narakasuravadha
-
బాబు మాట బూటకం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక డ్రామాలాడుతున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాట బూటకమని మండిపడుతున్నారు. పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయకుండా.. రైతులను కించపరుస్తూ మాట్లాడటం తగదన్నారు. రెచ్చగొట్టే మాటలు మానుకొని ఇచ్చిన హామీని యథాతథంగా అమలు చేయాలని కోరారు. కమిటీలతో కాలయాపన చేయకుండా తక్షణమే రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నరకాసురవధ కార్యక్రమంలో మూడో రోజు శనివారం రైతులు కదంతొక్కారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన గళం వినిపించారు. రుణమాఫీపై రోజుకొక ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో ఆందోళనలు చేశారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల, బత్తలూరు, పేరాయిపల్లి, గోపాలపురం, చిన్నకందుకూరులో నిరసనలు తెలిపారు. ఖరీఫ్ సమయం దాటిపోతున్నా ఇప్పటి వరకు రుణాలు అందలేదని, రుణమాఫీపై స్పష్టత రాలేదని.. వ్యవసాయం ఎలా చేయలాంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరువెళ్ల మండలం గోవిందపల్లె, చాగలమర్రిలో, రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మోసం చేయడం ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడి నైజమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డోన్ మండలం గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెరువు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలియజేశారు. అదే విధంగా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. -
సర్కారు తీరుపై సమరభేరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీపై రోజుకో ప్రకటనతో కాల యాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘నరకాసురవధ’ పేరిట రెండో రోజైన శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు పోటెత్తాయి. రైతులు, మహిళలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నియోజ కవర్గ, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు హోరెత్తాయి. అన్నదాతలను, ఆడపడుచులను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని నినదించారు. పెనుగొండలో వైఎస్సార్ సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీ్రందనాథ్, ఆచం ట నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు నాయకత్వంలో నిర్వహించిన ఆందోళనకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. రాస్తారోకోతో రోడ్డుకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రవీ్రందనాథ్, ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేయాలని, ఖరీఫ్ సాగుకు వెంటనే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబు బండారం బయటపడింది : బాలరాజు బుట్టాయగూడెంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. తాను మారానంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నయవంచన రెండు నెలల్లోనే బయటపడిందని విమర్శించారు. ప్రజాందోళనతోనైనా దిగివచ్చి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలకొల్లులో రాస్తారోకో చేపట్టి చంద్రబాబు దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రీషెడ్యూల్, మ్యాచింగ్ గ్రాంట్ అంటూ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయరహదారిపై రాస్తారోకో వీరవాసరంలో పార్టీ నేతలు, రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జెడ్పీటీసీ మానుకొండ ప్రదీప్‌కుమార్, ఎంపీపీ కౌరు శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ పోతుపల్లి బాబు నాయకత్వం వహించారు. దేవరపల్లి మూడుబొమ్మల సెంటర్, బంధపురం, గోపాలపురంలలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకటరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఉండిలో పార్టీ కార్యకర్తలు బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చాగల్లులో పార్టీ మండల కన్వీనర్ బొర్రా కృష్ణారావు, నాయకుడు జి.రామచంద్రరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి వెంటనే రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
వైఎస్ఆర్సీపీకి పోటీగా టీడీపీ నేతల ధర్నా
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. రైతులను, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. రుణాల మాఫీపై చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిరసనగా గురువారం నుంచి మూడు రోజుల పాటు 'నరకాసురవధ' పేరుతో గ్రామాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు.