సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక డ్రామాలాడుతున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాట బూటకమని మండిపడుతున్నారు. పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయకుండా.. రైతులను కించపరుస్తూ మాట్లాడటం తగదన్నారు.
రెచ్చగొట్టే మాటలు మానుకొని ఇచ్చిన హామీని యథాతథంగా అమలు చేయాలని కోరారు. కమిటీలతో కాలయాపన చేయకుండా తక్షణమే రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నరకాసురవధ కార్యక్రమంలో మూడో రోజు శనివారం రైతులు కదంతొక్కారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన గళం వినిపించారు. రుణమాఫీపై రోజుకొక ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో ఆందోళనలు చేశారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల, బత్తలూరు, పేరాయిపల్లి, గోపాలపురం, చిన్నకందుకూరులో నిరసనలు తెలిపారు.
ఖరీఫ్ సమయం దాటిపోతున్నా ఇప్పటి వరకు రుణాలు అందలేదని, రుణమాఫీపై స్పష్టత రాలేదని.. వ్యవసాయం ఎలా చేయలాంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరువెళ్ల మండలం గోవిందపల్లె, చాగలమర్రిలో, రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
మోసం చేయడం ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడి నైజమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డోన్ మండలం గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెరువు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలియజేశారు. అదే విధంగా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు.
బాబు మాట బూటకం
Published Sun, Jul 27 2014 1:18 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement