మళ్లీ మొదలైన బాబు విదేశీ పర్యటనలు
మళ్లీ మొదలైన బాబు విదేశీ పర్యటనలు
Published Thu, Jan 5 2017 7:32 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
హైదరాబాద్, సాక్షి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్లలో అనేక దేశాల్లో పర్యటించి వచ్చిన చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ బాట పట్టనున్నారు. ఇప్పటికే చైనా, జపాన్, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను చుట్టొచ్చిన చంద్రబాబు ఈ నెలలో మరోసారి విదేశాలకు వెళుతున్నారు.
ఈ నెల 7, 8 తేదీల్లో చంద్రబాబు నాయుడు శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఐఏఎస్ అధికారులు జి.సాయి ప్రసాద్, బి.రామాంజనేయులు, బి.రాజశేఖర్, మెప్మా డైరెక్టర్ తదితరులు చంద్రబాబు వెంట వెళ్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళుతుండగా, ఇందుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల ఈ నెల 16 నుంచి 21 వరకు స్విట్జర్లాండ్ కు పయనమవుతున్నారు. ప్రపంచ ఆర్థికసంస్థ ఆహ్వానం మేరకు స్విట్జర్లాండ్ లో పర్యటనకు వెళుతున్నారని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ అరోకియా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రాలతో పాటు మరో అయిదురుగు చంద్రబాబు వెంట వెళతారు.
ముఖ్యమంత్రి బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా విదేశీ బాట పట్టనున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శి సాయి గోపాల్, సాల్మన్ అరోకియా, కార్తికేయ మిశ్రా, కోన శ్రీధర్ లు ఈ నెల 9 నుంచి 12 వరకు దక్షిణ కొరియాలో పర్యటనకు వెళుతున్నారు. అక్కడి నుంచి తిరిగి రాగానే ఈ నెల 13, 14 రెండు రోజుల పాటు కువైట్ పర్యటనకు వెళుతున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శ్రీధర్ మినహా సాయి ప్రసాద్ తో పాటు సాల్మన్ అరోకియా, కార్తికేయ మిశ్రా కువైట్ సందర్శిస్తారు. వీరి పర్యటనకు అయ్యే ఖర్చు ఏపీఐఐసీ భరిస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Advertisement