక టర్మ్, వ్యవసాయ అనుబంధ రుణాలు తదితరాలను కలిపితే మొత్తం మీద జిల్లాలో 6,21,676 లక్షల మంది తీసుకున్నారు. చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణ మాఫీ వర్తింపజేస్తే.. రూ. 955 కోట్లకు మించి మాఫీ అయ్యే అవకాశం లేదని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు.
డ్వాకా మహిళలకు కుచ్చుటోపీ..
డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిలువునా ముంచారు. రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్న బాబు ఇప్పుడు ఒక్కో సంఘానికి సంబంధించి కేవలం రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల 70 శాతం సంఘాలకు ఉపయోగం ఉండదు. జిల్లాలో 35 వేల స్వయం సహాయక సంఘాలు(ఎన్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 3.50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో 2014 మార్చి 31 నాటికి రూ. 538 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డాయి. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు (టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజిన్) పథకం కింద ఒక్కో మహిళా సంఘానికి గరిష్టంగా రూ. ఐదు లక్షల వరకూ రుణాలు పంపిణీ చేశారు.
వీటిలో 70 శాతం సంఘాలు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు తీసుకున్నాయి. వీటికి ప్రస్తుతం రుణ మాఫీతో ఒరిగేది శూన్యం. రూ. 5 లక్షల రుణంలో కేవలం రూ. లక్ష మాత్రమే రుణ మాఫీ కింద రద్దు అవుతుంది. మిగిలిన రూ. 4 లక్షలు బకాయిగానే మిగిలి పోనుంది. ప్రస్తుతం జిల్లాలో ఒక్కో సంఘానికి రూ. లక్ష మాత్రమే రుణ మాఫీ వర్తింపుజేస్తామన్న బాబు ప్రకటన మేరకు రూ. 538 కోట్ల డ్వాక్రా రుణాలకు గానూ రూ. 135 కోట్లకు మించి మాఫీ కావని ఇందిరా కాంత్రిపథకం(ఐకేపీ) అధికారులే స్పష్టీకరిస్తున్నారు.
తూతూమంత్రం..
Published Wed, Jul 23 2014 12:10 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
Advertisement