ఎన్టీఆర్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.
నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం.
చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.
చెప్పాల్సిన అవసరం ఉంది
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్‌సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?.
Comments
Please login to add a commentAdd a comment