కరువు ఉరుముతున్నా.. జాడ లేని ముఖ్యమంత్రి
- ప్రధానితో వివిధ రాష్ట్రాల సీఎంల భేటీలు, ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తులు
- విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు
- వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికేనా?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సహాయక చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. ఆర్థిక సాయం అందజేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం ప్రధానితో భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరువు కరాళనృత్యం చేస్తుండటంతో ప్రజలకు తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే రంగంలోకి దిగి, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు జాడ మాత్రం కనిపించడంపోవడం పట్ల అధికార పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలు, విహారాలతో తీరిక లేకుండా ఉండడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు విదేశీ పర్యటనకు ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదివారం రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి విదేశాలకు పయనమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారనేదానిపై టీడీపీ నేతలకే స్పష్టత లేకపోవడం గమనార్హం. తమకున్న సమాచారం ప్రకారం.. సీఎంతొలుత థాయ్‌లాండ్‌కు వెళ్లి, అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌కు వెళతారని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
బాబు కన్నా రెండు రోజులు ముందు ఆయన తనయుడు లోకేశ్ కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. తండ్రీకొడుకులు కలిసి వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకోవడానికే విదేశీ పర్యటనలకు వెళ్లారనే చర్చ టీడీపీ నేతల మధ్య జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు 15వ తేదీన విజయవాడకు చేరుకోవాల్సి ఉంది. విదేశాల్లో పనులను చక్కబెట్టుకుని అంతకన్నా ఒకటి, రెండు రోజులు ముందు స్వదేశానికి తిరిగి చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ నాయకులు అంటున్నారు. సొంత పార్టీలోని కీలక నేతలకు కూడా తెలియకుండా సీఎం ఎక్కడికి వెళ్లి ఉంటారనే విషయం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామప్రసాద్‌కు అనుమానాస్పద కంపెనీలతో ఉన్న సంబంధాలను పనామా పేపర్స్ బయటపెట్టిన తరుణంలోనే చంద్రబాబు విదేశాల్లో పర్యటన కొనసాగిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.